
అనుమతుల గడువు ముగిసినా గ్రావెల్ తవ్వకాలు కొనసాగుతున్నాయి: వైసీపీ నేత కాకాణి
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమ గ్రావెల్, ఇసుక, మట్టి తవ్వకాలపై మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు స్థానిక గ్రామస్తులతో కలిసి నెల్లూరులోని జిల్లా మైనింగ్ శాఖ కార్యాలయానికి వెళ్లి డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మైన్స్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. అక్రమ మైనింగ్‌ను వెంటనే నిలిపివేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ కందలపాడులో జరుగుతున్న గ్రావెల్ తవ్వకాల అనుమతుల గడువు 2026 ఏప్రిల్ 30తో ముగిసిపోయిందని మైనింగ్ శాఖ అధికారులు స్వయంగా అంగీకరించారని తెలిపారు. అయినప్పటికీ ఎలాంటి అనుమతులు లేకుండానే తవ్వకాలు కొనసాగుతున్నాయని ఆరోపించారు. ఏఎంఆర్ సంస్థ అక్రమంగా రాయల్టీ వసూళ్లు చేస్తోందని సామాన్య రైతులు తమ పొలాలకు మట్టి తరలించుకోవాలన్నా బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నారని విమర్శించారు.
తరతరాలుగా సాగు చేసుకుంటున్న పేద రైతుల భూములను గ్రావెల్ మాఫియా ధ్వంసం చేస్తోందని వరి, నిమ్మ తోటలు, కూరగాయల పంటలపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాల జీవనాధారాన్ని అక్రమ మైనింగ్ దెబ్బతీస్తోందన్నారు. భారీ గుంతలు తవ్వడం వల్ల జంతువులు, మనుషులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
మాజీ మంత్రి సోమిరెడ్డి ఈ అక్రమ మైనింగ్ ద్వారా నెలకు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు వసూళ్లు చేస్తున్నారని కాకాణి ఆరోపించారు. తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని భావిస్తే దేవుడి ముందు ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. అదేవిధంగా పోలీస్ స్టిక్కర్లు వేసుకున్న ప్రైవేట్ వ్యక్తులు వాహనాలను అడ్డగించి బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు.
జిల్లాలో అనంతసాగరం, బుచ్చిరెడ్డి పాలెం, సంగం, విరువూరు, సూరాయపాలెం ప్రాంతాల్లో కూడా అక్రమ ఇసుక, గ్రావెల్ తవ్వకాలు విస్తృతంగా సాగుతున్నాయని కాకాణి ఆరోపించారు. అవసరమైతే లోకాయుక్త, గ్రీన్ ట్రిబ్యునల్, న్యాయస్థానాలను ఆశ్రయించి దోషులపై చర్యలు తీసుకునే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
