Let's talk: editor@tmv.in
హైదరాబాద్‌లో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టు

హైదరాబాద్‌లో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టు

Dantu Vijaya Lakshmi Prasanna
23 ఏప్రిల్, 2026

నగరంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు భారీ డ్రగ్స్ రాకెట్‌ను బట్టబయలు చేశారు. అక్రమంగా డ్రగ్స్ తయారీ జరుగుతున్న ఒక ల్యాబ్‌పై దాడులు నిర్వహించి, 69.6 కిలోల ఆల్ప్రాజోలామ్‌ను స్వాధీనం చేసుకోవడంతో పాటు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ డ్రగ్స్ విలువ సుమారు రూ.17.40 కోట్లుగా అంచనా వేయబడింది. అదనంగా, దాదాపు రూ.20 లక్షల విలువైన ముడి పదార్థాలను కూడా అధికారులు జప్తు చేశారు.

ఎన్‌సీబీ హైదరాబాద్ జోనల్ యూనిట్‌కు వచ్చిన ఖచ్చితమైన నిఘా వర్గాల సమాచారంపై స్పందించిన అధికారులు, ఏప్రిల్ 20న ఐడీఏ మౌలాలీలోని ఒక ఇండస్ట్రియల్ కెమికల్ యూనిట్‌పై సోదాలు చేపట్టారు. ఈ దాడుల్లో అక్కడ అక్రమంగా డ్రగ్స్ తయారీ జరుగుతున్నట్టు గుర్తించారు. ల్యాబ్‌లో చేసిన తనిఖీల్లో రెండు డ్రమ్‌లలో నిల్వ ఉంచిన పొడి పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు విచారణలో అది ఆల్ప్రాజోలామ్ అని, అదే ప్రాంగణంలో అక్రమంగా తయారు చేస్తున్నట్లు అంగీకరించారు.

ఈ కేసులో అరెస్ట్ అయిన ముగ్గురిలో ఒకరు కెమిస్టు, మరొకరు ముడి పదార్థాల సరఫరాదారు, ఇంకొకరు తయారైన డ్రగ్స్‌ను స్వీకరించి పంపిణీ చేసే వ్యక్తిగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వీరి మధ్య సమన్వయంతోనే ఈ అక్రమ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

ఎఫెడ్రిన్ తయారీకి కూడా భారీ స్కెచ్

ఆల్ప్రాజోలమ్ మాత్రమే కాకుండా, అక్కడ దొరికిన ఇతర రసాయనాలను చూసి అధికారులు విస్తుపోయారు. నిందితులను విచారించగా, వారు మరో ప్రమాదకరమైన డ్రగ్ 'ఎఫెడ్రిన్' తయారీకి కూడా రంగం సిద్ధం చేసుకున్నట్లు వెల్లడైంది. ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండానే భారీ మొత్తంలో కెమికల్స్, సాల్వెంట్లను వీరు సేకరించారు. దాదాపు 20 లక్షల రూపాయల విలువైన ముడి పదార్థాలను ఎఫెడ్రిన్ తయారీ కోసం సిద్ధంగా ఉంచారు. ఒకవేళ ఎన్‌సీబీ అధికారులు ఈ సమయంలో దాడులు చేయకపోయి ఉంటే, మార్కెట్లోకి మరిన్ని ప్రమాదకరమైన డ్రగ్స్ సరఫరా అయ్యేవని తెలుస్తోంది. ఈ ముడి పదార్థాలను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

కల్తీ కల్లు కోసమే ఈ డ్రగ్స్ వినియోగం?

పట్టుబడిన నిందితులు ఇచ్చిన వాంగ్మూలం తెలంగాణలో తీవ్ర ఆందోళన కలిగించే అంశాన్ని బయటపెట్టింది. వేసవి కాలంలో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కల్లు దుకాణాల్లో గిరాకీ విపరీతంగా పెరుగుతుంది. ఈ డిమాండ్‌ను సొమ్ము చేసుకోవడానికి కొందరు వ్యాపారులు కల్లులో ఆల్ప్రాజోలమ్‌ను కలుపుతుంటారు. దీనివల్ల తాగిన వారికి త్వరగా కిక్కు రావడమే కాకుండా, కల్లు చిక్కగా కనిపిస్తుంది. అయితే, ఇది ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని కల్లు దుకాణాలనే లక్ష్యంగా చేసుకుని ఈ ముఠా డ్రగ్స్ సరఫరా చేయాలని ప్లాన్ చేసింది. వేసవిలో అధిక లాభాల కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఈ ముఠా వెనుక ఉన్న సూత్రధారుల కోసం అధికారులు ఆరా తీస్తున్నారు.

లోతైన దర్యాప్తులో ఎన్‌సీబీ

ప్రస్తుతం అరెస్ట్ అయిన ముగ్గురు వ్యక్తులు కేవలం ఒక భాగం మాత్రమేనని, వీరి వెనుక పెద్ద డ్రగ్ మాఫియా ఉండే అవకాశం ఉందని ఎన్‌సీబీ అనుమానిస్తోంది. ఈ తయారీ కేంద్రానికి నిధులు ఎవరు సమకూర్చారు? తయారు చేసిన డ్రగ్స్‌ను ఎవరెవరికి విక్రయిస్తున్నారు? ఈ నెట్‌వర్క్ ఎక్కడి వరకు విస్తరించి ఉంది? అనే కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు. ముఖ్యంగా ఐడీఏ మౌలాలీలో ఇటువంటి అక్రమ కార్యకలాపాలు ఇన్ని రోజులు ఎలా సాగాయనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్‌ను డ్రగ్స్ రహిత నగరంగా మార్చే క్రమంలో ఈ ఆపరేషన్ ఒక పెద్ద విజయమని అధికారులు భావిస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని పారిశ్రామిక ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టనున్నట్లు అధికారులు హెచ్చరించారు.