
పచ్చని ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా హరిత సమరం:ఏపీ డిప్యూటీ సీఎం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనాన్ని పెంపొందించడం భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించడమే లక్ష్యంగా అటవీ శాఖ సరికొత్త హరిత సమరానికి శ్రీకారం చుట్టిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించారు. రాష్ట్రంలో పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు అటవీ శాఖ ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా 2.5 కోట్ల విత్తన బంతుల (సీడ్ బాల్స్) పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నట్లు ఆయన వెల్లడించారు. జీవ వైవిధ్యం, పర్యావరణ స్థిరత్వమే లక్ష్యంగా ఈ మహా యజ్ఞం సాగుతుందని స్వచ్ఛమైన ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించడమే దీని ప్రధాన ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రతిష్టాత్మక హరిత ఉద్యమంపై అటవీ శాఖ ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేస్తూ ఆయన ఈ వివరాలను వెల్లడించారు.
పర్యావరణ పరిరక్షణ కోసం చేపట్టే ఈ హరిత సమరంలో భాగంగా రాబోయే జూన్ నెలలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున విత్తన బంతుల తయారీ కార్యక్రమాలు జరుగుతాయని పవన్ కళ్యాణ్ తెలిపారు. వర్షాకాలం సీజన్‌ను పూర్తిగా వినియోగించుకుంటూ జులై, ఆగస్టు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా ఈ విత్తన బంతులను విస్తారంగా చల్లడానికి అటవీ శాఖ పూర్తి ప్రణాళికలు సిద్ధం చేసిందని ఆయన వివరించారు. ఈ హరిత విప్లవాన్ని కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా పరిమితం చేయకుండా ఒక ప్రజా ఉద్యమంగా మార్చాలని డిప్యూటీ సీఎం పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ప్రజా ప్రతినిధులు పొదుపు సంఘాల మహిళలు, ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది, పాఠశాల, కళాశాల విద్యార్థులు, యువత, స్వచ్ఛంద సంస్థలు, పర్యావరణ వాలంటీర్లతోపాటు రాష్ట్ర ప్రజలను అన్ని వర్గాల ప్రతినిధులను పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
అటవీ ప్రాంతాల్లో పచ్చదనాన్ని పెంచేందుకు మూడు రకాల ప్రత్యేక పద్ధతులను ఉపయోగించనున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. నేరుగా చల్లడం, చేతులతో నాటడంతో పాటు మనుషులు వెళ్లడానికి వీలుకాని కొండలు, దట్టమైన అటవీ ప్రాంతాలలో అత్యాధునిక డ్రోన్ల సాంకేతికతను ఉపయోగించి ఈ విత్తన బంతులను వెదజల్లనున్నట్లు ఆయన వివరించారు. అడవులలో జీవవైవిధ్యాన్ని పెంపొందించడం పర్యావరణ పరిణామాన్ని మెరుగుపరచడం వాతావరణ మార్పులను సమర్థవంతంగా తట్టుకునే విధంగా స్వచ్ఛమైన పచ్చని ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించడం కోసం ఈ విధానాలు దోహదపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజలకు ఆత్మీయ పిలుపునిస్తూ “మనం చల్లే ప్రతి విత్తన బంతి.. మన భవిష్యత్తుకు ఇచ్చే ఒక నమ్మకమైన హామీ. రాబోయే తరాల కోసం ఆంధ్రప్రదేశ్‌ను మరింత పచ్చగా, ఆరోగ్యకరంగా సుస్థిరంగా మార్చేందుకు మనమంతా చేతులు కలుపుదాం అని పిలుపునిచ్చారు.
