
నిడుబ్రోలు రైల్వే ట్రాక్‌పై కాల్పుల కలకలం: సిగ్నల్ వ్యవస్థ ధ్వంసానికి దుండగుల యత్నం
గుంటూరు జిల్లా నిడుబ్రోలు రైల్వే స్టేషన్ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున పెను ఉద్రిక్తత నెలకొంది. రైల్వే సంకేత వ్యవస్థను (సిగ్నలింగ్) ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తున్న దుండగులు అడ్డుకోబోయిన పోలీసులపై రాళ్లతో దాడికి దిగారు. ఈ క్రమంలో ఆత్మరక్షణ కోసం పోలీసులు గాలిలోకి కాల్పులు జరపడం స్థానికంగా కలకలం రేపింది.
తెల్లవారుజామున దుండగుల హల్‌చల్
గుంటూరు రైల్వే డీఎస్పీ పి. అక్కేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం తెల్లవారుజామున సుమారు 2:30 గంటల సమయంలో 377వ మైలురాయి సమీపంలోని హోమ్ సిగ్నల్ పాయింట్ వద్ద ఈ ఘటన జరిగింది. సాధారణ పహారాలో భాగంగా గస్తీ నిర్వహిస్తున్న పోలీసులకు అక్కడ ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించారు. పోలీసులు వారిని దగ్గరకు వెళ్లి నిలదీయగా దుండగులు ఒక్కసారిగా పోలీసులపై రాళ్లు రువ్వడం ప్రారంభించారు. పరిస్థితి చేయి దాటడంతో తమను తాము రక్షించుకునేందుకు పోలీసులు సుమారు 10 రౌండ్లు కాల్పులు జరిపారు. పోలీసుల హెచ్చరికలతో భయపడిన నిందితులు చీకటిని అడ్డం పెట్టుకుని పక్కనే ఉన్న వ్యవసాయ పొలాల్లోకి పారిపోయారు.
దొరికిన ఆధారాలు.. దోపిడీ ముఠా పనేనా?
ఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులకు వైర్ కట్టర్లు, ఎలక్ట్రికల్ టెస్టర్లు, హ్యాండ్ గ్లౌజులు లభ్యమయ్యాయి. రైల్వే సిగ్నల్ వ్యవస్థకు సంబంధించిన వైర్లను కట్ చేసి రైళ్లను నిలిపివేయడమే వీరి ప్రధాన లక్ష్యమని పోలీసులు అనుమానిస్తున్నారు. సాధారణంగా సిగ్నల్ వ్యవస్థలో లోపాలు సృష్టించి రైళ్లను ఆపి ఆపై ప్రయాణికుల నుంచి బంగారు గొలుసులు, విలువైన వస్తువులను దోచుకునే ముఠా పనే ఇదని ప్రాథమికంగా నిర్ధారించారు.
గతంలోనూ అదే తరహా నేరాలు
కాగా గతంలో ఈ ముఠా రైళ్లలో అలారం చైన్ పుల్లింగ్ ద్వారా రైళ్లను ఆపి దోపిడీలకు పాల్పడేదని ఆ తర్వాత కోచ్‌లు మారుస్తూ పోలీసుల కళ్లు గప్పి తప్పించుకునేవారని సమాచారం. అయితే ఈసారి ఏకంగా సిగ్నల్ పాయింట్లనే దెబ్బతీసి భారీ దోపిడీకి స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఘటనపై కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
