
పెండింగ్ వ్యవసాయ కనెక్షన్లు తక్షణమే మంజూరు చేయండి : మంత్రి రవికుమార్
రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న అన్ని వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను వెంటనే మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. వేసవి కాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించాలని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థల సీఎండీలతో మంత్రి నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో విద్యుత్ సరఫరా పరిస్థితులు, వ్యవసాయ కనెక్షన్లు, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలుపై సుదీర్ఘంగా సమీక్షించారు.
వేసవిలో విద్యుత్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో గృహ, వ్యాపార, పరిశ్రమల వినియోగదారులకు అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. సాంకేతిక కారణాలతో ఎక్కడైనా విద్యుత్ అంతరాయం ఏర్పడితే ప్రజలకు వెంటనే సమాచారం ఇవ్వాలని మరమ్మతు పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిదంగా అధిక ఉష్ణోగ్రతల కారణంగా ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతినే అవకాశాలు ఉన్నందున ఫీల్డ్ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.
ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘సూర్య ఘర్’, ‘పీఎం కుసుమ్’, ‘రివ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కేమ్ (ఆర్డీఎస్‌ఎస్)’ వంటి పథకాల లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని మంత్రి సూచించారు. ప్రత్యేకంగా సూర్య ఘర్ పథకం కింద ఎస్సీ వర్గాలకు జూలై నాటికి ఆరు లక్షల విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని ఆదేశించారు. ఇతర వర్గాలకు కూడా సోలార్ కనెక్షన్లను వేగంగా అందించి రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని పెద్ద ఎత్తున పెంచాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
