Let's talk: editor@tmv.in
ఏపీలో హీరో మోటార్స్ గ్లోబల్ పార్ట్స్ సెంటర్ 2.0 శంకుస్థాపన
ఏపీలో హీరో మోటార్స్ గ్లోబల్ పార్ట్స్ సెంటర్ 2.0 శంకుస్థాపన
ఏపీలో హీరో మోటార్స్ గ్లోబల్ పార్ట్స్ సెంటర్ 2.0 శంకుస్థాపన
ఏపీలో హీరో మోటార్స్ గ్లోబల్ పార్ట్స్ సెంటర్ 2.0 శంకుస్థాపన
ఏపీలో హీరో మోటార్స్ గ్లోబల్ పార్ట్స్ సెంటర్ 2.0 శంకుస్థాపన

ఏపీలో హీరో మోటార్స్ గ్లోబల్ పార్ట్స్ సెంటర్ 2.0 శంకుస్థాపన

Dantu Vijaya Lakshmi Prasanna
3 జులై, 2026

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి, పర్యావరణ అనుకూల ఇంధన రంగానికి పెద్ద పీట వేస్తూ తిరుపతి జిల్లా సత్యవేడు పరిధిలోని మాదన్నపాలెం వద్ద బుధవారం (జూలై 01) ప్రపంచంలోనే ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ అయిన హీరో మోటోకార్ప్ ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన ‘గ్లోబల్ పార్ట్స్ సెంటర్ (జీపీసీ) 2.0’కు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పవన్ ముంజాల్‌తో కలిసి ఘనంగా శంకుస్థాపన చేశారు. సుమారు రూ.750 కోట్ల ప్రాథమిక పెట్టుబడితో, భవిష్యత్తులో రూ.3,200 కోట్ల విస్తరణ ప్రణాళికలతో రూపుదిద్దుకుంటున్న ఈ కేంద్రం ద్వారా రాయలసీమ ప్రాంతంలో వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. భవిష్యత్ అంతా ఎలక్ట్రిక్ వాహనాలదే (ఈవీస్) అని స్పష్టం చేసిన సీఎం, ఏపీని గ్రీన్ ఎనర్జీ మరియు ఆటోమొబైల్ హబ్‌గా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చాటిచెప్పారు.

హీరో సంస్థతో అనుబంధం

ఈ పారిశ్రామిక వేడుకలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, హీరో మోటోకార్ప్ వ్యవస్థాపక చైర్మన్ దివంగత డాక్టర్ బ్రిజ్ మోహన్ లాల్ ముంజాల్ దేశ పారిశ్రామిక విప్లవంలో ఒక గొప్ప వ్యూహకర్తగా, జాతి నిర్మాతగా నిలిచారని కొనియాడారు. గతంలో హీరో సంస్థ తన ప్లాంట్‌ను పొరుగు రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని భావించినప్పుడు, తాము ప్రత్యేకంగా చర్చలు జరిపి, పారిశ్రామిక రాయితీలు, మౌలిక వసతులపై నమ్మకం కల్పించి ఆంధ్రప్రదేశ్‌కు రప్పించామని ఈ సందర్భంగా సీఎం గుర్తుచేశారు. ఆ నమ్మకంతోనే 2018లో తిరుపతిలో శంకుస్థాపన చేసుకున్న హీరో ప్లాంట్, ప్రస్తుతం విస్తృత స్థాయిలో వాహనాల ఉత్పత్తిని సాధిస్తోందని ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం సత్యవేడు యూనిట్‌లో 'విడా' బ్రాండ్ పేరుతో అత్యాధునిక ఎలక్ట్రిక్ టూ-వీలర్లను ఉత్పత్తి చేస్తుండటం గొప్ప పరిణామమని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హీరో ప్లాంట్లలో ఈ ఏపీ యూనిట్‌ను అత్యంత ప్రతిష్టాత్మకమైన మోడల్ కేంద్రంగా అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు.

ఈవీ, గ్రీన్ ఎనర్జీ లక్ష్యాలు

రాష్ట్రంలో పారిశ్రామిక వేగాన్ని పెంచడానికి తమ ప్రభుత్వం సరికొత్త ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని అమలు చేస్తోందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. కేవలం ఒప్పందాలకే పరిమితం కాకుండా, పరిశ్రమలు అతి త్వరగా వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించేలా సింగిల్ విండో ద్వారా రోడ్డు, రైలు, ఎయిర్, పోర్టు కనెక్టివిటీ వంటి మౌలిక వసతులను కల్పిస్తామని హామీ ఇచ్చారు. అలాగే వ్యవసాయంతో పాటు పరిశ్రమలకూ సరిపడా నీటి సరఫరా అందించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. పర్యావరణ హిత ఇంధన రంగం గురించి మాట్లాడుతూ.. ఏపీలో 160 గిగావాట్ల పునరుద్ధరణీయ విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళికలు సిద్ధం చేశామని, ఇప్పటికే 100 గిగావాట్ల మేర ఒప్పందాలు పూర్తయ్యాయని, ఈ విషయంలో దేశంలోనే ఏపీ ఒక అడుగు ముందే ఉందన్నారు. విశాఖపట్నంలో గూగుల్ వంటి గ్లోబల్ దిగ్గజాలతో పాటు డేటా సెంటర్లు ఏర్పాటు కాబోతున్నాయని, అలాగే అమరావతిని క్వాంటం కంప్యూటింగ్ కేంద్రంగా మారుస్తామని భవిష్యత్తు విజన్‌ను వివరించారు.

రాయలసీమ పారిశ్రామిక ప్రగతి & సామాజిక సంక్షేమం

రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర సమతుల్య అభివృద్ధి సాధించడమే ధ్యేయంగా అడుగులు వేస్తున్నట్లు పేర్కొంటూ, రాయలసీమ ప్రాంతంలో పారిశ్రామిక ప్రగతికి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు సీఎం చెప్పారు. ఏపీ ఖనిజ వనరుల నిలయమని, జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్‌లో మైనింగ్ ప్రక్రియ ప్రారంభం కావడమే కాకుండా, కడపలో ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న రాయలసీమ స్టీల్ ప్లాంట్‌కు ఈ నెల 3న (నేడు) శంకుస్థాపన చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి 2028 నాటికల్లా ఉత్పత్తిని ప్రారంభించేలా గడువు విధించినట్లు స్పష్టం చేశారు.

ప్రభుత్వం సంపద సృష్టించడమే కాకుండా, సృష్టించిన సంపదను ‘పీ4’ విధానం ద్వారా సమాజంలోని చివరి పేదవానికి కూడా అందేలా చూస్తోందని వివరించారు. రాష్ట్రంలో అసమానతలు లేని సమాజ స్థాపన కోసం ప్రతి కుటుంబం నుండి ఒక పారిశ్రామికవేత్తను తయారుచేసే ‘వన్ ఫ్యామిలీ - వన్ ఎంట్రప్రెన్యూర్’ నినాదాన్ని అమలు చేస్తున్నామని, పొదుపు ఉద్యమంలో దేశంలోనే ఆదర్శంగా నిలిచిన డ్వాక్రా మహిళలు నేడు పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతుండటం శుభపరిణామమని పేర్కొన్నారు.

స్కాలర్‌షిప్ ఆవిష్కరణ

మహిళా సాధికారతకు, సామాజిక బాధ్యతకు హీరో సంస్థ ఇస్తున్న ప్రాధాన్యతను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించారు. ఈ ప్లాంట్‌లో పనిచేస్తున్న ఉద్యోగులలో 40 శాతం కంటే ఎక్కువ మంది మహిళలు ఉండటంపై హర్షం వ్యక్తం చేస్తూ, ఏపీ మహిళల్లో ఉన్న త్వరితగతిన నేర్చుకునే నైపుణ్యాలను, కష్టపడే తత్వాన్ని అభినందించారు. అలాగే తిరుపతిలో విధుల్లో ఉండే మహిళా పోలీసులకు ఎలక్ట్రిక్ టూ-వీలర్లను ఉచితంగా అందించేందుకు ముందుకు వచ్చిన హీరో సంస్థకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం, స్వర్ణాంధ్ర ఫౌండేషన్ భాగస్వామ్యంతో హీరో కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక ‘డాక్టర్ బ్రిజ్ మోహన్ లాల్ ముంజాల్ - హీరోస్ ఆఫ్ టుమారో’ విద్యార్థి స్కాలర్‌షిప్ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు.

సమావేశం అనంతరం ముఖ్యమంత్రి ప్లాంట్‌ను స్వయంగా సందర్శించారు. హీరో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పవన్ ముంజాల్ స్వయంగా ఈవీ స్కూటర్‌ను డ్రైవ్ చేయగా, సీఎం అందులో ప్రయాణించి ప్లాంట్‌లోని వివిధ ప్రొడక్షన్ అసెంబ్లీ విభాగాలను ఆసక్తిగా పరిశీలించారు. మోటార్ సైకిళ్లు మరియు ఈవీ వాహనాల తయారీలో నిమగ్నమైన సిబ్బందితో, ముఖ్యంగా మహిళా ఉద్యోగులతో ముఖాముఖి మాట్లాడి వారి పనితీరును తెలుసుకున్నారు. హీరో సంస్థ సరికొత్తగా డిజైన్ చేసిన 'స్కూటీ కమ్ ఆటో' వాహన ప్రత్యేకతలను పవన్ ముంజాల్ వివరించగా, సీఎం దాని సాంకేతికతను భవిష్యత్ డిమాండ్‌ను ప్రత్యేకంగా ప్రశంసించారు.

ట్యాగ్‌లు
AndhraPradeshNaraChandrababuNaiduHeroMotoCorpHeroMotorsElectricVehiclesEVIndiaGreenEnergyRenewableEnergyEVManufacturingMakeInIndiIndustrialDevelopmentAndhraPradeshIndustriesTirupatiSatyaveduEVHubInvestmentInAPSpeedOfDoingBusinessWomenEmploymentHeroesOfTomorrowAPNews