Let's talk: editor@tmv.in
ఏపీలో హెల్త్ రివల్యూషన్: 57 లక్షల మందికి 47 రకాల ఉచిత వైద్య పరీక్షలు!
ఏపీలో హెల్త్ రివల్యూషన్: 57 లక్షల మందికి 47 రకాల ఉచిత వైద్య పరీక్షలు!

ఏపీలో హెల్త్ రివల్యూషన్: 57 లక్షల మందికి 47 రకాల ఉచిత వైద్య పరీక్షలు!

Dantu Vijaya Lakshmi Prasanna
30 ఏప్రిల్, 2026

ప్రజారోగ్య రంగంలో పెద్ద మార్పుకు దారితీసే కీలక నిర్ణయం తీసుకుంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమగ్ర ఆరోగ్య స్క్రీనింగ్ పథకానికి ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ నెరవేరుతోంది. రోగాలు వచ్చిన తర్వాత చికిత్స అందించడం కంటే, వ్యాధులు రాకుండా ముందస్తు నివారణ చర్యలు చేపట్టడమే ఉత్తమమని భావించిన ప్రభుత్వం, రాష్ట్రవ్యాప్తంగా భారీ స్క్రీనింగ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ బుధవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని పర్యవేక్షించి, వారి 'డిసీజ్ ప్రొఫైల్స్' తయారు చేయడం ద్వారా రాష్ట్ర వైద్య చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలుకానుంది.

పథకం లక్ష్యం, లబ్ధిదారులు

ఈ పథకం ప్రధానంగా ఎన్‌సిడి సర్వేలో వివిధ దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశం ఉన్నట్లు గుర్తించిన వ్యక్తులపై దృష్టి సారిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 56 లక్షల 40 వేల మందిని ఈ పథకం కింద గుర్తించారు. వీరిలో సాధారణ పౌరులతో పాటు సంక్షేమ వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులు కూడా ఉన్నారు. ప్రతీ వ్యక్తికి పూర్తిస్థాయిలో 47 రకాల పరీక్షలు నిర్వహించి, వారి శరీర స్థితిగతులను శాస్త్రీయంగా విశ్లేషించడమే ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రాథమిక ఉద్దేశ్యం.

భారీ బడ్జెట్

ఈ భారీ కార్యక్రమం కోసం ప్రభుత్వం ఏటా రూ. 162.72 కోట్ల వ్యయాన్ని భరించనుంది. ప్రజలపై పైసా భారం పడకుండా, పూర్తి ఉచితంగా అత్యాధునిక పరీక్షలను ఇంటి ముంగిటకే చేర్చనున్నారు. గతంలో అరకొర సౌకర్యాలతో ఉన్న వైద్య సేవలను ఆధునీకరించి, సాంకేతికతను జోడించి ఈ నిధులను వెచ్చిస్తున్నారు. ఐదేళ్ల కాలపరిమితితో కూడిన ఈ ఒప్పందం ద్వారా ప్రజల ఆరోగ్యంపై దీర్ఘకాలిక పెట్టుబడి పెడుతున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

104 సంచార వాహనాల ఆధునీకరణ

రాష్ట్రంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న 104 సంచార వైద్య వాహనాల ద్వారానే ఈ సేవలు అందుతాయి. అయితే, గతంలో ఈ వాహనాల్లో కేవలం 6 రకాల ప్రాథమిక పరీక్షలు (షుగర్, హిమోగ్లోబిన్ వంటివి) మాత్రమే జరిగేవి. అవి కూడా నాణ్యత లేని ర్యాపిడ్ కిట్ల ద్వారా నిర్వహించేవారు. ఇప్పుడు ఈ 104 వాహనాలను సంచార ప్రయోగశాలలుగా మార్చబోతున్నారు. సెమీ ఆటోమేటిక్ బయో కెమిస్ట్రీ ఎనలైజర్లు, సిబిసి మెషీన్లు, మైక్రోస్కోపులు వంటి అత్యాధునిక పరికరాలను ప్రతి వాహనంలోనూ ఏర్పాటు చేస్తున్నారు.

ఈ పథకం కింద చేసే 47 రకాల పరీక్షలు మనిషి శరీరంలోని దాదాపు అన్ని ప్రధాన అవయవాల పనితీరును అంచనా వేస్తాయి.

లివర్ (ఎల్ఎఫ్2‌టీ ): కాలేయ పనితీరుకు సంబంధించి 8 రకాల పరీక్షలు.

కిడ్నీ (ఆర్ఎఫ్‌టీ ): మూత్రపిండాల పనితీరుపై 3 రకాల పరీక్షలు.

లిపిడ్ ప్రొఫైల్: రక్తంలో కొవ్వు శాతాన్ని తెలిపే 5 రకాల పరీక్షలు.

రక్త కణాల విశ్లేషణ: తెల్ల రక్త కణాలు (5), ఎర్ర రక్త కణాలు (5) ప్లేట్లెట్స్ పరిశీలన.

ఇతరాలు: థైరాయిడ్, గ్లూకోజ్ (3), ఎలక్ట్రోలైట్స్ (4), కోయాగ్యులేషన్ (2) ఇన్ఫెక్షన్లను గుర్తించే ఈఎస్ఆర్ పరీక్షలు వంటివి ఉంటాయి.

డిసీజ్ ప్రొఫైల్, ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులు

పరీక్షలు చేయడమే కాకుండా, వచ్చిన ఫలితాలను డిజిటలైజ్ చేయనున్నారు. ప్రతి పౌరుడికి ఒక 'ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డు' రూపొందుతుంది. దీనివల్ల భవిష్యత్తులో ఆ వ్యక్తి ఏదైనా ఆసుపత్రికి వెళ్ళినప్పుడు తన ఆరోగ్య చరిత్రను సులభంగా డాక్టర్లకు వివరించవచ్చు. ఈ డేటా ఆధారంగా 'సంజీవని' పథకం కింద ఆయా వ్యక్తులకు ఏయే ఆహార నియమాలు పాటించాలి, ఏ మందులు వాడాలి అనే విషయాలపై వ్యక్తిగత సూచనలు అందిస్తారు.

సర్వీస్ ప్రొవైడర్ల బాధ్యత, లక్ష్యాలు

ఈ పథకాన్ని అమలు చేస్తున్న సర్వీస్ ప్రొవైడర్లు ప్రభుత్వం విధించిన కఠిన నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. మొత్తం 904 వాహనాల్లో అవసరమైన వైద్య పరికరాలను, రియేజెంట్లను సొంత ఖర్చుతో ఏర్పాటు చేయాలి. ప్రతి వాహనం రోజుకు కనీసం 20 మందికి పరీక్షలు నిర్వహించాలి. అంటే నెలకు 26 పని దినాల్లో ఒక్కో వాహనం 520 మందికి సేవలు అందించాలి. తద్వారా నిర్ణీత సమయంలోగా లక్షిత జనాభా అందరికీ స్క్రీనింగ్ పూర్తవుతుంది.

ప్రారంభానికి సన్నాహాలు

వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈ ఫైలుపై సంతకం చేస్తూ, పథకాన్ని సత్వరమే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. వచ్చే రెండు నెలల్లోనే ఈ 104 వాహనాలు సరికొత్త హంగులతో గ్రామాల్లో పర్యటించనున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా, రోగాల బారి నుండి ప్రజలను కాపాడే ఒక రక్షణ కవచంలా ఈ 'సిటిజన్ హెల్త్ స్క్రీనింగ్' నిలవనుంది. ఇది కేవలం ఒక పరీక్ష మాత్రమే కాదు, ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి వేస్తున్న పునాది అవుతుందని మంత్రి పేర్కొన్నారు.