
ఈ 8 రకాల వరి సాగుతో రైతులకు భారీ లాభాలు.. కేబినెట్ సబ్‌కమిటీ సూచనలు
దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లోనూ అద్భుతమైన ఆదరణ ఉన్న 8 రకాల మేలురకం వరి సాగుపై రాష్ట్రవ్యాప్తంగా రైతులకు పెద్ద ఎత్తున విస్తృతమైన అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని వ్యవసాయ నిపుణులు, శాస్త్రవేత్తలు ప్రభుత్వానికి కీలక సూచనలు చేశారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన సోమవారం ప్రజా భవన్‌లో కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు డి. శ్రీధర్ బాబు, ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావులు హాజరై రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తి, ధాన్యం కొనుగోలు, నిల్వ సదుపాయాలు, వానకాలం సాగుపై సమీక్షించారు.
ఈ సందర్భంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు, వైస్ చాన్సలర్లు పాల్గొని పలు కీలక ప్రతిపాదనలను కమిటీ దృష్టికి తీసుకువచ్చారు. రైతులకు ఆర్థికంగా ఎంతో లాభదాయకమైన, ఎగుమతులకు అనుకూలమైన కింద పేర్కొన్న 8 వరి రకాల రైతులు పెద్ద ఎత్తున సాగు చేసేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని వారు స్పష్టం చేశారు.
బీపీటీ–5204, తెలంగాణ సోనా (ఆర్‌ఎన్‌ఆర్–15048), కేఎన్‌ఎమ్–1638, జై శ్రీరామ్, హెచ్‌ఎమ్‌టీ, డబ్ల్యూజీఎల్–962, డబ్ల్యూజీఎల్–44, జేజీఎల్–1798 రకాలకు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో మంచి డిమాండ్ ఉందని వారు వివరించారు. ముఖ్యంగా అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్ దేశాల్లో ఈ బియ్యానికి విశేష ఆదరణ ఉండటంతో రైతులు కనీస మద్దతు ధర కంటే అధిక ధరలు పొందే అవకాశం ఉందన్నారు.
ఈ రకాల విత్తనాల లభ్యత మార్కెట్లో సమృద్ధిగా ఉందని, ప్రభుత్వం గ్రామస్థాయిలో అవగాహన సదస్సులు నిర్వహించి రైతులను ప్రోత్సహించాలని నిపుణులు సూచించారు. రైతుల ఆదాయాన్ని పెంచడంతో పాటు మార్కెట్ ధరల హెచ్చుతగ్గుల ప్రభావాన్ని తగ్గించడంలో ఈ రకాల సాగు కీలకంగా ఉంటుందని పేర్కొన్నారు.
ఇక రాష్ట్రంలో సాగు చేస్తున్న అన్ని సన్న రకాల బియ్యానికి మార్కెట్లో సమాన డిమాండ్ లేదని సివిల్ సప్లై అధికారులు మంత్రులకు వివరించారు. కొన్ని రకాల ధాన్యం మిల్లింగ్ సమయంలో ఎక్కువగా విరిగిపోవడం, వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా లేకపోవడం వల్ల మిల్లర్లు, వ్యాపారులు వాటి కొనుగోలుకు ఆసక్తి చూపడం లేదన్నారు. ఈ 8 రకాలనే ప్రోత్సహిస్తే మిల్లర్లే నేరుగా రైతుల వద్దకు వచ్చి మంచి ధరకు కొనుగోలు చేస్తారని అధికారులు పేర్కొన్నారు. భవిష్యత్తులో రైతులకు నష్టాలు రాకుండా పూర్తిగా మార్కెట్ డిమాండ్ ఆధారిత పంటలనే ప్రోత్సహించాలని, కేంద్ర ప్రభుత్వ విధానాలకు అనుగుణంగానే ధాన్యం కొనుగోలు ప్రక్రియ కొనసాగించాలని అధికారులు నివేదించారు.
ఈ సమావేశంలో రైతు కమిషన్ చైర్మెన్ కోదండరెడ్డి, సీడ్ కార్పోరేషన్ చైర్మెన్ అన్వేష్ రెడ్డి, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరి సందీప్ కుమార్ సుల్తానియా, వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి సురేందర్ మోహన్, సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
