Let's talk: editor@tmv.in
బెంగాల్‌ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం

బెంగాల్‌ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం

Pinjari Chand
29 ఏప్రిల్, 2026

రెండో దశ పోలింగ్‌కు ముందు మమతా బెనర్జీకి కోల్‌కత్తా హైకోర్టు మొట్టికాయలు వేసింది. మంగళవారం భారత్–బంగ్లాదేశ్ సరిహద్దులో కంచె నిర్మాణం కోసం భూమి అప్పగించడంలో ఆలస్యం చేసినందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సరిహద్దు భద్రతా దళమైన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌కు అప్పగించాల్సిన 127 కిలోమీటర్ల భూమిలో ఇప్పటివరకు కేవలం 8 కిలోమీటర్ల మేర మాత్రమే ఇచ్చినట్లు కోర్టు గమనించింది.

జనవరి 27న ప్రధాన న్యాయమూర్తి సుజోయ్ పాల్ ఆధ్వర్యంలోని డివిజన్ బెంచ్, ఇప్పటికే సేకరించిన 127 కిలోమీటర్ల భూమిని మార్చి 31లోగా బీఎస్‌ఎఫ్‌కు అప్పగించాలని ఆదేశించింది. ఈ భూమికి సంబంధించిన పరిహారం ఇప్పటికే కేంద్రం నుంచి రాష్ట్రానికి అందిందని కూడా పేర్కొంది. అయితే నిర్ణీత గడువులోగా మొత్తం భూమిని అప్పగించకపోవడంతో, ఏప్రిల్ 22న కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. తొమ్మిది జిల్లాల్లో పూర్తి స్థాయిలో భూమి ఇవ్వకపోవడంపై రెండు వారాల్లో సమగ్ర అఫిడవిట్ సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. జాతీయ ప్రాముఖ్యత గల అంశంలో రాష్ట్ర ప్రభుత్వం సరైన నివేదిక కూడా సమర్పించకపోవడం ఆశ్చర్యకరం, ఆందోళనకరమని కోర్టు వ్యాఖ్యానించింది. సమర్పించిన నివేదిక అస్పష్టంగా, తప్పించుకునే విధంగా ఉందని, తేదీలు, ప్రాంతాల వారీగా వివరాలు లేవని తెలిపింది.

కోర్టు ఆదేశాలను పాటించకపోవడంపై నివేదిక సమర్పించిన అధికారిపై రూ.25,000 జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని ఆయనే స్వయంగా చెల్లించాలని పేర్కొంది. అలాగే, ప్రతి జిల్లాలో రోజువారీగా తీసుకున్న చర్యలను వివరించే సమగ్ర అఫిడవిట్‌ను రెండు వారాల్లో సమర్పించాలని ఆదేశించింది. భూమి పూర్తిగా అప్పగించలేకపోతే, కారణాలను స్పష్టంగా వెల్లడించాలని కోర్టు సూచించింది. ఈ కేసు మాజీ లెఫ్టినెంట్ జనరల్ సుబ్రత సాహా దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) ఆధారంగా విచారణకు వచ్చింది. జాతీయ భద్రత దృష్ట్యా బీఎస్‌ఎఫ్‌కు భూమి అప్పగించాలని ఆయన కోర్టును ఆశ్రయించారు. ఈ కేసును మే 13న తదుపరి విచారణకు కోర్టు వాయిదా వేసింది.

బెంగాల్‌ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం - Tholi Paluku