

నగరంలో భారీ వర్షం.. క్షేత్రస్థాయిలో హైడ్రా డీఆర్‌ఎఫ్ సేవలు
నగరంలో మంగళవారం పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై భారీగా వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బేగంపేట, ఖైరతాబాద్ ప్రాంతాల్లో దాదాపు 9 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. దీంతో ట్యాంక్‌బండ్‌తో పాటు సచివాలయం ముందు ఉన్న ప్రధాన రహదారులపై మోకాళ్ల లోతు వరకు వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
వర్షాల ప్రభావంతో ట్యాంక్‌బండ్‌పై సికింద్రాబాద్ వైపు భారీగా నీరు నిలిచిపోవడమే కాకుండా, ఒక చెట్టు రహదారిపై కూలిపోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. ట్యాంక్‌బండ్ ప్రాంతంలో నిలిచిన వరద నీటిని తొలగించే పనులను, చెట్ల తొలగింపు చర్యలను ఆయన స్వయంగా పర్యవేక్షించారు.
హైడ్రా డీఆర్‌ఎఫ్ సిబ్బంది నగరంలోని పలు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు. శేరిలింగంపల్లి, కొండాపూర్, గచ్చిబౌలి, షేక్‌పేట్, టోలిచౌకి, మాధాపూర్, సికింద్రాబాద్, హైదర్‌గూడ తదితర ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో సేవలు అందిస్తూ రహదారులపై నిలిచిన నీటిని తొలగించారు. అలాగే వర్షాల కారణంగా నగరవ్యాప్తంగా సుమారు 76 చోట్ల చెట్లు కూలిపోగా, వాటిని తొలగించే పనుల్లో సిబ్బంది నిమగ్నమయ్యారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా, ట్రాఫిక్‌ను సాధారణ స్థితికి తీసుకురావడానికి హైడ్రా బృందాలు యుద్ధప్రాతిపదికన చర్యలు కొనసాగాయి.
