Let's talk: editor@tmv.in
మీర్‌పేట్‌లో ఘోరం: కారు బానెట్‌పై వ్యక్తిని 2 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన డ్రైవర్

మీర్‌పేట్‌లో ఘోరం: కారు బానెట్‌పై వ్యక్తిని 2 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన డ్రైవర్

Gaddamidi Naveen
4 మే, 2026

నగరంలోని మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెన్నులో వణుకు పుట్టించే సంఘటన వెలుగులోకి వచ్చింది. కేవలం వాహనం మలుపు తీసుకునే విషయంలో తలెత్తిన వివాదం, ఒక వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చింది. ఒక మధ్యవయస్కుడిని కారు బానెట్‌పై సుమారు 2 కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

పోలీసులు, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. మే 1వ తేదీ రాత్రి మీర్‌పేట్ నుంచి ఎల్బీ నగర్ వైపు ఒక తండ్రీకొడుకులు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. కొడుకు బైక్ నడుపుతుండగా, తండ్రి వెనుక కూర్చున్నారు. సుమారు 500 మీటర్ల దూరంలో ఉన్న యూ-టర్న్ కోసం కొడుకు ముందుగానే ఇండికేటర్ వేశాడు. అదే దిశలో కారులో వస్తున్న డ్రైవర్, ఇంత ముందుగానే ఇండికేటర్ ఎందుకు వేశావంటూ బైక్ నడుపుతున్న యువకుడితో గొడవకు దిగాడు. మాటమాట పెరగడంతో కారు డ్రైవర్ కోపోద్రిక్తుడై, కారులో నుంచే ఆ యువకుడి జుట్టు పట్టుకుని కారును కొంత దూరం పోనిచ్చాడు. దీంతో యువకుడు బైక్ పై నుంచి కింద పడి గాయపడ్డాడు.

బానెట్‌పై 2 కిలోమీటర్ల ప్రయాణం

తన కొడుకును రక్షించేందుకు, కారును ఆపే ప్రయత్నంలో తండ్రి కారు బానెట్‌ను గట్టిగా పట్టుకున్నాడు. కానీ, కారు డ్రైవర్ ఏమాత్రం కనికరం లేకుండా కారును వేగంగా పోనిచ్చాడు. బాధితుడు బానెట్‌పై వేలాడుతున్నా పట్టించుకోకుండా మీర్‌పేట్ నుంచి బాలాపూర్ వరకు సుమారు 2 కిలోమీటర్ల మేర అలాగే ఈడ్చుకెళ్లాడు. చివరికి బాలాపూర్ వద్ద కారు ఆపి, బాధితుడు కిందకు దిగగానే డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు.

పోలీసుల విచారణ

ఈ భయానక దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మీర్‌పేట్ పోలీసులు కేసు నమోదు చేశారు. కారు డ్రైవర్ కనీసం మానవత్వం లేకుండా ప్రవర్తించాడు. నా కొడుకు జుట్టు పట్టుకుని లాగడంతో వాడు కిందపడి గాయపడ్డాడు. నేను కారును ఆపమన్నా వినకుండా నన్ను బానెట్‌పై ఈడ్చుకెళ్లాడు అని బాధితుడు మీడియా ముందు వాపోయాడు. ప్రస్తుతం పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని పట్టుకునేందుకు గాలిస్తున్నారు.