Let's talk: editor@tmv.in
ఇంటి స్థలాల క్రమబద్ధీకరణ సమస్యలు వెంటనే పరిష్కరించాలి: సీఎం చంద్రబాబు

ఇంటి స్థలాల క్రమబద్ధీకరణ సమస్యలు వెంటనే పరిష్కరించాలి: సీఎం చంద్రబాబు

Gaddamidi Naveen
4 జూన్, 2026

రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఇళ్లు, ఇంటి స్థలాల క్రమబద్ధీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయిలో పరిష్కారం కాని కేసులను తుది నిర్ణయం కోసం మంత్రివర్గం ముందుకు తీసుకురావాలని ఆయన స్పష్టం చేశారు.

రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) కేంద్రం నుంచి ముఖ్యమంత్రి మంగళవారం వివిధ ప్రభుత్వ శాఖల పనితీరును సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పలు జిల్లాల్లో క్రమబద్ధీకరణ సమస్య చాలా కాలంగా పరిష్కారానికి నోచుకోకుండా మిగిలిపోయిందని, దీనికి ఇకపై ఎలాంటి ఆలస్యం లేకుండా ముగింపు పలకాలని అన్నారు. మనం ఈ సమస్యకు శాశ్వతంగా ఫుల్‌స్టాప్ పెట్టాలి. ప్రతి జిల్లాలో క్రమబద్ధీకరణ అవసరమైన ఇళ్లు, ఇంటి స్థలాల జాబితాను సిద్ధం చేయండి. జిల్లా స్థాయిలో పరిష్కరించే అవకాశం ఉన్న వాటిని అక్కడే పూర్తి చేయండి, మిగిలిన వివాదాస్పద అంశాలను కేబినెట్ దృష్టికి తీసుకురండి అని పేర్కొన్నారు.

దీనికోసం జిల్లా కలెక్టర్ల నుంచి అవసరమైన సమాచారాన్ని సేకరించి, ఎటువంటి వివాదాలు లేని కేసులను ప్రతి కేబినెట్ సమావేశంలోనూ ఆమోదం కోసం ఉంచాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అలాగే, గృహనిర్మాణ, ఆర్థిక శాఖలు పరస్పరం సమన్వయం చేసుకుంటూ హౌసింగ్ విభాగంలో పెండింగ్‌లో ఉన్న బిల్లులను తక్షణమే క్లియర్ చేయాలని ఆదేశించారు.

అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం

రాష్ట్రంలో అక్రమ ఇసుక రవాణాను పూర్తిగా అరికట్టాలని సీఎం పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో తవ్విన ఇసుకను ఇతర రాష్ట్రాలకు అక్రమంగా తరలించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, నిబంధనలు ఉల్లంఘించి రాష్ట్ర సరిహద్దులు దాటే వాహనాలను తక్షణమే సీజ్ చేయాలని ఆదేశించారు.

ఈ ప్రక్రియలో సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా ఉపయోగించాలని సీఎం పిలుపునిచ్చారు. ఇసుక రవాణా చేసే వాహనాలను నిరంతరం ట్రాక్ చేయాలని, అక్రమ రవాణాను గుర్తించేందుకు ‘ఇన్‌స్టంట్ అలర్ట్’ విధానాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 50,000 వాహనాలను జీపీఎస్ ద్వారా పర్యవేక్షిస్తున్నామని చెప్పిన ఆయన, మైనింగ్, పోలీసు శాఖలు ఈ విషయంలో అత్యంత సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లాలని, తద్వారా ప్రభుత్వ సేవ లభ్యతపై ప్రజా సంతృప్తి పెరుగుతుందని సీఎం పేర్కొన్నారు.