Let's talk: editor@tmv.in
భారత్-న్యూజిలాండ్ మధ్య చారిత్రక వాణిజ్య ఒప్పందం
భారత్-న్యూజిలాండ్ మధ్య చారిత్రక వాణిజ్య ఒప్పందం
భారత్-న్యూజిలాండ్ మధ్య చారిత్రక వాణిజ్య ఒప్పందం

భారత్-న్యూజిలాండ్ మధ్య చారిత్రక వాణిజ్య ఒప్పందం

Shaik Mohammad Shaffee
28 ఏప్రిల్, 2026

భారత ఆర్థిక ప్రస్థానంలో మరో సువర్ణ అధ్యాయం లిఖించబడింది. అగ్రరాజ్యాలతో పోటీపడుతూ 'వికసిత్ భారత్ @2047' లక్ష్యం దిశగా భారత్ మరో కీలక అడుగు వేసింది. పసిఫిక్ రీజియన్‌లో కీలక దేశమైన న్యూజిలాండ్‌తో భారత్ చారిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకం చేసింది. ఢిల్లీలోని భారత్ మండపంలో సోమవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో భారత కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, న్యూజిలాండ్ వాణిజ్య మంత్రి టాడ్ మెక్‌క్లే ఈ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ దార్శనికతతో, కేవలం 9 నెలల స్వల్ప కాలంలోనే చర్చలు పూర్తి చేసుకున్న ఈ ఒప్పందం.. ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను సరికొత్త శిఖరాలకు చేర్చనుంది.

100 శాతం సుంకాల రద్దు

ఈ ఒప్పందం ద్వారా భారతీయ ఎగుమతిదారులకు అద్భుతమైన అవకాశం లభించింది. న్యూజిలాండ్ తన మార్కెట్లోకి వచ్చే 100 శాతం భారతీయ ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను పూర్తిగా రద్దు చేసింది. గతంలో వస్త్రాలు, తోలు వస్తువులు, పాదరక్షలు, ఇంజనీరింగ్ సామాగ్రి, రత్నాలు, ఆభరణాలపై 10 శాతం వరకు ఉన్న టారిఫ్ ఇకపై 'సున్నా' కానుంది. దీనివల్ల భారతదేశంలోని చేతివృత్తుల వారు, ఎంఎస్ఎంఈలు, మహిళా పారిశ్రామికవేత్తలు తయారు చేసే వస్తువులకు అంతర్జాతీయ స్థాయిలో గట్టి పోటీ ఇచ్చే సామర్థ్యం పెరుగుతుంది. ముఖ్యంగా గుజరాత్ రసాయనాలు, మహారాష్ట్ర ఫార్మా, తమిళనాడు వస్త్రాలు, ఉత్తరప్రదేశ్ హస్తకళలకు ఈ ఒప్పందం వరంగా మారనుంది.

రైతు సంక్షేమమే పరమావధి

భారతీయ రైతుల ప్రయోజనాల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎక్కడా రాజీ పడలేదు. న్యూజిలాండ్ పాడి పరిశ్రమలో దిగ్గజం అయినప్పటికీ, భారతీయ పాడి రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పాలు, క్రీమ్, పెరుగు, చీజ్ వంటి ఉత్పత్తులను ఈ ఒప్పందం నుంచి మినహాయించింది. అలాగే ఉల్లి, కాఫీ, చక్కెర, సుగంధ ద్రవ్యాలు, ఎడిబుల్ ఆయిల్స్ వంటి సున్నితమైన వ్యవసాయ ఉత్పత్తులపై పాత పన్నులే కొనసాగుతాయి. మరోవైపు వ్యవసాయ ఉత్పాదకతను పెంచేందుకు న్యూజిలాండ్ సహకారంతో ఆపిల్, కివీ ఫ్రూట్, 'మానుకా' తేనె సాగులో 'సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్' ఏర్పాటు చేయనున్నారు. దీనివల్ల దేశీయ రైతులు ఆధునిక సాగు పద్ధతులు నేర్చుకుని, ఆదాయాన్ని రెట్టింపు చేసుకునే అవకాశం ఉంటుంది.

నిపుణులకు, విద్యార్థులకు 'బంపర్ ఆఫర్'

సేవా రంగంలో ఈ ఒప్పందం భారత నిపుణులకు సరికొత్త ద్వారాలు తెరిచింది. భారతీయ ఐటీ నిపుణులు, ఇంజనీర్లు, డాక్టర్లతో పాటు ఆయుష్ ప్రాక్టీషనర్లు, యోగా శిక్షకులు, భారతీయ చెఫ్‌ల కోసం ఏటా 5,000 ప్రత్యేక వీసాల కోటాను న్యూజిలాండ్ కేటాయించింది. ఏటా 1,000 మంది యువతకు వర్కింగ్ హాలిడే వీసాలు లభిస్తాయి. అలాగే స్టెమ్ కోర్సులు చదివే విద్యార్థులకు 3 నుంచి 4 ఏళ్ల పాటు పోస్ట్ స్టడీ వర్క్ వీసా గ్యారెంటీ లభిస్తుంది. దీనిపై ఎటువంటి సంఖ్యాపరమైన పరిమితులు లేకపోవడం విశేషం.

భారీ పెట్టుబడులు.. ఫార్మా రంగానికి జోష్

ఈ ఒప్పందం ద్వారా న్యూజిలాండ్ భారత్‌లో సుమారు 20 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 1.88 లక్షల కోట్లు) పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించింది. ఈ నిధులు తయారీ రంగం, మౌలిక సదుపాయాలు, స్టార్టప్‌లు, పునరుత్పాదక ఇంధన రంగాలకు మళ్లించనున్నారు. ఫార్మా రంగంలో భారత్ సాధించిన ప్రగతిని గుర్తిస్తూ.. అమెరికా, బ్రిటన్ వంటి దేశాల ఆమోదం ఉన్న భారతీయ మందులకు న్యూజిలాండ్ మార్కెట్లో 'ఫాస్ట్ ట్రాక్' అనుమతులు లభిస్తాయి. దీనివల్ల భారత ఫార్మా ఎగుమతులు భారీగా పెరగనున్నాయి.

ప్రపంచ వేదికపై ఆయుష్

న్యూజిలాండ్ చరిత్రలోనే తొలిసారిగా భారతీయ సాంప్రదాయ వైద్యం (ఆయుర్వేదం, యోగా, యునాని, సిద్ధ, హోమియోపతి)కు ఈ ఒప్పందంలో ప్రత్యేక గుర్తింపు లభించింది. భారతదేశపు భౌగోళిక గుర్తింపు పొందిన వస్తువులకు 18 నెలల్లోగా న్యూజిలాండ్ చట్టబద్ధమైన రక్షణ కల్పించనుంది. దీనివల్ల దేశీయ గ్రామీణ కళాకారులు తయారు చేసే వస్తువులకు విదేశాల్లో మంచి ధర పలుకుతుంది.

ఈ ఒప్పందం వల్ల కలిగే ప్రయోజనాలు

ఈ చారిత్రాత్మక ఒప్పందం వల్ల భారతదేశానికి అనేక ప్రయోజనాలు చేకూరనున్నాయి. ప్రధానంగా భారత్ నుండి న్యూజిలాండ్‌కు వెళ్లే అన్ని రకాల వస్తువులపై అక్కడి ప్రభుత్వం పన్నులను పూర్తిగా రద్దు చేయడంతో దేశీయ ఉత్పత్తులకు విదేశాల్లో మంచి గిరాకీ లభిస్తుంది. అదే సమయంలో దేశ తయారీ రంగానికి అవసరమైన కలప, బొగ్గు వంటి ముడి సరుకులు తక్కువ ధరకే లభించడం వల్ల వస్తువుల ఉత్పత్తి ఖర్చు తగ్గి, పరిశ్రమలు లాభాల్లోకి వస్తాయి. ఒకవేళ విదేశీ వస్తువుల దిగుమతి ఒక్కసారిగా పెరిగి దేశీయ వ్యాపారులకు నష్టం కలిగే పరిస్థితి వస్తే, దానిని అడ్డుకోవడానికి 'రక్షణ కవచం' వంటి ప్రత్యేక నిబంధనలను కూడా ఈ ఒప్పందంలో చేర్చారు. దీనివల్ల అటు ఎగుమతులు పెరుగుతూనే, ఇటు లోకల్ మార్కెట్‌కు కూడా పూర్తి భద్రత లభిస్తుంది.

"ఈ ఒప్పందం కేవలం వ్యాపారం మాత్రమే కాదు.. రెండు ప్రజాస్వామ్య దేశాల మధ్య నమ్మకానికి ప్రతీక" అని మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. 2024-25లో 1.3 బిలియన్ డాలర్లుగా ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యం ఈ ఒప్పందంతో రాబోయే ఐదేళ్లలో పదింతలు అయ్యే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. మొత్తానికి 'వికసిత్ భారత్' లక్ష్యంలో ఈ ఒప్పందం ఒక కీలక మైలురాయిగా నిలవనుంది.

ఎఫ్‌టీఏ ఒప్పందంపై ప్రధాని మోడీ హర్షం

భారత్ - న్యూజిలాండ్ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం రెండు దేశాల బంధంలో ఒక చారిత్రక ఘట్టమని ప్రధాని నరేంద్ర మోడీ కొనియాడారు. ఈ ఒప్పందం వల్ల రైతులకు, యువతకు, మహిళలకు, చిన్న తరహా పరిశ్రమలకు, స్టార్టప్‌లకు ఎన్నో కొత్త అవకాశాలు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా న్యూజిలాండ్ ప్రకటించిన 20 బిలియన్ డాలర్ల పెట్టుబడి హామీ వల్ల వ్యవసాయం, తయారీ రంగం, సరికొత్త సాంకేతికతలో రెండు దేశాల మధ్య సహకారం మరింత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందం కేవలం వ్యాపారానికే పరిమితం కాకుండా, ఇరు దేశాల అభివృద్ధికి సరికొత్త వేగాన్ని అందిస్తూ ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తుందని ప్రధాని వివరించారు.