Let's talk: editor@tmv.in
రాష్ట్ర అప్పులపై మంత్రి జూపల్లికి హరీష్ రావు బహిరంగ లేఖ

రాష్ట్ర అప్పులపై మంత్రి జూపల్లికి హరీష్ రావు బహిరంగ లేఖ

Gaddamidi Naveen
4 జులై, 2026

తెలంగాణ రాష్ట్ర అప్పుల విషయంలో అధికార కాంగ్రెస్ పార్టీ చేస్తోందని చెప్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూ రాష్ట్ర మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకి శుక్ర‌వారం ఒక ఘాటు బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖతో పాటు తన వాదనలకు మద్దతుగా అసెంబ్లీ ప్రసంగాల వీడియోలు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అధికారిక గణాంకాలను మంత్రి జూపల్లి వాట్సాప్‌కు నేరుగా పంపించడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.

హరీష్ రావు తన లేఖలో.. బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేళ్ల హయాంలో తీసుకున్న రుణాలు, ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చి చెల్లిస్తున్న అప్పులు అన్నీ కలిపితే మొత్తం రూ.4.17 లక్షల కోట్లు మాత్రమేనని హరీష్ రావు స్పష్టం చేశారు. నేను అసెంబ్లీలో చెప్పిన ఈ లెక్కలకు నేటికీ కట్టుబడి ఉన్నాను. దీనిపై ఎక్కడైనా, ఎప్పుడైనా బహిరంగ చర్చకు సిద్ధం. కానీ మీ ముఖ్యమంత్రి, మంత్రులు మాత్రం ఆధారాలు లేకుండా పూటకో తీరుగా అంకెలు మారుస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న లెక్కలకు, ఆర్బీఐ అధికారిక నివేదికలకు అస్సలు పొంతన లేదని హరీష్ రావు ఆరోపించారు. డిసెంబర్ 2023 నుంచి జూన్ 2026 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పు రూ.1,77,058 కోట్లు అని జూపల్లి లేఖలో పేర్కొన్నారు. కానీ, ఆర్బీఐ అధికారిక నివేదికల ప్రకారం జూన్ 30, 2026 నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మొత్తం అప్పు రూ.1,86,067 కోట్లు అని హరీష్ రావు బట్టబయలు చేశారు. 2026 మార్చి 18న అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఎఫ్‌ఆర్‌బీఎం, అన్ని రకాల అప్పులు కలిపి రూ.3,47,294 కోట్లు అని ప్రకటించారని గుర్తుచేశారు.

మా లెక్కల ప్రకారం.. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండున్నరేళ్ల కాలంలో వివిధ మార్గాల ద్వారా రాష్ట్రంపై వేసిన అప్పుల భారం సుమారు 4.5 లక్షల కోట్ల రూపాయలకు చేరిందన్నది బహిరంగ రహస్యం అని హరీష్ రావు అన్నారు. గతంలో తాము అసెంబ్లీలో మాట్లాడిన వీడియోలను, సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ ప్రకటనను, ఆర్బీఐ అధికారిక పత్రాలను మీ వాట్సాప్‌కు పంపాను, వాటిని ఒకసారి పరిశీలించి వాస్తవాలు తెలుసుకోవాలని హరీష్ రావు హితవు పలికారు. ఇకనైనా అప్పుల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న రాజకీయాన్ని, తప్పుడు ప్రచారాలను మానుకోవాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్‌లు
HarishRaoBRSCongressTelanganaTelanganaPoliticsTelanganaNewsStateDebtPublicFinanceRevanthReddyJupallyKrishnaRaoPoliticalNews
రాష్ట్ర అప్పులపై మంత్రి జూపల్లికి హరీష్ రావు బహిరంగ లేఖ - Tholi Paluku