

గ్రీన్ గ్రోత్ సమ్మిట్: సీఎం రేవంత్ రెడ్డితో అంతర్జాతీయ ప్రతినిధులు, కెనడా హైకమిషనర్ భేటీ
నగరంలో నిర్వహిస్తున్న గ్రీన్ గ్రోత్ ఎకనమిక్ సమ్మిట్–2026 సందర్భంగా అంతర్జాతీయ ప్రతినిధి బృందాలు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి రాష్ట్రంలో పెట్టుబడులు, సుస్థిర అభివృద్ధి, భవిష్యత్ భాగస్వామ్య అవకాశాలపై విస్తృతంగా చర్చించాయి. ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో జరిగిన సమావేశంలో పర్యావరణం, సామాజిక, పరిపాలనా అంశాలతో పాటు మౌలిక సదుపాయాలు, కృత్రిమ మేధ (ఏఐ), భవిష్యత్ పెట్టుబడులు, పట్టణాభివృద్ధి వంటి కీలక రంగాలపై చర్చలు జరిగాయి.
ఈ సమావేశానికి డాక్టర్ ఎం. శరవణన్, నిలి గిల్బర్ట్, మహేష్ కొండూరు, అమిత్ మెహ్రా, దిలెక్ అయహన్, థామస్ ప్రోలిక్, సెంథిల్ తొండమాన్ తదితర అంతర్జాతీయ ప్రతినిధులు హాజరయ్యారు. మెరీడియన్ కలెక్టివ్ ప్రతినిధులు రిత్వికా భట్టాచార్య, ఉమా భట్టాచార్యతో పాటు చామల కిరణ్ కుమార్ రెడ్డి, పలువురు అధికారులు కూడా పాల్గొన్నారు.
అనంతరం భారత్‌లోని కెనడా హై కమిషనర్ క్రిస్ కూటర్ ముఖ్యమంత్రిని కలిసి వాణిజ్యం, పెట్టుబడులు, ఆవిష్కరణలు, విద్య, సుస్థిర అభివృద్ధి రంగాల్లో కెనడా–తెలంగాణ భాగస్వామ్యాన్ని మరింత విస్తరించే అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టు, హైదరాబాద్ మెట్రో విస్తరణ, ప్రతిపాదిత ఫ్యూచర్ సిటీ వంటి ప్రాజెక్టులను ప్రస్తావిస్తూ, వీటిలో కెనడా సాంకేతిక నైపుణ్యం, పెట్టుబడులకు విశేష అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.
తెలంగాణపై కెనడియన్ సంస్థల విశ్వాసానికి నిదర్శనంగా ఫిరాన్ టెక్నాలజీ గ్రూప్ హైదరాబాద్‌లో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం, సీఐబీసీ తన గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్‌ను ప్రారంభించడం, అలాగే సీపీపీ ఇన్వెస్ట్‌మెంట్స్ హైదరాబాద్‌కు చెందిన సీటీఆర్‌ఎల్‌ఎస్ డేటా సెంటర్స్ తో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుని భారీ పెట్టుబడులకు ముందుకు రావడం వంటి పరిణామాలను క్రిస్ కూటర్ ప్రస్తావించారు.
సమాచార సాంకేతికత, లైఫ్ సైన్సెస్, రక్షణ, ఏరోస్పేస్ రంగాల్లో తెలంగాణ సాధించిన పురోగతిని వివరించిన ముఖ్యమంత్రి, ప్రపంచ ప్రఖ్యాత ఫార్చ్యూన్–500 కంపెనీల గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లకు హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ఎదుగుతోందన్నారు. మూసీ నది పునరుజ్జీవనాన్ని పర్యావరణ పరిరక్షణతో పాటు సుస్థిర ఆర్థికాభివృద్ధికి దోహదపడే సమగ్ర ప్రణాళికగా అమలు చేస్తున్నామని తెలిపారు. అలాగే కెనడాకు చెందిన విశ్వవిద్యాలయాలు కలిసి హైదరాబాద్‌లో మల్టీ-యూనివర్సిటీ క్యాంపస్ ఏర్పాటు చేయాలని కోరుతూ, డిసెంబర్‌లో జరగనున్న తెలంగాణ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ రెండో ఎడిషన్‌లో కెనడియన్ కంపెనీలు, విద్యాసంస్థలు, పెట్టుబడిదారులు పాల్గొనాలని ఆహ్వానించారు.
ఈ సందర్భంగా క్రిస్ కూటర్ తెలంగాణ ప్రభుత్వం అవలంబిస్తున్న పెట్టుబడులకు అనుకూల విధానాలను, దూరదృష్టితో కూడిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రశంసించారు. త్వరలోనే కెనడియన్ వాణిజ్య ప్రతినిధి బృందం తెలంగాణను సందర్శించి ఇంధనం, పట్టణాభివృద్ధి, రక్షణ, ఏరోస్పేస్ తదితర రంగాల్లో సహకార అవకాశాలపై చర్చించనున్నట్లు వెల్లడించారు. అలాగే ముఖ్యమంత్రి నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందాన్ని కెనడా పర్యటనకు అధికారికంగా ఆహ్వానించారు.
