Let's talk: editor@tmv.in
హైదరాబాద్ మెట్రోను జోక్‌గా మార్చారు: బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి

హైదరాబాద్ మెట్రోను జోక్‌గా మార్చారు: బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి

Gaddamidi Naveen
25 జూన్, 2026

హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-1 స్వాధీనం, ఫేజ్-2 విస్తరణ ప్రణాళికల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై బీఆర్ఎస్ నాయకుడు రావుల శ్రీధర్ రెడ్డి బుధవారం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్, బీజేపీల మధ్య సాగుతున్న పరస్పర నిందారోపణలు చూసి తెలంగాణ ప్రజలు విసిగిపోయారని ఆయన మండిపడ్డారు. ఈ మొత్తం ప్రక్రియలో తీవ్ర గందరగోళం, జాప్యం జరుగుతోందని ఆరోపిస్తూ.. పాలకులు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

హైదరాబాద్ మెట్రో విస్తరణ ప్రాజెక్టు మరింత ఆలస్యమయ్యేలా ఫేజ్-1 విలువ నిర్ధారణకు, 7 కారిడార్లతో 122 కిలోమీటర్ల మేర ప్రతిపాదించిన ఫేజ్-2 నివేదిక తయారీకి 'ఎస్బీఐ క్యాప్స్' ను కన్సల్టెంట్‌గా నియమిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆయన స్పందించారు.

ఈ సందర్భంగా రావుల శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మెట్రో వ్యవహారాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక జోక్‌గా మార్చేశాయని విమర్శించారు. మెట్రో ప్రాజెక్టు కన్సల్టెంట్‌ను అకస్మాత్తుగా 'ఐడీబీఐ' నుంచి 'ఎస్బీఐ క్యాప్స్' కు ఎందుకు మార్చారో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. మీడియా నివేదికల ప్రకారం రూ. 13,400 కోట్ల రుణాల ప్రక్రియ ఇప్పుడు పూర్తిగా నిలిచిపోయింది. దీనివల్ల ఈ సమగ్ర అధ్యయనం మళ్లీ మొదటి నుంచి ప్రారంభం కానుంది. మెట్రో నిర్వహణలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిరోజూ భారీగా డబ్బు నష్టపోతోందని ఆయ‌న పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ప్రస్తుత స్థితి, ఆలస్యం వల్ల ఎదురవుతున్న ఆర్థిక పరిణామాలు, నిధుల మంజూరుపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర ప్రభుత్వ నోడల్ ఏజెన్సీ కలిసి సంయుక్తంగా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి స్పష్టత ఇవ్వాలన్నారు.

మరోవైపు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, అశ్వినీ వైష్ణవ్, కిషన్ రెడ్డిలతో జరిపిన ఉన్నత స్థాయి సమావేశాలలో మెట్రో ప్రాజెక్టుల వేగవంతానికి ఎస్బీఐ క్యాప్స్‌ను నియమించిన సంగతి తెలిసిందే. ఈ అధ్యయనంలో సమన్వయం కోసం కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారితో పాటు, రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని ప్రతినిధులుగా నియమించారు. అయితే, ఈ కొత్త కన్సల్టెన్సీ నియామకం వల్ల ప్రాజెక్టు మరింత కాలయాపన అవుతుందని ప్రతిపక్ష బీఆర్ఎస్ తీవ్రంగా ఆక్షేపిస్తోంది.

ట్యాగ్‌లు
HyderabadMetroMetroRailHyderabadTelanganaBRSRavulaSridharReddyCongressBJPRevanthReddyMetroPhase2HyderabadDevelopment
హైదరాబాద్ మెట్రోను జోక్‌గా మార్చారు: బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి - Tholi Paluku