Let's talk: editor@tmv.in
బెంగాల్ తొలిదశ ఎన్నికలకు భారీ భద్రత

బెంగాల్ తొలిదశ ఎన్నికలకు భారీ భద్రత

Pinjari Chand
16 ఏప్రిల్, 2026

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్‌కు భారీ భద్రతా ఏర్పాట్లు చేయాలని ఎలక్షన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా నిర్ణయించింది. ఏప్రిల్‌ 23న జరగనున్న మొదటి దశ పోలింగ్‌కు మొత్తం 2,407 కేంద్ర సాయుధ పోలీసు బలగాల కంపెనీలను మోహరించనున్నట్లు అధికారులు తెలిపారు. ముర్షీదాబాద్‌ జిల్లాలో అత్యధికంగా 316 కంపెనీలు మోహరించనున్నారు. ఇందులో ముర్షీదాబాద్ జిల్లాలో 240 కంపెనీలు, జంగీపూర్‌లో 76 కంపెనీలు ఉంటాయి. ఇటీవల వక్ఫ్ చట్టం, ఎన్ఆర్సీ ఆందోళనల సమయంలో జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఈ జిల్లాకు అధిక భద్రత కల్పిస్తున్నారు. రాజకీయంగా కీలకమైన నందిగ్రాం నియోజకవర్గం ఉన్న పూర్వ మేదీనిపూర్‌‌ జిల్లాలో 273 కంపెనీలు మోహరించనున్నారు. ఈ నియోజకవర్గం నుంచి ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి పోటీ చేస్తున్నారు. ఉత్తర్‌‌ దినాజ్‌పూర్‌‌ జిల్లాను రెండు పోలీసు జిల్లాలుగా విభజించి ఇస్లాంపూర్‌కు 61, రాయిగంజ్‌కు 71 కంపెనీలు కేటాయించారు. అలాగే అసన్‌సోల్‌–దుర్గాపూర్ పోలీసు కమిషనరేట్‌లో 125 కంపెనీలు, సిలిగురిలో 44 కంపెనీలు మోహరించనున్నారు. ఉత్తర బెంగాల్ ప్రాంతంలో దార్జిలింగ్‌లో 61, కలింపొంగ్‌లో 21, జలపాయ్‌గురిలో 92, అలీపూర్‌‌దౌర్‌‌లో 77 కంపెనీలు కేటాయించారు.

పోయిలా బోయిషాఖ్ ర్యాలీకి ఈసీ అనుమతి నిరాకరణ

కోల్‌కత్తాలో బెంగాలీ నూతన సంవత్సరమైన ‘పోయిలా బోయిషాఖ్’ సందర్భంగా నిర్వహించనున్న ర్యాలీకి ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వలేదని బెంగాలీ జాతీయవాద సంస్థ బంగ్లా పొక్కో ఆరోపించింది. సంస్థ ప్రధాన కార్యదర్శి గార్గ ఛటర్జీ మాట్లాడుతూ ఇది బెంగాలీ సంస్కృతిపై ‘తీవ్ర దాడి’ అని విమర్శించారు. గత ఐదేళ్లుగా ఈ ర్యాలీ నిర్వహిస్తున్నామని, ఈ ఏడాది కూడా దక్షిణ కోల్‌కతాలో ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో అనుమతి లేకుండా ఏ ర్యాలీ అయినా చట్టవిరుద్ధమని ఎన్నికల సంఘం అధికారులు స్పష్టం చేశారు. బెంగాలీ నూతన సంవత్సరాన్ని బహిరంగంగా జరుపుకోవడం తమ హక్కు అని పేర్కొన్న సంస్థ, రష్‌బెహారి క్రాసింగ్ నుంచి గారియాహాట్ వరకు ర్యాలీ నిర్వహిస్తామని ప్రకటించింది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.