
ఏపీలో ఎండల ముప్ప.. పట్టణ ప్రాంతాల్లో 'హీట్‌వేవ్' అత్యవసర చర్యలకు ప్రభుత్వం ఆదేశాలు
ముంచుకొస్తున్న ఎండల ముప్పు, తీవ్ర ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. మే 20 నుండి 26వ తేదీ వరకు తీర ప్రాంత ఆంధ్రప్రదేశ్‌లో తీవ్రమైన వడగాల్పులు (హీట్‌వేవ్) వీచే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు రక్షణ చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని అన్ని పట్టణ స్థానిక సంస్థలు తక్షణమే అత్యవసర సన్నద్ధత ప్రణాళికలను అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
ఈ మేరకు మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్ మంగళవారం రాష్ట్రంలోని మున్సిపల్ కమిషనర్లకు ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యంగా మధ్య ఆంధ్రప్రదేశ్, ఉత్తర కోస్తా జిల్లాలపై వడగాల్పుల ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉందని ఆయా ప్రాంతాల్లో ప్రజా రక్షణకు తక్షణ నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పటిష్టమైన స్పందన వ్యవస్థలను ఏర్పాటు చేయడం ద్వారా ఎండల వల్ల ఎటువంటి ప్రాణనష్టం గానీ అనారోగ్య సమస్యలు గానీ తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
ఇదిలా ఉండగా వడగాల్పుల తీవ్రతపై ప్రజలను చైతన్యపరిచేందుకు విస్తృత అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. మున్సిపల్ వాహనాల ద్వారా పబ్లిక్ అనౌన్స్‌మెంట్లు చేయడం, సోషల్ మీడియా, వార్డు సచివాలయాలు, లోకల్ కేబుల్ నెట్‌వర్క్‌లు, ఎలక్ట్రానిక్ డిస్‌ప్లే బోర్డుల ద్వారా ఎండల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను (చేయాల్సినవి - చేయకూడనివి) వార్డుల వారీగా ప్రజలకు చేరవేయాలని యంత్రాంగం నిర్ణయించింది.
అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లోని రద్దీ ప్రదేశాలపై మున్సిపల్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. బస్ స్టాండ్లు, మార్కెట్లు, కూలీల కూడళ్లు, ఆసుపత్రులు, పాఠశాలలు, అన్నా క్యాంటీన్ల పరిసరాల్లో తాగునీటి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. వీటితో పాటు ఉచిత చలివేంద్రాలు, తాత్కాలిక నీటి కియోస్కులు, ఎండ తీవ్రతను తట్టుకునేలా కూలింగ్ షెల్టర్ల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాలని, నీటి కొరత ఉన్న ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా సరఫరాను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
మరోవైపు ఎండ దెబ్బకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉన్న పారిశుధ్య కార్మికులు, బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే రోజువారీ కూలీలు, వీధి వ్యాపారులు, నిరాశ్రయులు, వృద్ధుల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు. వార్డు స్థాయిలో పర్యవేక్షణ బృందాలను ఏర్పాటు చేసి వైద్య ఆరోగ్య శాఖతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన వైద్య సహాయక చర్యలు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. తీవ్ర ఎండల పరిస్థితుల దృష్ట్యా ప్రజలు మధ్యాహ్న సమయంలో అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని, తగినంత నీరు తాగుతూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
