Let's talk: editor@tmv.in
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Gaddamidi Naveen
5 మే, 2026

తెలంగాణలో అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులతో అత్యవసర వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాల వల్ల ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ఆయన ఆదేశించారు.

రాబోయే వారం మొత్తం అకాల వర్షాలు కొనసాగే అవకాశం ఉందన్న వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో రైతులకు నష్టం జరగకుండా తక్షణ రక్షణ చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. గత రాత్రి రాష్ట్రంలోని పలుచోట్ల కురిసిన భారీ ఈదురుగాలులతో కూడిన వర్షాలు పంట కొనుగోలు కేంద్రాలు, మార్కెట్ యార్డుల్లో నిల్వ ఉంచిన ధాన్యాన్ని ప్రభావితం చేశాయి. సమావేశంలో రబీ మార్కెటింగ్ సీజన్ పురోగతి, ధాన్యం రాకలు, కొనుగోలు వేగం, స్థానిక అడ్డంకులు, అకాల వర్షాల ప్రభావంపై విస్తృతంగా చర్చించారు.

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 8,575 ప్యాడీ ప్రొక్యూర్‌మెంట్ సెంటర్లు పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు ధాన్యం సేకరణ 14.80 లక్షల మెట్రిక్ టన్నులకు చేరుకుంది. ఇందులో పెద్ద మొత్తంలో సాధారణ రకాల ధాన్యం కూడా ఉంది. సుమారు 1.84 లక్షల మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయగా, రైతుల ఖాతాల్లో ఇప్పటికే రూ. 2,001.96 కోట్లు జమ చేసినట్లు వెల్లడించారు.

కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) అమలులో ప్రస్తుత నెల అత్యంత కీలకమని మంత్రి పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ధాన్యం రాకలు మరింత పెరిగే అవకాశం ఉన్నందున కొనుగోళ్లను వెంటనే మరింత వేగవంతం చేయాలని సూచించారు. ముఖ్యంగా నల్గొండ, నిజామాబాద్ జిల్లాల్లో అధిక పరిమాణంలో ధాన్యం వస్తున్న కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.

తడిసిన ధాన్యంపై ప్రత్యేక చర్యలు

అకాల వర్షాల వల్ల నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం తదితర జిల్లాల్లో గణనీయంగా ధాన్యం తడిసిందని అధికారులు వివరించారు. నల్గొండ జిల్లాలో ఒక్కసారిగా కురిసిన ఇరవై నిమిషాల వర్షంతో నాలుగు కేంద్రాల్లో 299 మెట్రిక్ టన్నుల ధాన్యం తడిసినట్లు కలెక్టర్ నివేదించారు. ముందస్తు హెచ్చరికలున్నప్పటికీ బలమైన గాలుల కారణంగా టార్పాలిన్లు ఎగిరిపోయినట్లు తెలిపారు. ఇదే తరహా ఘటనలు మహబూబాబాద్, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కూడా నమోదయ్యాయి. తడిసిన ధాన్యాన్ని వెంటనే కేటాయించిన పారాబాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించి పంటను కాపాడాలని మంత్రి ఆదేశించారు. ప్రతిరోజూ ఉదయం వాతావరణ హెచ్చరికల ఆధారంగా ప్రతి కొనుగోలు కేంద్రంలో ముందుగానే టార్పాలిన్లు సిద్ధంగా ఉంచాలని, ధాన్యాన్ని నష్టం కలగకముందే పూర్తిగా కప్పివేయాలని చెప్పారు.

రాష్ట్రవ్యాప్తంగా సుమారు 16 లక్షల మెట్రిక్ టన్నుల మధ్యంతర నిల్వ సామర్థ్యాన్ని సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. అలాగే పారాబాయిల్డ్ బియ్యానికి దాదాపు 16.8 లక్షల మెట్రిక్ టన్నుల సమాన కేటాయింపులు లభించగా, అదనంగా మరో 15 లక్షల మెట్రిక్ టన్నుల కేటాయింపును కేంద్రాన్ని కోరినట్లు వెల్లడించారు. కొత్తవి, పాతవి కలిపి 18.5 కోట్ల గన్నీ సంచులు కూడా సమీకరించారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు అకాల వర్షాల పరిస్థితుల్లో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని మంత్రి స్పష్టం చేశారు. గ్రామ స్థాయి వరకు ధాన్యం కొనుగోళ్లు యథావిధిగా కొనసాగుతాయని రైతులకు భరోసా కల్పించాలని కలెక్టర్లకు ఆదేశించారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రులు తమ తమ జిల్లాల్లో కొనుగోలు ప్రక్రియను వ్యక్తిగతంగా పర్యవేక్షించాలని సూచించారు.

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి - Tholi Paluku