
వరంగల్‌లో రూ.2.5 కోట్ల విలువైన హాష్ ఆయిల్ స్వాధీనం
వరంగల్‌లో అంతర్రాష్ట్ర మాదక ద్రవ్యాల ముఠాకు పోలీసులు అరెస్ట్ చేసి, భారీగా హాష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం జరిగిన ఈ ఆపరేషన్‌లో నలుగురు సభ్యులను అదుపులోకి తీసుకుని, సుమారు రూ.2.5 కోట్ల విలువైన 20 కిలోల హాష్ ఆయిల్‌ను పట్టుకున్నారు.
పక్కా సమాచారంతో వరంగల్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా మత్తు పదార్థాలు దొరికాయి. వరంగల్ బస్ స్టాండ్ సమీపంలోని రైల్వే గూడ్స్ షెడ్ ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వీరు, హాష్ ఆయిల్‌ను ముంబై తరలించడానికి సిద్ధమవుతుండగా పట్టుబడ్డారు.
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ముఠాలోని ప్రధాన నిందితుడు తన స్వస్థలంలో గంజాయి సాగు చేస్తూ, దానితో హాష్ ఆయిల్ తయారు చేసి గ్యాంగ్ సభ్యులతో కలిసి విక్రయిస్తున్నట్లు వెల్లడైంది. ఇటీవల ఈ గ్యాంగ్ 40 కిలోల హష్ ఆయిల్ తయారు చేసినట్లు తెలిపారు. పట్టుబడిన 20 కిలోల ఆయిల్ కాకుండా, మిగిలిన 20 కిలోలను మరొక పరారీలో ఉన్న నిందితుడు తీసుకెళ్లినట్లు విచారణలో వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. విదేశాల్లో, మెట్రో నగరాల్లో వీరికి ఎవరితోనైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
