Let's talk: editor@tmv.in
వేధింపులకు గురైన మహిళ వీరోచిత ప్రతిఘటన.. దేహశుద్ధి చేసిన గ్రామస్థులు

వేధింపులకు గురైన మహిళ వీరోచిత ప్రతిఘటన.. దేహశుద్ధి చేసిన గ్రామస్థులు

Panthagani Anusha
8 మే, 2026

మహిళలపై జరుగుతున్న అకృత్యాలకు అడ్డుకట్ట వేయాలని ఎన్ని చట్టాలు వచ్చినా కొందరు మృగాళ్లలో మార్పు రావడం లేదు. అయితే తనను వేధిస్తున్న వ్యక్తికి ఒక మహిళ ధైర్యంగా ఎదురునిలిచి బుద్ధి చెప్పిన ఘటన కర్నూలు జిల్లా పత్తికొండ మండలంలోని అరికెర గ్రామంలో సంచలనం సృష్టించింది. బాధితురాలి తెగింపును చూసి గ్రామస్తులు ఏకమై నిందితుడికి శిరోముండనం చేసి చెప్పుల దండతో ఊరేగించారు.

పోలీసుల సమాచారం మేరకు 32 ఏళ్ల బాధితురాలు తన తల్లిదండ్రులను కలుసుకోవడానికి ఆరికేర గ్రామానికి వచ్చింది. అదే గ్రామానికి చెందిన నిందితుడు గత కొన్ని రోజులుగా ఆమెను నీడలా వెంటాడుతున్నాడు. ఆమె ఎక్కడికి వెళ్లినా వెనుక వస్తూ లైంగిక అనుకూలతలు కోరుతూ అసభ్యకరంగా వేధించసాగాడు. మంగళవారం మధ్యాహ్నం నిందితుడు ఆమెను అసభ్యంగా తాకడంతో సహనం కోల్పోయిన సదరు మహిళ ప్రజలందరూ చూస్తుండగానే నిందితుడిని నిలదీసి చెప్పుతో కొట్టింది.

గ్రామస్తుల ఆగ్రహం – చెప్పుల దండతో ఊరేగింపు

మహిళ పట్ల నిందితుడి ప్రవర్తనను గమనించిన స్థానిక గ్రామస్తులు ఆగ్రహంతో ఊగిపోయారు. నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేయడమే కాకుండా అతడికి శిరోముండనం చేశారు. అనంతరం మెడలో చెప్పుల దండ వేసి గ్రామంలో ఊరేగించి అవమానపరిచారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే గ్రామానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

ఇక ఈ ఘటనపై పత్తికొండ డీఎస్పీ బి. వెంకటరామయ్య స్పందిస్తూ"మహిళలపై వేధింపులకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటాం. అయితే చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోకూడదని ఇది కూడా నేరమేనని స్పష్టం చేశారు. మహిళలపై నేరాల విషయంలో 'జీరో టాలరెన్స్' పాటిస్తామని ఆయన తెలిపారు.

పోలీసులు ఈ ఘటనపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్లు 323, 355, 506, 341, 34 కింద కేసు నమోదు చేశారు.ప్రస్తుతం ఇరు కుటుంబాల వారు రాజీ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.