Let's talk: editor@tmv.in
రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో హర్యానా యువకుడు మృతి

రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో హర్యానా యువకుడు మృతి

Pinjari Chand
16 ఏప్రిల్, 2026

మంచి భవిష్యత్తు కోసం రష్యాకు వెళ్లిన తన కుమారుడు తిరిగి వస్తాడని ఆశించిన తండ్రికి ఇప్పుడు అతని మృతదేహం కోసం ఎదురు చూడాల్సిన బాధకర పరిస్థితి ఏర్పడింది. హర్యానాలోని రేవరి జిల్లాకు చెందిన 25 ఏళ్ల యువకుడు అన్షు రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయాడు. చదువు కోసం స్టూడెంట్ వీసాతో రష్యాకు వెళ్లిన అతను మోసపోయి రష్యా సైన్యంలో చేరాల్సి వచ్చిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

చదువు పేరుతో రష్యా ప్రయాణం

అన్షు తండ్రి రాకేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం, కుటుంబం దాదాపు రూ.6 లక్షలు ఖర్చు చేసి కుమారుడిని చదువుకోసం రష్యాకు పంపింది. ఆయన చండీగఢ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అండర్‌‌టేకింగ్‌లో ఉద్యోగిగా పనిచేస్తున్నారు. 2025 ఏప్రిల్‌ 20న అన్షు స్టూడెంట్ వీసాతో రష్యాకు వెళ్లాడు. అక్కడ కొంతకాలం సైనిక శిక్షణకు పంపిన తర్వాత రష్యా సైన్యంలో చేర్చారని తండ్రి తెలిపారు.

ఏప్రిల్‌ 4న మృతి సమాచారం

ఈ ఏడాది ఏప్రిల్‌ 4న రష్యా సైన్యంలో పనిచేసిన ఓ మాజీ సైనికుడు ఫోన్ చేసి అన్షు మరణించిన విషయాన్ని తెలిపాడని రాకేష్ కుమార్ చెప్పారు. ప్రస్తుతం అతని మృతదేహం యుద్ధరంగం నుంచి మాస్కోకు తీసుకువచ్చి, అక్కడి నుంచి భారత్‌కు పంపించేందుకు మరో 10–15 రోజులు పట్టే అవకాశం ఉందని తెలిపారు. నవంబర్‌ నుంచి అన్షుకు కుటుంబంతో సంప్రదింపులు నిలిచిపోయాయని ఆయన వెల్లడించారు.

ఇతర యువకులకూ ఇదే పరిస్థితి

హర్యానాకు చెందిన మరో ముగ్గురు యువకుల మృతదేహాలు కూడా ఇటీవల భారత్‌కు చేరాయి. వారిలో కర్నల్‌ జిల్లా చౌరా గ్రామానికి చెందిన అనుజ్ శర్మ (23), ఫతేబాద్‌ జిల్లా కుమ్హారియా గ్రామానికి చెందిన అంకిత్ జంగ్రా (24), సోనిపట్‌ జిల్లా ఇబ్రాహీంపూర్ కురాడ్ గ్రామానికి చెందిన అంకిత్ (30) ఈ యువకులు కూడా చదువు, ఉద్యోగాల పేరుతో రష్యాకు వెళ్లి చివరికి యుద్ధంలో చిక్కుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ఉద్యోగాల మాయలో యువకులు

సామాజిక కార్యకర్త జై భగవాన్ తెలిపిన వివరాల ప్రకారం, స్థానిక ఏజెంట్లు మంచి ఉద్యోగాలు, నెలకు రూ.2.5 లక్షల వేతనం వంటి హామీలు ఇచ్చి యువకులను రష్యాకు పంపుతున్నారని అన్నారు. కానీ అక్కడికి వెళ్లిన తర్వాత రష్యన్ భాషలో ఉన్న ఒప్పందాలపై సంతకాలు చేయించి వారిని సైన్యంలో చేరుస్తున్నారని ఆరోపించారు.

కుటుంబాల ఆందోళనలు

ఈ ఘటనలపై గత సంవత్సరం నవంబర్‌, డిసెంబర్ నెలల్లో బాధిత కుటుంబాలు జంతర్‌‌మంతర్‌‌ వద్ద నిరసనలు చేపట్టాయి. తమ పిల్లలను సురక్షితంగా భారత్‌కు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. హర్యానాతో పాటు పంజాబ్, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇలాంటి పరిస్థితుల్లో రష్యా సైన్యంలో చిక్కుకున్న భారతీయ యువకులు ఉన్నట్లు సామాజిక కార్యకర్తలు చెబుతున్నారు.