Let's talk: editor@tmv.in
2022 వివాదాస్పద కేసులో ఎమ్మెల్యే రాజాసింగ్‌కు భారీ ఊరట

2022 వివాదాస్పద కేసులో ఎమ్మెల్యే రాజాసింగ్‌కు భారీ ఊరట

Gaddamidi Naveen
1 జులై, 2026

మతపరమైన విద్వేషాలు, మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారంటూ 2022లో నమోదైన ఒక వివాదాస్పద కేసులో గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే టీ రాజాసింగ్ కు భారీ ఊరట లభించింది. ఆయనపై నమోదైన కేసును హైదరాబాద్‌లోని ప్రజాప్రతినిధుల (ఎంపీలు, ఎమ్మెల్యేల) ప్రత్యేక కోర్టు మంగళవారం కొట్టివేసింది.

ఈ కేసు 2022, ఆగస్టు నెలలో ప్రవక్త మహ్మద్ జీవితానికి సంబంధించిన వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై ఐపీసీ సెక్షన్లు 153ఏ(a)(b), 295ఏ, 504, 505(2), 506 కింద మంగళహాట్ పోలీస్ స్టేషన్‌లో రాజాసింగ్‌పై అప్పట్లో కేసు నమోదైంది. అయితే, న్యాయస్థానం ఇరుపక్షాల వాదనలు, సాక్ష్యాధారాలను పరిశీలించిన అనంతరం రాజాసింగ్‌పై మోపిన ఆరోపణలు ఏవీ సరైనవి కావని నిర్ధారించింది. ఈ నేపథ్యంలోనే రాజాసింగ్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ తుది తీర్పును వెలువరించింది.

న్యాయవ్యవస్థపై నమ్మకం నిజమైంది: ఎమ్మెల్యే రాజాసింగ్

కోర్టు తీర్పు అనంతరం ఎమ్మెల్యే రాజాసింగ్ మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ పార్టీల ఒత్తిడి కారణంగానే తనపై అప్పట్లో అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. నేను ఎవరి దేవుడిని లేదా దేవతలను ఉద్దేశించి ఎలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేయలేదని మొదటి నుంచి చెబుతూనే ఉన్నాను. కానీ, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంఐఎం పార్టీ ఒత్తిడికి తలొగ్గి నాపై పీడీ యాక్ట్ ప్రయోగించి, దాదాపు 77 రోజుల పాటు జైల్లో పెట్టిందన్నారు. నాపై కథనాలను మార్చి వేర్వేరు పోలీస్ స్టేషన్లలో తప్పుడు కేసులు పెట్టారు. నాకు భారత న్యాయవ్యవస్థపై పూర్తి నమ్మకం ఉంది. నేడు న్యాయమే గెలిచిందని తెలిపారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనూ నాపై కొన్ని తప్పుడు కేసులు నమోదయ్యాయి, వాటిలో కూడా నేను నిర్దోషిగా బయటకు వస్తాననే నమ్మకం ఉందని పేర్కొన్నారు.

కేసు నిలబడలేదు: న్యాయవాది కరుణాసాగర్

ఎమ్మెల్యే రాజాసింగ్ తరఫు న్యాయవాది కరుణాసాగర్ మాట్లాడుతూ.. ప్రవక్త మహ్మద్ జీవితాన్ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారంటూ 2022లో మంగళహాట్ పోలీసులు నమోదు చేసిన కేసులో కోర్టు సరైన తీర్పునిచ్చిందన్నారు. కేసులోని ఫిర్యాదుదారే స్వయంగా ఆ వ్యాఖ్యలు ఇస్లామిక్ సాహిత్యానికి సంబంధించినవని అంగీకరించారని లాయర్ తెలిపారు. కోర్టు అన్ని సాక్ష్యాలను, విచారణలను నిశితంగా పరిశీలించిన తర్వాత రాజాసింగ్‌పై నేరం రుజువు కాలేదని తేల్చిచెప్తూ, ఆయనను గౌరవప్రదంగా విడిచిపెట్టిందని పేర్కొన్నారు. ఈ తీర్పుతో రాజాసింగ్ అభిమానులు హ‌ర్షం వ్యక్తం చేశారు.

ట్యాగ్‌లు
TRajaSinghRajaSinghHyderabadTelanganaBreakingNewsTeluguNewsHyderabadNewsCourtVerdictCourtNewsPolitics