
వడగాలులపై అప్రమత్తం.. జూన్ 15 వరకు జాగ్రత్తలు: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
రాష్ట్రంలో పెరుగుతున్న ఎండలు, వడగాలుల తీవ్రత నేపథ్యంలో ప్రజలను రక్షించడం ప్రభుత్వ ప్రధాన బాధ్యతగా భావించి సంబంధిత శాఖలు సమన్వయంతో పకడ్బందీ చర్యలు తీసుకోవాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. 2026లో ఎండలు, వడగాలులు అధికంగా వీచే అవకాశముందని, జూన్ 15 వరకు కూడా అధిక ఉష్ణోగ్రతలు కొనసాగవచ్చని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికల నేపథ్యంలో అవసరమైన చర్యలపై మంత్రి సచివాలయంలోని తన కార్యాలయంలో 20కి పైగా శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ, భారత వాతావరణ శాఖ కలిసి రూపొందించిన సమగ్ర తెలంగాణ స్టేట్ హీట్‌వేవ్ యాక్షన్ ప్లాన్-2026ను మంత్రి విడుదల చేశారు. ఈ యాక్షన్ ప్లాన్ ద్వారా వడగాలుల ప్రభావాన్ని తగ్గించేందుకు ముందస్తు జాగ్రత్తలు, సమన్వయ చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా వచ్చే 45 రోజుల పాటు రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఎక్కడా త్రాగునీటి కొరత తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఎక్కడైనా మోటార్లు కాలిపోతే 24 గంటలలోపు మరమ్మతులు పూర్తి చేసి నీటి సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని సూచించారు.
హైదరాబాద్ నగరంలో నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ట్యాంకర్ల ద్వారా సరఫరా కొనసాగుతోందని మంత్రి తెలిపారు. రోజుకు సుమారు 14 గంటలపాటు ఫిల్లింగ్ నిర్వహించి, దాదాపు 15 వేల ట్యాంకర్ల ద్వారా నీటిని పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. పంచాయతీ రాజ్, మున్సిపల్, ఫైర్, హెల్త్ తదితర శాఖలు పరస్పరం సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రకృతి విపత్తుల వల్ల నష్టపోయిన బాధితులకు సహాయం అందించేందుకు 15 రోజులలోగా నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు.
వడగాలుల ప్రభావం వల్ల సాధారణ ప్రజలు ఇబ్బందులు పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, అయినప్పటికీ అనుకోని పరిస్థితుల్లో మరణాలు సంభవిస్తే మానవతా దృక్పథంతో వ్యవహరించి తక్షణ ఎక్స్‌గ్రేషియా అందించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలు చెరువులు, కుంటల వద్దకు వెళ్లి ప్రమాదాలకు గురవుతున్న నేపథ్యంలో ఎన్‌డిఆర్ఎఫ్, ఎస్‌డిఆర్ఎఫ్, పోలీస్, రెవెన్యూ శాఖలు ప్రత్యేక పర్యవేక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
అదేవిధంగా, ఎండల తీవ్రతపై ప్రజలకు అవగాహన కల్పించడం, అధిక ఉష్ణోగ్రతల సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలపై ప్రచారం నిర్వహించడం, కూల్ వార్డుల ఏర్పాటు, ఆసుపత్రుల్లో ఫైర్ సేఫ్టీ ఆడిట్లు నిర్వహించడం వంటి అంశాలపై దృష్టి సారించాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రుల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని, వేడి ప్రాంతాల్లో పనిచేసే కార్మికులకు రొటేషన్ పద్ధతిలో విశ్రాంతి కల్పించేలా పరిశ్రమలకు సూచనలు జారీ చేయాలని మంత్రి పేర్కొన్నారు.
