


మానవత్వం గెలిచింది.. చిన్నారి పునర్వికకు రూ. 16 కోట్ల ఇంజెక్షన్ అందించిన వైద్యులు
ఆ చిన్నారి వయసు ఏడాది కూడా నిండలేదు.. కానీ ఆమె పోరాడుతున్నది మృత్యువుతో. అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారిని కాపాడుకోవడానికి ఒక సామాన్య కుటుంబం చేసిన పోరాటం, దానికి తోడైన ఒక రాజకీయ నాయకుడి మానవత్వం నేడు ప్రత్యేకంగా నిలిచింది. కర్నూలు జిల్లాకు చెందిన చిన్నారి పునర్వికకు రూ. 16 కోట్ల విలువైన ఇంజెక్షన్‌ను అందించడం ద్వారా మంత్రి నారా లోకేష్ ఆమెకు పునర్జన్మను ప్రసాదించారు.
కర్నూలు జిల్లా వెల్దుర్తికి చెందిన జంపాల మంగళ సురేష్ కుమార్ వృత్తిరీత్యా నాయిబ్రాహ్మణుడు. తన గారాల పట్టి పునర్విక పుట్టిన ఆరు నెలల వరకు అంతా సజావుగానే సాగింది. అయితే, వయసు పెరుగుతున్నా చిన్నారి శరీరంలో కదలికలు లేకపోవడాన్ని గమనించిన తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. స్థానిక వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌లోని రెయిన్ బో ఆసుపత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. పునర్విక స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ (SMA Type-1) అనే అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతోందని తేల్చారు. ఈ వ్యాధి సోకిన పిల్లల కండరాలు క్రమంగా క్షీణించి, శ్వాస తీసుకోవడం కూడా కష్టమై ప్రాణాపాయం సంభవిస్తుంది. దీనికి ఏకైక పరిష్కారం అమెరికాకు చెందిన నోవార్టీస్ సంస్థ తయారు చేసే 'జోల్ జెన్ స్మా' అనే జీన్ థెరపీ ఇంజెక్షన్. దీని ధర అక్షరాలా రూ. 16 కోట్లు.
ప్రజల భాగస్వామ్యం - లోకేష్ భరోసా
రెక్కాడితే గానీ డొక్కాడని ఆ కుటుంబానికి రూ. 16 కోట్లు అనేది కలలో కూడా ఊహించని అంకె. దీంతో సోషల్ మీడియా వేదికగా "సేవ్ పునర్విక" పేరుతో పెద్ద ఎత్తున ప్రచారం మొదలైంది. వేలాది మంది దాతలు స్పందించి సుమారు రూ. 10 కోట్ల వరకు విరాళాలు అందించారు. కానీ, ఇంజెక్షన్ తెప్పించాలంటే ఇంకా భారీ మొత్తం అవసరమైంది. ఈ క్రమంలో చిన్నారి తల్లిదండ్రులు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా మంత్రి నారా లోకేష్‌ను ఆశ్రయించారు. విషయం తెలుసుకున్న వెంటనే లోకేష్ స్పందించి, "పునర్విక బాధ్యత నాది.. ఆ పాపను కాపాడుకుందాం" అంటూ భరోసా ఇచ్చారు. వెంటనే మిగిలిన రూ. 6 కోట్లు స్వయంగా అందించి చిన్నారి ప్రాణాలకు అండగా నిలిచారు.
అడ్డంకులు అధిగమించి.. అన్నీ తానై..
కేవలం హామీ ఇవ్వడమే కాకుండా, ఆ ఇంజెక్షన్‌ను అమెరికా నుంచి రప్పించే ప్రక్రియను లోకేష్ స్వయంగా పర్యవేక్షించారు. విదేశీ మందుల దిగుమతిలో ఉండే చట్టపరమైన ఇబ్బందులు, కస్టమ్స్ క్లియరెన్స్, నోవార్టీస్ సంస్థతో సమన్వయం వంటి పనుల కోసం తన ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు. నిధుల కొరత లేకుండా చూడటంతో పాటు, వైద్య పత్రాల తయారీలో ఎక్కడా జాప్యం జరగకుండా నిరంతరం పర్యవేక్షించారు. లోకేష్ పట్టుదల వెనుక ఉన్నది ఒక చిన్నారి ప్రాణం మాత్రమే కాదు, ఆమె నవ్వును చూడాలనుకునే లక్షలాది మంది ఆకాంక్ష.
పునర్జన్మ పొందిన వేళ
ఎట్టకేలకు అమెరికా నుంచి వచ్చిన రూ. 16 కోట్ల ఇంజెక్షన్‌ను శనివారం ఉదయం హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని రెయిన్ బో ఆసుపత్రిలో పునర్వికకు ఇచ్చారు. ఈ చారిత్రాత్మక ఘట్టంలో మంత్రి నారా లోకేష్ స్వయంగా పాల్గొన్నారు. ఇంజెక్షన్ వేస్తున్న సమయంలో చిన్నారి వెంటే ఉండి, వైద్యులతో మాట్లాడి చికిత్స వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏడుస్తున్న పాపను చేతుల్లోకి తీసుకుని లాలించడం అక్కడున్న వారిని కదిలించింది.
"మా బిడ్డకు మేము జన్మనిస్తే.. లోకేష్ బాబు పునర్జన్మను ఇచ్చారు" అంటూ పునర్విక తల్లిదండ్రులు భావోద్వేగానికి లోనయ్యారు. కోట్లాది రూపాయల ఖర్చుతో కూడిన వైద్యం తమలాంటి సామాన్యులకు అందుతుందంటే అది కేవలం లోకేష్ చొరవ, దాతల దాతృత్వం వల్లే సాధ్యమైందని కొనియాడారు. రాజకీయం అంటే కేవలం విమర్శలు కాదని, ఆపదలో ఉన్న వారికి అండగా నిలవడమేనని లోకేష్ మరోసారి నిరూపించారు. నేడు పునర్విక ముఖంలో కనిపిస్తున్న చిరునవ్వు.. మానవత్వం గెలిచిందనడానికి సజీవ సాక్ష్యం.
