
ఆహార భద్రతపై ఆయిల్ అసోసియేట్స్‌తో హెచ్-ఫాస్ట్ అవగాహన సదస్సు
నగరంలో కల్తీ ఆయిల్ విక్రయాలను అరికట్టడమే లక్ష్యంగా హైదరాబాద్ పోలీస్ విభాగంలోని హెచ్-ఫాస్ట్ బృందం కీలక సమావేశాన్ని నిర్వహించింది. బేగంబజార్‌లోని హెచ్-ఫాస్ట్ భవనంలో జరిగిన ఈ సమావేశానికి కమిషనర్ టాస్క్ ఫోర్స్ డీసీపీ, హెచ్-ఫాస్ట్ ఇన్‌ఛార్జ్ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, ఐపీఎస్ అధ్యక్షత వహించారు. నగరంలోని ఆయిల్ తయారీదారులు, సరఫరాదారులు అలాగే అనుబంధ వాటాదారులు ఈ సదస్సులో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డీసీపీ తినే నూనెల తయారీ, విక్రయాల్లో ఆహార భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని డీసీపీ స్పష్టం చేశారు. ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లోనూ విడి నూనెను లేదా అన్‌బ్రాండెడ్ నూనెల విక్రయాన్ని పూర్తిగా నిషేధిస్తూ, ప్యాకేజింగ్ చేసిన, సీల్ చేసిన నూనెలను మాత్రమే అమ్మాలని వ్యాపారులకు హెచ్చరికలు జారీ చేశారు. విడి ఆయిల్ విక్రయం ప్రజల ఆరోగ్యానికి ప్రమాదకరమని, ఇది చట్టవిరుద్ధమని ఆయన పేర్కొన్నారు.
సమావేశంలో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ మార్గదర్శకాల ప్రకారం సరైన బ్రాండింగ్, ప్యాకేజింగ్‌పై తయారీ తేదీ, ఎక్స్‌పైరీ తేదీ, బ్యాచ్ నంబర్, ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ నంబర్ ఖచ్చితంగా ఉండాలని పేర్కొన్నారు. తక్కువ రకం నూనెలను కలపడం లేదా హానికరమైన పదార్థాలను వాడటం వంటి చర్యలకు పాల్పడితే భారతీయ న్యాయ సంహిత, ఆహార భద్రత చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
15 రోజుల గడువు
నిబంధనలను పాటించడానికి, విడి నూనెల విక్రయాలను నిలిపివేయడానికి ఆయిల్ అసోసియేట్స్‌కు 15 రోజుల గడువు విధించారు. ఈ గడువు ముగిసిన తర్వాత కూడా నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు ఉంటాయని డీసీపీ హెచ్చరించారు. వ్యాపారంలో పారదర్శకత పాటిస్తూ, లాభం కంటే ప్రజల ఆరోగ్యానికే ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
వినియోగదారులు కేవలం బ్రాండెడ్, సీల్ చేసిన నూనెలను మాత్రమే కొనుగోలు చేయాలని అధికారులు సూచించారు. ఎక్కడైనా కల్తీ జరుగుతున్నట్లు అనుమానం వస్తే వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో హెచ్-ఫాస్ట్ ఇన్‌స్పెక్టర్లు ఎన్. రంజిత్ కుమార్ గౌడ్, ఎం. అంజయ్య, వ్యాపార ప్రతినిధులు పాల్గొన్నారు.
