

కొలువు తెచ్చిన గౌరవం.. హైడ్రా ‘ఈగల్ టీమ్’లో ట్రాన్స్‌జెండర్లు
హైడ్రాలో దక్కిన ఉద్యోగం ట్రాన్స్‌జెండర్ల జీవితాల్లో కొత్త వెలుగులు నింపింది. సమాజంలో ఎగతాళి, వివక్షను ఎదుర్కొంటూ, ఒకప్పుడు భిక్షాటనతో జీవితాన్ని వెల్లదీసిన వారిలో ఈ కొలువు సరికొత్త ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని పెంపొందించింది. ప్రస్తుతం హైడ్రాలో మొత్తం 16 మంది ట్రాన్స్‌జెండర్లకు (11 మంది ట్రాన్స్ ఉమెన్, ఐదుగురు ట్రాన్స్ మెన్) ప్రభుత్వం అవకాశం కల్పించింది. వీరికి "హైడ్రా ఈగల్ టీమ్" అని నామకరణం చేసి విధుల్లో భాగస్వామ్యులను చేశారు.
చెరువులు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ భూముల పరిరక్షణలో ఈ బృందం కీలక పాత్ర పోషిస్తోంది. ఆక్రమణదారులు ఎంతటి వారైనా వెరవకుండా విధులు నిర్వహిస్తూ ప్రజా ఆస్తులను కాపాడడంలో ముందుంటున్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్‌లో 862 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించడంలో ట్రాన్స్‌జెండర్లు చురుకైన పాత్ర పోషించారు. ఇటీవల మాదాపూర్‌లో ఈదులకుంట పరిరక్షణ కార్యక్రమంలోనూ వారు విశేషంగా పనిచేశారు. ప్రజలకు నచ్చజెప్పడం, మహిళలతో మాట్లాడి పరిస్థితులను సర్దిచెప్పడం, అధికారులు–ప్రజల మధ్య సమన్వయం చేయడం వంటి అంశాల్లో ట్రాన్స్‌జెండర్లు ప్రత్యేక నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారని హైడ్రా అధికారులు ప్రశంసిస్తున్నారు. వారిలో సహనం, భావోద్వేగాలను అర్థం చేసుకునే గుణం ఎక్కువగా ఉండటంతో ఫీల్డ్‌లో మంచి ఫలితాలు వస్తున్నాయని చెబుతున్నారు.
హైడ్రాలో ఉద్యోగం తమకు కేవలం ఉపాధి మాత్రమే కాదని, జీవితానికి ఒక గౌరవప్రదమైన గుర్తింపు అని ట్రాన్స్‌జెండర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నెల జీతం అందుతుండటంతో ఇప్పుడు వారు తమ కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలుస్తున్నారు. హైడ్రాలో పనిచేస్తున్న గాయత్రి మాట్లాడుతూ.. మా జీవితాల్లో డబ్బు కంటే గౌరవమే ముఖ్యం. హైడ్రా యూనిఫాం వేసుకుని బయటకు వెళ్తుంటే ఎంతో గర్వంగా ఉంది. అవకాశం ఇస్తే మేం ఏదైనా సాధించగలమని నిరూపించడానికి మా ఉద్యోగాలే ప్రత్యక్ష ఉదాహరణ. మాకు ఈ అవకాశం ఇచ్చిన సీఎంకు, హైడ్రా కమిషనర్‌కు ధన్యవాదాలు తెలిపారు. తాన్షీరాయ్ మాట్లాడుతూ..ఒకప్పుడు పని అడిగితే ఎగతాళి చేసి తిరస్కరించేవారు. కానీ ఇప్పుడు యూనిఫాం వేసుకుని విధులకు వెళ్తుంటే అందరూ గౌరవంగా మాట్లాడుతున్నారు. ప్రకృతిని, ప్రభుత్వ ఆస్తులను రక్షించే భాగస్వామ్యంలో మేమూ ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు.
మేము కూడా సమాజానికి పనికొచ్చే వాళ్లమే అనే బలమైన నమ్మకంతో, ఎంతటి కఠినమైన విధులలోనైనా పనిచేయడానికి తాము ఎల్లప్పుడూ సిద్ధమని హైడ్రా ఈగల్ టీమ్ సభ్యులు సగర్వంగా చాటిచెబుతున్నారు.
