Let's talk: editor@tmv.in
తెలంగాణ నుంచి ఏపీ వక్ఫ్ బోర్డుకు రికార్డుల బదిలీకి గ్రీన్ సిగ్నల్:వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్

తెలంగాణ నుంచి ఏపీ వక్ఫ్ బోర్డుకు రికార్డుల బదిలీకి గ్రీన్ సిగ్నల్:వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్

Panthagani Anusha
20 మే, 2026

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ కొలిక్కి రాని వక్ఫ్ రికార్డుల బదిలీ ప్రక్రియలో ఎట్టకేలకు ఒక కీలక ముందడుగు పడింది. తెలంగాణ రాష్ట్రంలో ఉండిపోయిన ఏపీ వక్ఫ్ బోర్డుకు సంబంధించిన కీలక రికార్డులు, ఫైళ్లను ఆంధ్రప్రదేశ్‌కు బదిలీ చేసేందుకు మార్గం సుగమమైంది. ఉమ్మడి రాష్ట్ర విభజన అనంతరం దాదాపు పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ రికార్డుల సమస్య పరిష్కారం దిశగా అడుగులు పడటంపై ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ హర్షం వ్యక్తం చేశారు.

వక్ఫ్ చట్టం-1995తో పాటు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన విభజన మార్గదర్శకాల ప్రకారం.. ఏపీకి సంబంధించిన అన్ని రికార్డులు, ఆస్తుల వివరాలు, నిధులు ఏపీ వక్ఫ్ బోర్డుకు బదిలీ కావాల్సి ఉంది. అయినప్పటికీ గత కొన్నేళ్లుగా ఈ ప్రక్రియ ముందుకు సాగలేదు. అయితే తాను ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ అంశాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు అబ్దుల్ అజీజ్ తెలిపారు. తానే స్వయంగా తెలంగాణ వక్ఫ్ బోర్డు చైర్మన్‌ను కలిసి ప్రత్యేక దృష్టి సారించడమే కాకుండా తెలంగాణ వక్ఫ్ బోర్డు సీఈఓ, ఇతర ఉన్నతాధికారులతో పలుమార్లు సమావేశాలు నిర్వహించి అధికారిక లేఖల ద్వారా ఈ ప్రక్రియను వేగవంతం చేసినట్లు పేర్కొన్నారు.

ఈ సమస్య పరిష్కారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మైనారిటీల సంక్షేమ శాఖ మంత్రి ఎన్.ఎం.డి ఫరూక్ జోక్యం అత్యంత కీలకమని చైర్మన్ కొనియాడారు. వారిద్దరూ ప్రత్యేకంగా స్పందించి సంబంధిత ఉన్నతాధికారుల స్థాయిలో జరిపిన చర్చలు, పరిపాలనా కృషి వల్లే ఈ వేగవంతమైన పురోగతి సాధ్యమైందన్నారు. నిరంతర అనుసరణల ఫలితంగా తెలంగాణ ప్రభుత్వం చివరకు ఒక మెమో జారీ చేస్తూ.. హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌కు రికార్డు గదిని విడుదల చేసి ఆ రికార్డులను తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు సీఈఓకు అప్పగించాలని ఆదేశాలు జారీ చేయడం శుభపరిణామమని ఆయన పేర్కొన్నారు.

ప్రస్తుతం తెలంగాణ వక్ఫ్ బోర్డు వద్ద ఏపీ వక్ఫ్ బోర్డుకు సంబంధించి మొత్తం 2971 ఫైళ్లు, 8 సర్వే కమిషనర్ రిపోర్ట్ పుస్తకాలు, 3 గెజెట్లు ఉన్నట్లు అబ్దుల్ అజీజ్ వెల్లడించారు. హైదరాబాద్ కలెక్టర్ నుంచి రికార్డు రూమ్‌ను ఖాళీ చేయించి ఆ పత్రాలను తెలంగాణ సీఈఓకు అందించిన వెంటనే తాము వాటిని అధికారికంగా స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. రికార్డుల గుర్తింపు ఇన్వెంటరీ, స్వీకరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఇప్పటికే ఏపీ వక్ఫ్ బోర్డు తరపున ప్రత్యేక అధికారిక బృందాలను కూడా రంగంలోకి దించినట్లు ఆయన స్పష్టం చేశారు.

కేవలం రికార్డుల బదిలీయే కాకుండా ఏపీ వక్ఫ్ బోర్డుకు రావాల్సిన రూ. 55.5 కోట్ల బకాయి నగదు నిల్వలు, డిపాజిట్లు, ఇతర ఆర్థిక బకాయిల సాధనకు కూడా ముమ్మర చర్యలు చేపట్టినట్లు చైర్మన్ వివరించారు. వక్ఫ్ ఆస్తుల రక్షణ, న్యాయపరమైన కేసుల నిర్వహణ సర్వే ధృవీకరణ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 'ఉమీద్' పోర్టల్‌లో వివరాల అప్‌లోడ్‌కు ఈ రికార్డులు అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు. ఏపీకి చెందిన ప్రతి వక్ఫ్ ఆస్తి, ప్రతి రికార్డు, ప్రతి రూపాయి ప్రజల హక్కని.. వాటిని పూర్తిస్థాయిలో సాధించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని వక్ఫ్ ఆస్తుల రక్షణలో ఎలాంటి రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియలో తమకు పూర్తి సహకారం అందిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి ఫరూక్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు, కేంద్ర వక్ఫ్ కౌన్సిల్ అధికారులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.