
ఏపీలో ‘గ్రీన్ ఎనర్జీ’ విప్లవం..రూ.3 వేల కోట్ల సోలార్ ప్రాజెక్టులను ప్రారంభించనున్న లోకేష్
ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రగామి పునరుత్పాదక ఇంధన కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మరో చారిత్రాత్మక మైలురాయిని అధిగమించింది. కడప జిల్లాలో ప్రముఖ ఇంధన సంస్థ 'ఎస్‌ఏఈఎల్ లిమిటెడ్' సుమారు రూ.3,000 కోట్ల భారీ పెట్టుబడితో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన 600 మెగావాట్ల సామర్థ్యం గల సౌర విద్యుత్ ప్రాజెక్టులను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నేడు అధికారికంగా ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోనే అతిపెద్ద పరిశుభ్ర ఇంధన ప్రాజెక్టుల్లో ఒకటిగా నిలిచిన ఈ కేంద్రం ఏపీ గ్రీన్ ఎనర్జీ ప్రస్థానంలో సరికొత్త అధ్యాయానికి నాంది పలకనుంది.
రికార్డు సమయంలో నిర్మాణం.. ఆధునిక సాంకేతికత
ఎస్‌ఏఈఎల్ సోలార్ ఎంహెచ్‌పీ1, ఎంహెచ్‌పీ2 పేర్లతో నిర్మించిన ఈ రెండు ప్రాజెక్టులను సంస్థ కేవలం 11 నెలల రికార్డు కాలంలోనే పూర్తి చేయడం విశేషం. కడప జిల్లాలో 2,400 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ సమగ్ర సౌర విద్యుత్ కేంద్రంలో అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిం చారు. ఇందులో ప్రతి ఒక్కటి 300 మెగావాట్ల సామర్థ్యం కలిగి ఉండగా ఎంహెచ్‌పీ1 ఈ ఏడాది జనవరి 30న, ఎంహెచ్‌పీ2 మార్చి 13న ఇప్పటికే వాణిజ్య కార్యకలాపాలను విజయవంతంగా ప్రారంభించాయి.
ఈ ప్రాజెక్టులలో 12 లక్షలకు పైగా అధునాతన 'TOPCon బైఫేషియల్' సౌర మాడ్యూల్స్‌ను వినియోగించారు. వీటిలో అత్యధిక భాగాన్ని పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని ఎస్‌ఏఈఎల్ సొంత తయారీ యూనిట్లలోనే అసెంబుల్ చేయడం గమనార్హం.
25 ఏళ్ల సుదీర్ఘ ఒప్పందం
ఈ ప్రాజెక్టుల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను 'సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా' (తో కుదుర్చుకున్న 25 ఏళ్ల పవర్ పర్చేజ్ ఒప్పందం ప్రకారం జాతీయ గ్రిడ్‌కు సరఫరా చేయనున్నారు.
ఈ మెగా ప్రాజెక్టు పర్యావరణ పరిరక్షణలోనూ కీలక పాత్ర పోషించనుంది. దీని ద్వారా ప్రతి ఏడాది దాదాపు 11 లక్షల టన్నుల కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలు తగ్గుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. తద్వారా గ్లోబల్ వార్మింగ్ నియంత్రణకు ఏపీ తన వంతు భారీ సహకారాన్ని అందించినట్లవుతుంది.
స్థానిక ఉపాధి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతం
ఈ ప్రాజెక్టు కేవలం ఇంధన రంగానికే పరిమితం కాకుండా స్థానిక ఆర్థికాభివృద్ధికి సైతం పెద్ద పీట వేసింది. నిర్మాణ దశలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 1,000 మందికి పైగా కార్మికులకు ఉపాధి లభించగా వారిలో సుమారు 80 శాతం మంది స్థానిక ప్రాంతాలకు చెందినవారే కావడం విశేషం. అంతేకాకుండా ఈ ప్రాజెక్టు కోసం ప్రాంతీయ రైతులతో దీర్ఘకాలిక భూమి లీజు ఒప్పందాలు కుదుర్చుకోవడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోనున్నాయి. భూవినియోగ అనుమతులు, గ్రిడ్ కనెక్టివిటీ ఇతర పరిపాలనాపరమైన అనుమతుల ప్రక్రియలను వేగవంతం చేయడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, స్థానిక అధికారులు అందించిన సహకారం మరువలేనిదని ఎస్‌ఏఈఎల్ సంస్థ కొనియాడింది.
2029 నాటికి రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యం!
ఇదిలా ఉండగా కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 'ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ–2024' కింద 2029 నాటికి పునరుత్పాదక ఇంధనం, గ్రీన్ హైడ్రోజన్, ఎనర్జీ స్టోరేజ్, ట్రాన్స్‌మిషన్, అనుబంధ తయారీ రంగాల్లో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలని ఏపీ సర్కారు బృహత్తర లక్ష్యంతో ఉంది. ఈ నేపథ్యంలో కడపలో ప్రారంభమవుతున్న ఈ ప్రాజెక్టు పెట్టుబడిదారులలో నమ్మకాన్ని పెంచేందుకు దిక్సూచిగా మారనుంది.
