
కరీంనగర్‌లో కాల్పుల కలకలం.. జ్యువెలరీ షాపులో బంగారు ఆభరణాల దోపిడీ
తెలంగాణలోని కరీంనగర్ నగరంలో ఆదివారం పట్టపగలే దొంగలు బీభత్సం సృష్టించారు. పీఎంజీ జ్యువెలరీ షోరూమ్‌లోకి చొరబడిన దుండగులు, సిబ్బందిపై కాల్పులు జరిపి బంగారు ఆభరణాలతో పరారయ్యారు. ఈ ఘటనలో నలుగురు షోరూమ్ ఉద్యోగులు తీవ్రంగా గాయపడ్డారు.
పోలీసుల వివరాల ప్రకారం, ఐదుగురు వ్యక్తులు కస్టమర్ల ముసుగులో షోరూమ్‌లోకి ప్రవేశించారు. మొదట ఒక వ్యక్తి 20 గ్రాముల బంగారు గొలుసు చూపించాలని కోరాడు. కొద్దిసేపటికి మరో ఇద్దరు లోపలికి వచ్చి ఆభరణాలు కొనుగోలు చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. అనంతరం మరో ఇద్దరూ వారితో చేరడంతో మొత్తం ఐదుగురు దుకాణంలో ఉన్నారు. ఒక్కసారిగా తుపాకులు బయటకు తీసిన దుండగులు.. షోరూమ్ సిబ్బందిని మోకాళ్లపై కూర్చోబెట్టి బెదిరించారు. ఆభరణాలను దోచుకునే క్రమంలో సిబ్బంది వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించగా, దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సేల్స్ మేనేజర్‌తో సహా నలుగురు సిబ్బంది గాయపడ్డారు. గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు.
కరీంనగర్ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఘటన జరిగిన వెంటనే షోరూమ్‌ను సందర్శించారు. ఘటన జరిగిన పది నిమిషాల ముందే ఆయన అదే ప్రాంతంలో అభివృద్ధి పనుల్లో పాల్గొని వెళ్లడం గమనార్హం. దుండగులు హిందీ, తెలుగు భాషల్లో మాట్లాడుతున్నారని, వారు పక్కా ప్రణాళికతోనే ఈ దారి దోపిడీకి పాల్పడ్డారని ఆయన పేర్కొన్నారు.
దోచుకెళ్లిన బంగారం విలువ ఎంత అనేది పోలీసులు ఆరా తీస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నగరవ్యాప్తంగా చెక్‌పోస్టులు నిర్వహించి తనిఖీలు ముమ్మరం చేశారు. పట్టపగలే కాల్పులు జరగడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
