
ఏపీలో రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు.. మేలో రూ.4,987 కోట్ల ఆదాయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు సరికొత్త రికార్డును సృష్టించాయి. 2017లో దేశవ్యాప్తంగా జీఎస్టీ విధానం అమల్లోకి వచ్చినప్పటి నుంచి, ఇప్పటివరకు ఒక మే నెలలో ఇంత భారీ స్థాయిలో ఆదాయం రావడం ఇదే ప్రథమమని రాష్ట్ర వాణిజ్య పన్నుల చీఫ్ కమిషనర్ ఎ. బాబు ఒక ప్రకటనలో వెల్లడించారు. పన్నుల నిర్మాణాన్ని సరళతరం చేయడం, వ్యాపార సౌలభ్యాన్ని పెంపొందించడం కోసం జీఎస్టీ 2.0 కింద రేట్ల హేతుబద్ధీకరణ చర్యలు చేపట్టినప్పటికీ.. రాష్ట్రంలో ఈ అసాధారణ వసూళ్లు సాధ్యమయ్యాయని ఆయన పేర్కొన్నారు.
చీఫ్ కమిషనర్ బాబు మాట్లాడుతూ.. గత ఏప్రిల్ నెలలో నమోదైన రికార్డు స్థాయి ప్రదర్శన తర్వాత, ఆంధ్రప్రదేశ్ ఈ ఏడాది మే నెలలో కూడా రూ. 4,987 కోట్ల జీఎస్టీ ఆదాయంతో అత్యుత్తమ రికార్డును నమోదు చేసింది. ఇది 2025 మే నెల వసూళ్లతో పోలిస్తే రూ. 737 కోట్లు అధికం అని స్పష్టం చేశారు.
19 శాతం వృద్ధి రేటు నమోదు
వాణిజ్య పన్నుల శాఖ గణాంకాల ప్రకారం.. అన్ని రకాల పన్నుల విభాగాల ద్వారా 2025 మే నెలలో రూ. 4,165 కోట్ల ఆదాయం రాగా, 2026 మే నాటికి అది రూ. 4,950 కోట్లకు చేరి, ఏకంగా 19 శాతం వృద్ధిని నమోదు చేసింది. జీఎస్టీ వసూళ్లు పెరగడం, పెట్రోలియంపై విలువ ఆధారిత పన్ను రాబడి ఎక్కువ కావడం, సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన నిబంధనల అమలు వల్ల ఈ వృద్ధి సాధ్యపడింది. మే నెలలో నికర జీఎస్టీ వసూళ్లు రూ. 3,037 కోట్లుగా నమోదయ్యాయి. ఇది గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 16 శాతం వృద్ధిని సూచిస్తుంది. అంతేకాకుండా, జాతీయ సగటు వృద్ధి రేటు (6 శాతం) కంటే ఏపీ ఎంతో మెరుగైన ప్రదర్శన కనబరిచింది. జీఎస్టీ వృద్ధిలో దక్షిణాది రాష్ట్రాలలో కర్ణాటక తర్వాత ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది.
ఇంటిగ్రేటెడ్ జీఎస్‌టీ సెటిల్‌మెంట్ కింద రూ. 1,758.58 కోట్లు వచ్చాయి, ఇది గతేడాది కంటే 15.36 శాతం ఎక్కువ. అలాగే, పెట్రోలియం ఉత్పత్తులపై వ్యాట్ వసూళ్లు ఏడాది ప్రాతిపదికన 31.79 శాతం పెరిగి రూ. 1,768.82 కోట్లకు చేరడం ద్వారా రాష్ట్ర ఆదాయ వేగాన్ని నిలబెట్టాయి. ప్రొఫెషనల్ టాక్స్ (వృత్తి పన్ను) వసూళ్లు రూ. 48.92 కోట్లుగా ఉన్నాయి. ఆధార్ అనుసంధానం, ప్రత్యేక డ్రైవ్‌ల ద్వారా పన్ను చెల్లింపుదారుల సంఖ్యను పెంచడం వల్ల ఇది సాధ్యమైంది. మరోవైపు మద్యంపై వ్యాట్ వసూళ్లు కూడా 4.09 శాతం మేర పెరిగాయి.
2017లో జీఎస్టీ ప్రారంభమైనప్పటి నుంచి ఏటా మే నెల నికర వసూళ్లు స్థిరమైన వృద్ధిని కనబరుస్తున్నాయని వాణిజ్య పన్నుల శాఖ గుర్తుచేసింది. గతంలో పలుమార్లు పన్ను రేట్లు తగ్గించినప్పటికీ.. 2018 మే నెలలో రూ. 1,346 కోట్లుగా ఉన్న నికర జీఎస్టీ వసూళ్లు, 2026 మే నాటికి రూ. 3,037 కోట్లకు పెరగడం విశేషం.
ఆదాయ వృద్ధికి కారణమైన ఏఐ
పన్ను వసూళ్ల పెంపునకు, పన్ను ఎగవేతలను అడ్డుకోవడానికి విభాగం అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తోందని కమిషనర్ తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత డేటా అనలిటిక్స్, ఏఐ-ఆధారిత పరిశీలన వ్యవస్థలు ప్రవేశపెట్టారు. ఏఐ నేతృత్వంలోని ఐజీఎస్‌టీ రివర్సల్ ఎన్‌ఫోర్స్‌మెంట్, యూపీఐ ఆధారిత లావాదేవీల విశ్లేషణను వాడుతున్నారు. విద్యుత్ పంపిణీ సంస్థల డేటాతో రిజిస్ట్రేషన్ల వెరిఫికేషన్ చేస్తున్నారు. పన్ను లీకేజీలను గుర్తించేందుకు రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ, ఏపీసీఆర్‌డీఏ, మైనింగ్ అధికారులు, ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌లతో డేటా అనుసంధానాన్ని మరింత విస్తృతం చేశారు. ఈ వినూత్న చర్యలు అదనపు ఆదాయాన్ని తీసుకురావడమే కాకుండా, పన్నుల పర్యవేక్షణను మరింత బలోపేతం చేశాయని ఎ. బాబు వివరించారు.
