

తెలంగాణకు రూ.5,000 కోట్ల మంజూరు చేయండి: కేంద్ర మంత్రికి డిప్యూటీ సీఎం వినతి
తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, విద్యా రంగంలో భారీ మార్పులు, మౌలిక వసతుల విస్తరణే ధ్యేయంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బుధవారం న్యూఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మూలధన వ్యయాల కోసం కేంద్రం నుంచి అదనపు ఆర్థిక సహాయం అందించాలని, విద్యా రంగ ప్రాజెక్టులకు ఎఫ్‌ఆర్‌బీఎమ్ పరిమితుల నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఆయన వినతిపత్రాలు సమర్పించారు.
రూ.5,000 కోట్ల ప్రత్యేక ఆర్థిక సహాయం
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల మూలధన పెట్టుబడుల కోసం అందిస్తున్న (ఎస్ఏఎస్సీఐ) పథకం కింద తెలంగాణకు అదనంగా రూ.5,000 కోట్ల ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని మంజూరు చేయాలని భట్టి విక్రమార్క కోరారు. ఈ పథకం ద్వారా రాష్ట్రాలకు 50 ఏళ్ల పాటు వడ్డీ లేని రుణాల రూపంలో అందిస్తున్న సహకారానికి తెలంగాణ ప్రభుత్వం తరఫున ఆయన కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను తెలంగాణకు ఇప్పటికే రూ.4,208 కోట్లు మంజూరైన విషయాన్ని ప్రస్తావిస్తూ.. రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రగతి పనులకు మరింత ఆర్థిక మద్దతు అవసరమని కేంద్ర మంత్రికి వివరించారు.
2014 నుంచి 2023 మధ్య గత ప్రభుత్వం ప్రత్యేక ప్రయోజన సంస్థల ద్వారా ఇష్టారాజ్యంగా చేసిన అప్పుల భారం వాటి వడ్డీల చెల్లింపుల కారణంగా ప్రస్తుత తెలంగాణ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పెరిగిందని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. అయినప్పటికీ.. విద్య, వైద్యం, గ్రామీణ మౌలిక వసతులు, మానవ వనరుల అభివృద్ధి రంగాలలో తమ ప్రభుత్వం ఎక్కడా రాజీ పడకుండా భారీ స్థాయిలో పెట్టుబడులు పెడుతోందని స్పష్టం చేశారు.
విద్యా రంగానికి రూ.30,000 కోట్ల
రాష్ట్ర విద్యా రంగ రూపాంతరానికి కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం రూ.30,000 కోట్ల పెట్టుబడుల ప్రణాళికను సిద్ధం చేసిందని డిప్యూటీ సీఎం వివరించారు. రూ.21,000 కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా 105 అత్యున్నత ప్రమాణాలు గల “యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్” క్యాంపస్‌ల నిర్మాణం చేపడుతున్నామన్నారు. మరో రూ.9,000 కోట్లతో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలు, సాంకేతిక విద్యాసంస్థలలో డిజిటల్ మౌలిక వసతులను బలోపేతం చేయనున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో ఏసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) సహకారంతో రూ.4,049.11 కోట్ల వ్యయంతో చేపట్టే స్కూల్స్ ప్రాజెక్ట్, ఏసియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ) భాగస్వామ్యంతో రూ.4,903.44 కోట్ల వ్యయంతో చేపట్టే తెలంగాణ ఎడ్యుకేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అప్‌గ్రేడేషన్ మిషన్ ప్రాజెక్టులకు కేంద్ర డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ (డీఈఏ) ఆమోదం తెలిపినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఎఫ్‌ఆర్‌బీఎమ్ నుంచి మినహాయింపు ఇవ్వాలి
ఈ రెండు అంతర్జాతీయ బ్యాంకుల ద్వారా పొందే రుణాలను రాష్ట్ర ఎఫ్‌ఆర్‌బీఎమ్ పరిమితుల నుంచి మినహాయించాలని భట్టి విక్రమార్క కేంద్ర ఆర్థిక మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఇవి సాధారణ ఖర్చులు కావని, భవిష్యత్ తరాల మానవ వనరుల అభివృద్ధికి, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల విద్యా సాధికారతకు ఉపయోగపడే దీర్ఘకాలిక మూలధన పెట్టుబడులని వివరించారు. కేంద్రం నిర్దేశించిన “వికసిత భారత్–2047” లక్ష్య సాధనలో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ఈ విద్యా విప్లవం కీలక పాత్ర పోషిస్తుందని, కేంద్రం నుంచి ఆశించిన మద్దతు లభిస్తే రాష్ట్ర అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని భట్టి పేర్కొన్నారు. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో డిప్యూటీ సీఎం వెంట రాష్ట్ర ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ప్లానింగ్ డిపార్ట్మెంట్ సెక్రటరీ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ తదితరులు పాల్గొన్నారు.
