
జిల్లాలో ధాన్యం సేకరణను వేగవంతం చేయాలి: పౌర సరఫరాల కమిషనర్ రవీంద్ర
నల్గొండ జిల్లాలో రబీ ధాన్యం సేకరణ వేగవంతం చేయాలని పౌర సరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల నుంచి రైస్ మిల్లులకు ధాన్యం తరలింపును మరింత వేగంగా నిర్వహించడంతో పాటు అన్‌లోడింగ్ పనులు పెంచాలని సూచించారు. వాహనాల రాకపోకలను సమర్థంగా నిర్వహించి, అవసరమైన చోట అదనపు లారీలు, హమాలీలను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.
మంగళవారం నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తిలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కమిషనర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్‌తో కలిసి కేంద్రంలోని ఏర్పాట్లు, ఇప్పటివరకు వచ్చిన ధాన్యం పరిమాణం, హమాలీల అందుబాటు, ట్రక్ షీట్లు, మిల్లులకు అనుసంధానించిన వాహనాలు, టార్పాలిన్లు తదితర అంశాలను పరిశీలించారు.
అధికారులు కమిషనర్‌కు వివరాలు తెలియజేస్తూ, పెద్దకాపర్తి కేంద్రానికి ఇప్పటివరకు 25 వేల క్వింటాళ్ల ధాన్యం చేరిందని తెలిపారు. ఇందులో 7 వేల క్వింటాళ్ల ధాన్యానికి కొనుగోలు ప్రక్రియ పూర్తై ట్యాబ్ ఎంట్రీ నమోదైందన్నారు. ప్రస్తుతం కేంద్రంలో సుమారు 15 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలో ఉందని పేర్కొన్నారు. ఇది ప్రధాన కొనుగోలు కేంద్రం కావడంతో అదనంగా 10 నుంచి 20 లారీలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. హమాలీల కొరత లేకుండా ముందస్తుగా మిల్లర్లకు సమాచారం ఇచ్చామని, ప్రతి కొనుగోలు కేంద్రంలో సుమారు 30 మంది హమాలీలు, మిల్లుల్లో 30 నుంచి 35 మంది కార్మికులు పనిచేస్తున్నారని వెల్లడించారు. ట్యాబ్ ఎంట్రీలను శాతం వందకు పూర్తి చేయాలని కమిషనర్ పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల్లో డ్రైయర్లు, ధాన్యం శుభ్రపరిచే ప్రక్రియ, గన్నీ బ్యాగులు, టార్పాలిన్ల లభ్యతపై ఆరా తీశారు. అవసరమైన చోట అదనపు టార్పాలిన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
అనంతరం వట్టిమర్తిలోని సిద్ధార్థ రైస్ ఇండస్ట్రీస్‌ను సందర్శించిన స్టీఫెన్ రవీంద్ర అక్కడ అన్‌లోడింగ్ పనులు, వాహనాల రొటేషన్‌ను మరింత పెంచాలని యాజమాన్యానికి సూచించారు. మిల్లుల్లో స్థలాభావం ఏర్పడితే ధాన్యాన్ని మధ్యంతర గోదాములకు తరలించాలని అధికారులకు సూచించారు. పెండింగ్‌లో ఉన్న ట్యాబ్ ఎంట్రీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, రవాణా వేగవంతం కోసం మరిన్ని వాహనాలను సమకూర్చాలని రవాణా శాఖ ఉప కమిషనర్ వాణిని ఆదేశించారు. ఈ తనిఖీలో పౌర సరఫరాల డైరెక్టర్ రోహిత్ సింగ్, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
