
అనంతపురంలో హనీ ట్రాప్ ముఠా గుట్టు రట్టు
అమాయకపు యువకులు, సంపన్నులే లక్ష్యంగా మాయమాటలతో వలవేసి హనీట్రాప్ ద్వారా కోట్లాది రూపాయలు దోచుకుంటున్న అంతర్ జిల్లా ముఠాను అనంతపురం పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొంతకాలంగా సాగుతున్న ఈ రాకెట్‌ను అనంతపురం గ్రామీణ పోలీసులు చాకచక్యంగా చేధించారు. ఈ ముఠాకు సంబంధించిన వివరాలను గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గ్రామీణ డీఎస్పీ టి.వెంకటేశులు వెల్లడించారు.
పోలీసుల కథనం ప్రకారం మామిళ్లపల్లి రంగమ్మ అనే మహిళ ఈ ముఠాకు ప్రధాన సూత్రధారి. ఆమెతో పాటు డబ్బర రాజేష్, మంగళ జయలక్ష్మి, చంద్రకళ, అనంతకుమారిలు సభ్యులుగా చేరి ఒక వ్యవస్థీకృత గ్యాంగ్‌ను నడుపుతున్నారు. వీరు మొదట సామాజిక మాధ్యమాలు లేదా ఇతర మార్గాల ద్వారా బాధితులతో పరిచయం పెంచుకుంటారు. వారిని మాటల్లో దించి, నమ్మకం కుదిరాక ఏదో ఒక నెపంతో తాము ఏర్పాటు చేసుకున్న 'సేఫ్ హౌస్'కు రప్పిస్తారు. అక్కడికి బాధితుడు రాగానే రాజేష్ అనే నిందితుడు దాడి చేసి బలవంతంగా దుస్తులు విప్పించి మహిళా నిందితులతో కలిపి నగ్నంగా ఫోటోలు, వీడియోలు తీసేవారు.
బయటపడ్డ డ్రోన్ సర్వే ఉదంతం
బెంగళూరుకు చెందిన 24 ఏళ్ల యువకుడు కె. ఉదయ్ భాస్కర్ రెడ్డి ఫిర్యాదుతో ఈ దారుణాలన్నీ వెలుగులోకి వచ్చాయి. ఐదు నెలల క్రితం జయలక్ష్మి అనే మహిళ 'డ్రోన్ సర్వే' పేరుతో ఉదయ్‌ను అనంతపురం భాగ్యనగర్‌లోని ఒక ఇంటికి పిలిపించింది. అక్కడ నిందితులు అతడిని నగ్నంగా ఫోటోలు తీసి రూ. 4 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పరువు పోతుందనే భయంతో ఆ యువకుడు తన వద్ద ఉన్న డబ్బుతో పాటు స్నేహితుల నుంచి సేకరించి నిందితులకు చెల్లించాడు. ఆ తర్వాత కూడా వేధింపులు ఆగకపోవడంతో బాధితుడు ఏప్రిల్ 18న పోలీసులను ఆశ్రయించాడు.
20 మంది బాధితులు.. కోటి రూపాయల దోపిడీ
దర్యాప్తులో పోలీసులు సేకరించిన సమాచారం దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఈ ముఠా ఇదే తరహాలో సుమారు 20 మందిని లక్ష్యంగా చేసుకుని దాదాపు రూ.1 కోటి వరకు వసూలు చేసినట్లు ఆధారాలు లభించాయి. డబ్బు ఇవ్వడానికి నిరాకరించిన వారిని కత్తులతో బెదిరించడం చంపేస్తామని హెచ్చరించడం వంటి దారుణాలకు కూడా వీరు పాల్పడేవారు. నిందితుల వద్ద నుంచి రూ.13 లక్షల నగదు, రెండు కత్తులు, ప్రామిసరీ నోట్లు రూ. కోటి పైగా జరిగిన లావాదేవీల రికార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నేరచరిత్ర ఉన్న నిందితులు
ప్రధాన నిందితురాలు రంగమ్మపై ఇప్పటికే వివిధ పోలీసు స్టేషన్లలో 10కి పైగా కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అదేవిధంగా మిగతా సభ్యులపై కూడా అనంతపురం, తిరుపతి జిల్లాల్లో పలు కేసులు ఉన్నాయి. ఇప్పటికే రంగమ్మను రిమాండ్‌కు తరలించగా మిగిలిన నలుగురు నిందితులను గురువారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ ఘటన జిల్లావ్యాప్తంగా కలకలం రేపింది. తెలియని వ్యక్తులతో పరిచయాలు పెంచుకునేటప్పుడు వారి మాటలు నమ్మి ఒంటరిగా వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు.
