Let's talk: editor@tmv.in
అంగన్‌వాడీ టీచర్‌ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 15,982 ఖాళీలు

అంగన్‌వాడీ టీచర్‌ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 15,982 ఖాళీలు

Gaddamidi Naveen
24 జూన్, 2026

తెలంగాణలో అంగన్‌వాడీ కేంద్రాల బలోపేతానికి, మహిళలకు ఉపాధి అవకాశాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం భారీ నియామక ప్రక్రియను ప్రారంభించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 15,982 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అన్ని జిల్లాల్లో నియామక ప్రక్రియను దశలవారీగా చేపడుతున్నారు.

మొత్తం ఖాళీలలో 3,100 అంగన్‌వాడీ టీచర్ పోస్టులు, 12,882 అంగన్‌వాడీ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. మల్టీజోన్-1 పరిధిలో 9,590 పోస్టులు, మల్టీజోన్-2 పరిధిలో 6,392 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇప్పటికే పెద్దపల్లి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో నోటిఫికేషన్లు జారీ కాగా, మిగిలిన జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్లు కూడా త్వరలో విడుదల కానున్నాయి.

నియామక విధానంలో ప్రభుత్వం పలు కీలక మార్పులు తీసుకొచ్చింది. అంగన్‌వాడీ టీచర్ పోస్టులకు ఇంటర్మీడియట్ విద్యార్హతను తప్పనిసరి చేసింది. అలాగే ఎంపిక ప్రక్రియలో ఇంటర్వ్యూలను ప్రవేశపెట్టి, ప్రతిభ ఆధారంగా వెయిటేజీ విధానాన్ని అమలు చేయనుంది. ఈ మేరకు జీఓ నంబర్ 4, 6ల ద్వారా మార్గదర్శకాలను ఖరారు చేశారు.

ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న ఉత్తమ విధానాలు, సేవా నిబంధనలను అధ్యయనం చేసిన అనంతరం కొత్త నియామక విధానాన్ని రూపొందించినట్లు ప్రభుత్వం తెలిపింది. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. స్థానికులకు ప్రాధాన్యం కల్పించే ఉద్దేశంతో, అభ్యర్థులు దరఖాస్తు చేసే అంగన్‌వాడీ కేంద్రం ఉన్న గ్రామం లేదా వార్డుకు చెందిన వారై ఉండాలని నిబంధన విధించింది. ఈ నియామకాలతో బాలల సంక్షేమ సేవలు మరింత బలోపేతం కావడంతో పాటు వేలాది మహిళలకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

మొత్తం ఖాళీలు ఇలా..

ట్యాగ్‌లు
TelanganaAnganwadiAnganwadiJobsTelanganaJobsJobNotificationGovernmentJobsRecruitmentDriveWomenEmploymentAnganwadiTeacher
అంగన్‌వాడీ టీచర్‌ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 15,982 ఖాళీలు - Tholi Paluku