Let's talk: editor@tmv.in
తిరుమలలో 89.4 శాతానికి చేరిన పచ్చదనం: ఐఎస్‌ఎఫ్‌ఆర్ నివేదిక

తిరుమలలో 89.4 శాతానికి చేరిన పచ్చదనం: ఐఎస్‌ఎఫ్‌ఆర్ నివేదిక

Panthagani Anusha
18 మే, 2026

కలియుగ వైకుంఠం తిరుమల కేవలం ఆధ్యాత్మిక కేంద్రమే కాదు ప్రకృతి సంపదకు కూడా అద్దం పడుతోంది. తిరుమల పరిధిలోని మొత్తం భూభాగంలో రికార్డు స్థాయిలో 89.4 శాతం అడవులు ఉన్నట్లు తాజా ‘ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్’ (ఐఎస్‌ఎఫ్‌ఆర్) వెల్లడించింది. టీటీడీ పరిధిలో ఉన్న మొత్తం 2,719 హెక్టార్ల భూమిలో సుమారు 2,431 హెక్టార్లు దట్టమైన అడవులతో నిండి ఉందని అధికారులు తెలిపారు.

శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చే కోట్లాది మంది భక్తులకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తూనే మరోవైపు శేషాచలం కొండల్లోని ప్రకృతిని కాపాడటంలో టీటీడీ సాధించిన గొప్ప విజయమిదని పేర్కొంటూ ఓ ప్రకటన విడుదల చేశారు. 1980 నుంచే టీటీడీ ఈ అడవుల సంరక్షణ బాధ్యతలను భుజాన వేసుకుంది.

ఇదిలా ఉండగా తిరుపతి పరిసరాల్లోని అడవులను కాపాడటానికి టీటీడీ ప్రత్యేక అటవీ విభాగాన్ని నడుపుతోంది. దీని కోసం తిరుమలలో రెండు, తిరుపతిలో రెండు చొప్పున మొత్తం నాలుగు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసులను ఏర్పాటు చేశారు. అడవుల్లో ఎవరైనా అక్రమంగా చెట్లను నరకకుండా (ముఖ్యంగా ఎర్రచందనం స్మగ్లింగ్ చేయకుండా) అదేవిదంగా జంతువులను వేటాడకుండా ఉండటానికి ప్రత్యేక ‘ఫ్లయింగ్ స్క్వాడ్’ బృందాలు రేయింబవళ్లు అడవుల్లో గస్తీ కాస్తున్నాయి.

అడవి తగలబడకుండా ‘ఫైర్ లైన్లు’

ఇక ఎండ కాలంలో ఎండ తీవ్రతకు అడవుల్లో మంటలు (కార్చిచ్చు) అంటుకోవడం సహజం. ఈ మంటలు ఒకచోట నుంచి మరోచోటికి వ్యాపించకుండా ఉండేందుకు టీటీడీ అటవీ శాఖ ప్రతి ఏటా సుమారు 26.5 కిలోమీటర్ల మేర ‘ఫైర్ లైన్లను’ ఏర్పాటు చేస్తోంది. అంటే అడవి మధ్యలో మంటలు పాకకుండా చెట్లను తొలగించి ఖాళీ దారులను తయారు చేస్తారు. దీనివల్ల వన్యప్రాణులకు, విలువైన చెట్లకు ప్రమాదం తప్పుతుంది.

విదేశీ చెట్ల స్థానంలో మన ఊరి మొక్కలు

అడవిలో సహజత్వాన్ని కాపాడేందుకు టీటీడీ ఒక మంచి నిర్ణయం తీసుకుంది. గతంలో పెరిగిన అకేషియా లాంటి విదేశీ చెట్ల స్థానంలో.. మన దేశానికి చెందిన, మన మట్టిలో పెరిగే ముక్కలను నాటుతున్నారు. దాదాపు 576 హెక్టార్లలో రావి, మర్రి, మంచి గంధం, ఎర్రచందనం, మామిడి, నేరేడు వంటి మన ఊరి చెట్లను పెద్ద ఎత్తున నాటారు. ఇందుకోసం ప్రత్యేక నర్సరీలను ఏర్పాటు చేసి ఔషధ మొక్కలను, పూల మొక్కలను పెంచుతున్నారు.

క్రూర జంతువుల నుంచి భక్తులకు రక్షణ

ఇక శేషాచలం అడవుల్లో ఏనుగులు, చిరుతలు, ఎలుగుబంట్లు, రకరకాల పాములు జీవిస్తుంటాయి. భక్తులు తిరుమలకు వస్తుంటారు కాబట్టి, మనుషులకు - జంతువులకు మధ్య ఎలాంటి గొడవలు జరగకుండా టీటీడీ జాగ్రత్తలు తీసుకుంటోంది. ముఖ్యంగా వేసవిలో నీటి కోసం జంతువులు జనావాసాల్లోకి రాకుండా అడవి లోపల కృత్రిమ నీటి గుంతలను ఏర్పాటు చేసి నీటిని నింపుతున్నారు. అదేవిధంగా నడక మార్గాలు, క్యూ లైన్ల వద్ద భక్తుల భద్రత కోసం పాములు పట్టే ‘స్నేక్ రెస్క్యూ’ టీమ్‌లను ఎప్పుడూ అందుబాటులో ఉంచుతున్నారు.

అదేవిధంగా ఈ అటవీ శాఖ కేవలం అడవులనే కాకుండా శ్రీవారి నిత్య పూజలకు ఆలయ ఆచారాలకు అవసరమైన గంధపు చెక్కలు, వంటచెరకు, దర్భ గడ్డి వంటి పూజా సామాగ్రిని కూడా అందిస్తుంది. దీంతో పాటు తిరుమల, తిరుపతి నగరాలు అందంగా, పచ్చగా కనిపించేలా రోడ్ల పక్కన, డివైడర్ల మధ్యలో మొక్కలు నాటడం, ఉద్యానవనాలను (పార్కులను) మెయింటైన్ చేయడం వంటి పనులు చేస్తోంది

తిరుమలలో 89.4 శాతానికి చేరిన పచ్చదనం: ఐఎస్‌ఎఫ్‌ఆర్ నివేదిక - Tholi Paluku