
ఏపీ పర్యాటక రంగ అభివృద్ధికి ‘హాలిడే ఇన్ ఆంధ్రప్రదేశ్’ క్యాంపెయిన్
ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోని అగ్రగామి పర్యాటక రాష్ట్రాలలో ఒకటిగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ‘హాలిడే ఇన్ ఆంధ్రప్రదేశ్’ పేరుతో ఒక ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సచివాలయంలో నిర్వహించిన వర్చువల్ సమీక్ష సమావేశంలో ఈ ప్రచార పోస్టర్‌ను అధికారికంగా ఆవిష్కరించారు. రాష్ట్రంలోని పర్యాటక సంపదను దేశవ్యాప్తంగా ప్రమోట్ చేసేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని ఈ సందర్భంగా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో హాలిడే టూరిజం, దేవాలయ పర్యాటకం, డెస్టినేషన్ వెడ్డింగ్స్‌కు రానున్న రోజుల్లో మరింత ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న సహజసిద్ధమైన అందాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు, సుదీర్ఘ సముద్ర తీరాలు, ఆహ్లాదకరమైన కొండ ప్రాంతాలు దేశవ్యాప్తంగా ఉన్న పర్యాటకులను ఆకర్షించే అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
ప్రజలు తమ కుటుంబ వివాహాలు, విహారయాత్రలు, సెలవుల వినోదం కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లే కంటే ఆంధ్రప్రదేశ్‌లోని పర్యాటక ప్రాంతాలను మొదటి ప్రాధాన్యతగా ఎంపిక చేసుకోవాలని మంత్రి కందుల దుర్గేష్ కోరారు. దీని వల్ల స్థానిక ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడంతో పాటు హోటళ్లు, హోమ్‌స్టేలు, రవాణా రంగాలకు పెద్దఎత్తున ప్రోత్సాహం లభిస్తుందని తద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక కేంద్రాలైన గండికోట, అరకులోయ, విశాఖపట్నం, కోనసీమ వంటి ప్రాంతాలు తమ ప్రత్యేక ఆకర్షణలతో ఇప్పటికే దేశ, విదేశాల పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయని మంత్రి తెలిపారు. ఈ అద్భుత ప్రాంతాలను మరింత ప్రాచుర్యంలోకి తీసుకురావడమే ‘హాలిడే ఇన్ ఆంధ్రప్రదేశ్’ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఈ ప్రచార కార్యక్రమం ఏడాది పాటు కొనసాగుతుందని రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టనున్నట్లు వెల్లడించారు.
పర్యాటకులకు మరింత మెరుగైన, సౌకర్యవంతమైన అనుభవాన్ని కల్పించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మంత్రి ఈ సందర్భంగా వివరించారు. ముఖ్యంగా ఎయిర్‌పోర్ట్-టు-ఎయిర్‌పోర్ట్ ట్రావెల్ ప్యాకేజీలు, మెరుగైన రవాణా సదుపాయాలు, పర్యాటక మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని స్పష్టం చేశారు.
ఇదే సమయంలో ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్‌కు లభించిన ‘టూరిజం ప్రమోషన్ సిటీ అవార్డు’ రాష్ట్ర పర్యాటక రంగానికి దక్కిన గొప్ప గుర్తింపుగా మంత్రి అభివర్ణించారు. పర్యాటక రంగ అభివృద్ధికి ప్రభుత్వం చేస్తోన్న కృషికి ఈ అవార్డు నిదర్శనమని పేర్కొంటూ.. రాబోయే జూన్ 4వ తేదీన ఈ ప్రతిష్టాత్మక అవార్డును స్వీకరించనున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు.
