Let's talk: editor@tmv.in
డిజిటల్ గవర్నెన్స్‌పై ఉన్నతస్థాయి కమిటీ.. వ్యవస్థ ప్రక్షాళనకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం

డిజిటల్ గవర్నెన్స్‌పై ఉన్నతస్థాయి కమిటీ.. వ్యవస్థ ప్రక్షాళనకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం

Gaddamidi Naveen
8 జులై, 2026

తెలంగాణ రాష్ట్రంలో ‘డిజిటల్ గవర్నెన్స్’ను బలోపేతం చేయడం కోసం ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ కమిటీ 100 రోజుల్లో తన సమగ్ర నివేదికను సమర్పించాలని గడువు విధించారు.

రాష్ట్రంలో డిజిటల్ గవర్నెన్స్ అమలు తీరుపై ఆరా తీసిన ముఖ్యమంత్రి.. దీనికి సంబంధించి పటిష్టమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని, అవసరమైన మేరకు నూతన చట్టాలను కూడా రూపొందించాలని సూచించారు. పరిపాలనను పూర్తిస్థాయి డిజిటలైజేషన్ వైపు తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు, సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకే చేరేలా చూడటంలో డిజిటల్ గవర్నెన్స్ కీలక పాత్ర పోషిస్తుందని సీఎం స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులందరికీ కూడా ప్రతి నెల 1వ తేదీ నుంచి గరిష్టంగా 5వ తేదీ లోపు నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జీతాలు పడేలా వివరాలన్నింటినీ డిజిటలైజ్ చేయాలని సీఎం స్పష్టం చేశారు. వివిధ విభాగాల్లోని సిబ్బంది, వారి వేతనాలు, బ్యాంక్ ఖాతా వివరాలను ఆన్‌లైన్ చేయాలన్నారు.

రాష్ట్రంలో దాదాపు 4,800 కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలు ఉండగా, అందులో 4,300 ఏజెన్సీలు ఉద్యోగులకు ఈఎస్ఐ, పీఎఫ్ చెల్లించడం లేదని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. ప్రభుత్వం నుంచి సకాలంలో నిధులు విడుదలైనా ఏజెన్సీలు ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదని తెలిపారు. ఈ దోపిడీని తీవ్రంగా పరిగణించిన సీఎం రేవంత్ రెడ్డి, అలాంటి ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డిజిటల్ గవర్నెన్స్ ద్వారానే ఈ అక్రమాలకు చెక్ పెట్టవచ్చన్నారు.

ఈ సమస్యలపై పూర్తిస్థాయిలో కసరత్తు చేసేందుకు ఒక ఉన్నతస్థాయి కమిటీని నియమించాలని సీఎం సూచించారు. ఈ కమిటీ 100 రోజుల్లో నివేదిక సమర్పించి ఈ సమస్యలను ఒక కొలిక్కి తీసుకురావాలని ఆదేశించారు. హెల్త్ కార్డులు, ఇతర ప్రయోజనాల కోసం ప్రభుత్వ ఉద్యోగుల వివరాలను కూడా డిజిటలైజ్ చేయాలని, దీనిని నిరంతరం పర్యవేక్షించేందుకు ఆర్థిక శాఖ పరిధిలో ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని సీఎం దిశా నిర్దేశం చేశారు. ఈ సమావేశంలో ఎంపీ వేం నరేందర్ రెడ్డి, సీఎం సలహాదారు కె. రామకృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, జయేష్ రంజన్, శాంతి కుమారి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు
TelanganaRevanthReddyDigitalGovernanceDigitalTelanganaeGovernanceTelanganaGovernmentCMRevanthReddyGoodGovernanceGovernance
డిజిటల్ గవర్నెన్స్‌పై ఉన్నతస్థాయి కమిటీ.. వ్యవస్థ ప్రక్షాళనకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం - Tholi Paluku