

కాళేశ్వరం కేసులో కేసీఆర్‌కు భారీ ఊరట
కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మాణంలో జరిగినట్లుగా భావిస్తున్న అక్రమాలపై విచారణ జరిపిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక అంశంలో మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు, మాజీ మంత్రి హరీష్ రావు, ఇతర అధికారులకు తెలంగాణ హైకోర్టు బుధవారం భారీ ఊరటనిచ్చింది. ఈ కమిషన్ సమర్పించిన నివేదిక ఆధారంగా పిటిషనర్లపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని హైకోర్టు ధర్మాసనం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న ఈ కేసులో, గత కొంతకాలంగా సాగుతున్న ఉత్కంఠకు తెరదించుతూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే నేతృత్వంలోని ధర్మాసనం ఈ కీలక తీర్పును వెలువరించింది.
అయితే, ఈ తీర్పులో కోర్టు ఒక ముఖ్యమైన విషయాన్ని స్పష్టం చేసింది. ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ను ఏర్పాటు చేయడం చట్టవిరుద్ధమని గానీ, రాజ్యాంగ విరుద్ధమని గానీ తాము భావించడం లేదని పేర్కొంది. కమిషన్ ఏర్పాటు ప్రక్రియ సహేతుకమైనదేనని, అది ఏకపక్షం కాదని కోర్టు అభిప్రాయపడింది. కానీ, ఆ కమిషన్ నివేదికలో పొందుపరిచిన అంశాలు, తీర్మానాలు చేసే క్రమంలో అనుసరించిన విధానాలపై మాత్రం న్యాయస్థానం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. నివేదికలోని కొన్ని భాగాలు పిటిషనర్ల ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నాయని కోర్టు గుర్తించింది.
ఈ కేసులో ప్రధానంగా 'నేచురల్ జస్టిస్' లేదా సహజ న్యాయ సూత్రాల ఉల్లంఘన జరిగిందని హైకోర్టు పేర్కొంది. కమిషన్ల విచారణ చట్టం, 1952లోని సెక్షన్ 8B ప్రకారం, ఎవరిపైనైనా ఆరోపణలు చేసే ముందు లేదా వారి ప్రతిష్టకు భంగం కలిగేలా నివేదిక ఇచ్చే ముందు, సదరు వ్యక్తులకు తమ వాదనను వినిపించుకునే పూర్తి అవకాశం కల్పించాలి. కానీ, ఈ కేసులో పిటిషనర్లకు అటువంటి అవకాశం కల్పించకుండానే కమిషన్ తన అన్వేషణలను వెల్లడించిందని, ఇది చట్టబద్ధమైన రక్షణలను ఉల్లంఘించడమేనని కోర్టు అభిప్రాయపడింది. అందుకే ఆ నివేదికలోని ప్రతికూల అంశాలు చెల్లుబాటు కావని తీర్పునిచ్చింది.
గత ఏడాది ఆగస్టులో రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఈ నివేదికలో, కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల నిర్మాణంలో జరిగిన లోపాలు, ఆర్థిక అక్రమాలకు కేసీఆర్, హరీష్ రావు బాధ్యులని కమిషన్ పేర్కొంది. ముఖ్యంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల వైఫల్యానికి సంబంధించి ఉన్నతాధికారుల పాత్రను కూడా ఎత్తిచూపింది. ఈ నివేదిక ఆధారంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని సీబీఐ విచారణకు అప్పగిస్తామని గతంలో ప్రకటించింది. అయితే తాజా కోర్టు తీర్పుతో ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ముందుకు వెళ్లే అవకాశం ప్రస్తుతానికి నిలిచిపోయింది.
రాజకీయ కక్ష సాధింపు చర్య
పిటిషనర్లు తమ వాదనలో.. కమిషన్ తమకు నోటీసులు ఇవ్వడంలో, వివరణలు తీసుకోవడంలో నిబంధనలను పాటించలేదని, కేవలం ఒక పక్షం వాదనల ఆధారంగానే ఏకపక్షంగా నివేదిక రూపొందించిందని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ నివేదికను సిద్ధం చేశారని వారు ఆరోపించారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం, నివేదికలోని విచారణాంశాలు పిటిషనర్ల ప్రవర్తనను తప్పుబట్టేలా ఉన్నాయని, తగిన విచారణ ప్రక్రియ లేకుండా వాటిని పరిగణనలోకి తీసుకోవడం సాధ్యం కాదని తేల్చిచెప్పింది.
మొత్తానికి, ఈ హైకోర్టు తీర్పు బీఆర్ఎస్ శ్రేణులకు పెద్ద ఊరటనిచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం తీసుకునే తదుపరి చర్యలపై ఈ తీర్పు తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. కమిషన్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఎలాంటి శిక్షాత్మక చర్యలు తీసుకోకుండా కోర్టు అడ్డుకట్ట వేయడం కేసీఆర్‌కు న్యాయపరమైన విజయం అని చెప్పవచ్చు. ఇకపై ప్రభుత్వం ఈ విషయంలో ఎలా స్పందిస్తుంది, లోపాలను సరిదిద్దడానికి లేదా తదుపరి విచారణకు ఎలాంటి చట్టపరమైన మార్గాలను అన్వేషిస్తుంది అనేది వేచి చూడాలి.
సత్యమేవ జయతే
కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను నిలిపివేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు అని బీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియా వేదికగా ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక అంతా ట్రాష్.. చెత్త బుట్టలో వేయాల్సిందే! అంటూ ఎద్దేవా చేశారు.
కమిషన్ పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్యాన్ని దెబ్బతీయాలనే రేవంత్ ప్రభుత్వ కుట్రలను హైకోర్టు తిప్పికొట్టిందని , సత్యం గెలిచిందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఎవరెన్ని కుట్రలు చేసినా న్యాయస్థానాల్లో అంతిమంగా ధర్మం జయిస్తుందని, సత్యం నినదిస్తుందని ఈరోజు మరోసారి నిరూపితమైంది. ప్రాథమిక హక్కులు, సహజ న్యాయ సూత్రాలను విస్మరిస్తూ నడిపిన విచారణను ఉన్నత న్యాయస్థానం తప్పుబట్టింది. వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా కమిషన్ చేసిన వ్యాఖ్యలు చెల్లవని, ఆ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోరాదని స్పష్టంగా తీర్పునిచ్చింది.
దీంతో కాంగ్రెస్ ప్రభుత్వ రాజకీయ కుట్రలు బట్టబయలయ్యాయి. ప్రజా సమస్యలు పక్కనపెట్టి డ్రామాలు ఆడిన రేవంత్ రెడ్డి నిజస్వరూపం హైకోర్టు తీర్పుతో తేటతెల్లం అయ్యింది. ఇప్పటికైనా కక్షసాధింపులు, రాజకీయ దుష్ప్రచారం మానేసి వెంటనే రెండు పిల్లర్ల మరమ్మతులు పూర్తి చేసి తెలంగాణ రైతుల ప్రయోజనాలు కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నాం అంటూ బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.
ముమ్మాటికీ పీసీసీ నివేదికే.. కేటీఆర్
కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వ రాజకీయ కుట్రలకు గట్టి ‘చెంపపెట్టు’ అని వర్ణించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇది పీసీ ఘోష్ కమిషన్ నివేదిక కాదు సరికదా ముమ్మాటికీ పీసీసీ నివేదికేనని తమ పార్టీ మొదటి నుంచి చెబుతున్న మాట నేడు అక్షరాలా నిజమైందని ధ్వజమెత్తారు. వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా వ్యవహరించిన తీరును న్యాయస్థానం ఎండగట్టిందని, ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ కక్షసాధింపు చర్యలు పక్కనపెట్టి, రెండేళ్లుగా ప్రాజెక్టును పడావు పెట్టినందుకు రాష్ట్ర రైతాంగానికి ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు; అలాగే వెంటనే మేడిగడ్డ బ్యారేజీకి మరమ్మతులు చేపట్టి సాగునీటి కష్టాలు తీర్చాలని, లేనిపక్షంలో అన్నదాతల చేతిలో ప్రభుత్వానికి వాతలు తప్పవని కేటీఆర్ హెచ్చరించారు.
హైకోర్టు తీర్పుపై ప్రభుత్వ వాదన
కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై విచారణకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పి.సి. ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఇతర అధికారులపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన నేపధ్యంలో, ఈ తీర్పుపై స్పందించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇది ఎవరికీ ఇచ్చిన 'క్లీన్ చిట్' కాదని స్పష్టం చేశారు. కమిషన్ నియామకాన్ని కానీ, దాని విచారణ ఫలితాలను కానీ కోర్టు తప్పుబట్టలేదని, కేవలం నోటీసుల జారీలో జరిగిన కొన్ని సాంకేతిక, విధానపరమైన లోపాలను మాత్రమే ఎత్తిచూపిందని ఆయన వివరించారు. ఈ తీర్పు సీబీఐ విచారణకు ఎలాంటి అడ్డంకి కాదని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
అవకతవకలు, నష్టాలపై ఉత్తమ్ విశ్లేషణ
వేల కోట్ల రూపాయల ప్రజా ధనంతో నిర్మించిన మేడిగడ్డ వంటి బ్యారేజీలు కేవలం మూడేళ్లలోనే కుంగిపోవడం దేశ చరిత్రలోనే అతిపెద్ద "మానవ నిర్మిత విపత్తు" అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అభివర్ణించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన ప్రాథమిక నివేదికలో సైట్ ఎంపిక, డిజైన్, నిర్మాణం, నిర్వహణలో తీవ్రమైన లోపాలు ఉన్నట్లు తేలిందని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర విజిలెన్స్ కమీషన్ కూడా ఇదే తరహా అక్రమాలను గుర్తించిందని, ఇంతటి భారీ నష్టానికి బాధ్యులైన వారిని చట్టం ముందు నిలబెట్టడం తమ ప్రభుత్వ బాధ్యతని ఆయన పునరుద్ఘాటించారు.
మరోవైపు, తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీలో మాట్లాడుతూ, కోర్టు కేవలం విధానపరమైన లోపాలను ప్రస్తావించిందని, అక్రమాలను కాదని స్పష్టం చేశారు. ఎన్డీఎస్ఏ, విజిలెన్స్ రిపోర్టులను కోర్టు కొట్టివేయలేదని ఆయన గుర్తు చేశారు.
కాగా, బీజేపి నేత బండి సంజయ్ ఈ వ్యవహారంపై ఘాటుగా స్పందించారు. కేసీఆర్, రేవంత్ రెడ్డి మధ్య 'క్విడ్ ప్రో కో' (ఒకరికి ఒకరు సహకరించుకోవడం) జరుగుతోందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ గతంలో లక్ష కోట్ల అవినీతి అని చెప్పి, ఇప్పుడు కేవలం 9,000 కోట్లకు మాత్రమే సీబీఐ విచారణ కోరడం వెనుక రహస్య ఒప్పందం ఉందని ఆయన విమర్శించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై హైకోర్టు తీర్పు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో పెను దుమారం రేపింది. ప్రభుత్వం పూర్తి స్థాయి తీర్పును పరిశీలించిన తర్వాత తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి సీబీఐ విచారణ కోరుతూ లేఖ రాసిన నేపథ్యంలో, ఈ న్యాయపరమైన పరిణామాలు విచారణ ప్రక్రియపై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి. ఏది ఏమైనా, కోట్లాది రూపాయల ప్రజాధనం వృధా అయిన ఈ ప్రాజెక్టు విషయంలో వాస్తవాలను బయటకు తీసి, బాధ్యులను శిక్షించాలని ఇటు ప్రజలు, అటు రాజకీయ పక్షాలు గట్టిగా కోరుతున్నాయి.
