
ఎబోలాపై హైఅలర్ట్.. ప్రయాణికులు తప్పుడు వివరాలు ఇస్తే క్రిమినల్ కేసులు: మంత్రి దామోదర్
డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ దేశాల్లో ఎబోలా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో.. తెలంగాణ ప్రభుత్వం ముందస్తుగా అప్రమత్తమైంది. రాష్ట్రంలో చేపట్టిన ముందస్తు జాగ్రత్తలు, పర్యవేక్షణ చర్యలు, వివిధ శాఖల మధ్య సమన్వయం ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్‌పై రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సోమవారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఎబోలా ప్రభావిత దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే దేశ, విదేశీ ప్రయాణికులపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని అధికారులు ఈ సందర్భంగా మంత్రికి వివరించారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అమలులో ఉన్న స్క్రీనింగ్, సర్వైలెన్స్ వ్యవస్థలను మరింత బలోపేతం చేశామని తెలిపారు. ప్రభావిత దేశాల నుంచి వచ్చిన ప్రయాణికుల వివరాలను సేకరించి, వారి ఆరోగ్య పరిస్థితిని 21 రోజుల పాటు నిరంతరం పర్యవేక్షిస్తున్నామని వివరించారు.
ఎయిర్‌పోర్ట్‌లో అనుమానిత లక్షణాలు కనిపించిన వారిని వెంటనే గుర్తించి, గాంధీ హాస్పిటల్‌లోని ప్రత్యేక ఐసోలేషన్ వార్డుకు తరలిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇప్పటివరకు ఇద్దరు అనుమానితులను గాంధీలో ఐసోలేషన్‌లో ఉంచి, వారి శాంపిల్స్‌ను పూణేలోని 'నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీస (ఎన్ఐవీ) కి పంపించగా.. ప్రాథమిక పరీక్షల్లో వారిద్దరికీ వైరస్ నెగిటివ్ వచ్చిందని మంత్రికి తెలిపారు. అయితే, ఐసీఎంఆర్ సూచనల మేరకు మరింత నిశ్చితంగా నిర్ధారించుకోవడానికి, వారి శాంపిల్స్‌ను మరోసారి సేకరించి పూణే ఎన్‌ఐవీకి పంపినట్లు వివరించారు.
తప్పుడు సమాచారం ఇస్తే కఠిన చర్యలు
విదేశాల నుంచి వచ్చే కొంతమంది ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్‌లో తాము ఇచ్చిన చిరునామాల్లో ఉండటం లేదని అధికారులు తెలపడంపై మంత్రి దామోదర్ రాజనర్సింహ తీవ్రంగా స్పందించారు. ఎబోలా ప్రభావిత దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు తమ చిరునామా, ఫోన్ నంబర్ తదితర వివరాలను కచ్చితంగా, సక్రమంగా అందించాల్సిందేనని స్పష్టం చేశారు. ఒకవేళ ఎవరైనా తప్పుడు సమాచారం అందించినట్లయితే చట్టపరమైన చర్యలతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని, ఈ విషయాన్ని ప్రయాణికులకు స్పష్టంగా తెలియజేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తు, జీహెచ్‌ఎంసీ అడిషనల్ కమిషనర్ సంతోష్, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర నాయక్, సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ వినయ్ నందికూరి, కేంద్ర ఆరోగ్యశాఖ రీజనల్ డైరెక్టర్ డాక్టర్ ప్రకాశ్ కుమార్, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పావని, వివిధ జిల్లాల డీఎంహెచ్‌వోలు పాల్గొన్నారు.
