Let's talk: editor@tmv.in
నేటి నుంచి హజ్ యాత్ర ప్రారంభం

నేటి నుంచి హజ్ యాత్ర ప్రారంభం

Shaik Mohammad Shaffee
18 ఏప్రిల్, 2026

ముస్లింల పవిత్ర హజ్ యాత్ర-2026 నేటి నుంచి అధికారికంగా ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఎంబార్కేషన్ పాయింట్ల నుంచి తొలి విడత యాత్రికులు ఈరోజు సౌదీ అరేబియాకు బయలుదేరనున్నారు. ఈ ఏడాది మొత్తం 1,75,025 మంది యాత్రికులు ఈ పవిత్ర యాత్రలో పాల్గొంటున్నట్లు కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. యాత్రికులందరికీ కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు శుభాకాంక్షలు తెలుపుతూ.. యాత్రను సుఖమయం చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని పేర్కొన్నారు.

సాంకేతికతతో ‘స్మార్ట్’ సేవలు

హజ్ యాత్రికుల భద్రత, సౌకర్యం కోసం కేంద్ర ప్రభుత్వం ఈసారి అత్యాధునిక సాంకేతికతను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగా యాత్రికులు ఎక్కడైనా తప్పిపోతే వెంటనే గుర్తించేందుకు వీలుగా వారికి ‘స్మార్ట్ రిస్ట్ బ్యాండ్ల’ను అందజేస్తున్నారు. అలాగే ప్రయాణం, వసతి, ఇతర అత్యవసర సహాయం కోసం ‘హజ్ సువిధ’ అనే ప్రత్యేక మొబైల్ యాప్‌ను ప్రవేశపెట్టారు. సమయం తక్కువగా ఉన్న వారి కోసం మొదటిసారిగా 20 రోజుల ‘షార్ట్ హజ్’ ఆప్షన్‌ను కూడా కల్పించారు. దీనికి తోడు, మక్కా నుండి మదీనాకు తక్కువ సమయంలో, సౌకర్యవంతంగా చేరుకోవడానికి సుమారు 60 వేల మంది యాత్రికుల కోసం హైస్పీడ్ రైలు (బుల్లెట్ రైలు) ప్రయాణ ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు.

హోటల్ తరహా వసతి.. రూ. 6.25 లక్షల బీమా

యాత్రికుల ఆర్థిక, ఆరోగ్య భద్రతకు పెద్దపీట వేస్తూ కేంద్రం ఇన్సూరెన్స్ పరిమితిని రూ.6.25 లక్షలకు పెంచింది. వసతి విషయానికొస్తే.. మక్కాలో యాత్రికుల కోసం ప్రత్యేకంగా హోటల్ తరహా వసతి గృహాలను సిద్ధం చేశారు. నిరంతర పర్యవేక్షణ, మెరుగైన వైద్య స్క్రీనింగ్, ఫిర్యాదుల పరిష్కారానికి ఎప్పటికప్పుడు పనిచేసే యంత్రాంగాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

17 నగరాల నుంచి విమాన సేవలు

హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, లక్నో, కోల్‌కతా, బెంగళూరు, శ్రీనగర్ సహా దేశవ్యాప్తంగా 17 ప్రధాన నగరాల నుంచి హజ్ విమానాలు నడవనున్నాయి. విమానాశ్రయాల్లో యాత్రికులకు ఇబ్బంది కలగకుండా ఇమ్మిగ్రేషన్, బోర్డింగ్ ప్రక్రియలను సులభతరం చేశారు.

సౌదీ అరేబియా అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ ఈ ఏర్పాట్లు చేశామని, యాత్రికులు ఆరోగ్య మార్గదర్శకాలను పాటించి ఆధ్యాత్మిక యాత్రను విజయవంతం చేసుకోవాలని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఆకాంక్షించారు.