
రాష్ట్రవ్యాప్తంగా జోరుగా ధాన్యం కొనుగోళ్లు.. 90 లక్షల మెట్రిక్ టన్నులే లక్ష్యం
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా యాసంగి సీజన్‌కు సంబంధించి వరి కొనుగోలు ప్రక్రియ యుద్ధ ప్రాతిపదికన సాగుతోంది. ఈ సీజన్‌లో సుమారు 141 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా వేయగా, ప్రభుత్వం 90 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణను లక్ష్యంగా పెట్టుకుంది. రైతులకు అందుబాటులో ఉండేలా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 8,525 కొనుగోలు కేంద్రాలను ప్రతిపాదించగా, ఇప్పటికే 6,500 కంటే ఎక్కువ కేంద్రాలు పూర్తిస్థాయిలో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఈ ప్రక్రియను పర్యవేక్షించేందుకు 43,000 మంది శిక్షణ పొందిన సిబ్బందిని నియమించారు.
ఇప్పటివరకు 8.50 లక్షల మెట్రిక్ టన్నుల వరి కొనుగోలు చేయగా, అందులో 7 లక్షల మెట్రిక్ టన్నులకుపైగా ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించారు. రవాణా సౌకర్యాల కోసం 6,500 లారీలు నిరంతరం సేవలందిస్తున్నాయి. రైతులకు అనుకూలంగా ధాన్యంలో తేమ శాతాన్ని తగ్గించేందుకు ఆటోమేటెడ్ డ్రైయర్లు, క్లీనర్లు, తేమ కొలిచే మీటర్లు, తార్పాలిన్‌లు వంటి సౌకర్యాలు అందుబాటులో ఉంచారు. అదనంగా, ధాన్యం నిల్వకు 20 కోట్ల గన్నీ బ్యాగులను సిద్ధం చేశారు. ఇప్పటివరకు రూ.2,031 కోట్ల విలువైన ధాన్యాన్ని సేకరించగా, ఇప్పటికే రూ.323 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. కనీస మద్దతు ధర కల్పిస్తూ, వేగవంతమైన చెల్లింపులు జరిగేలా ప్రభుత్వం పారదర్శక వ్యవస్థను ఏర్పాటు చేసింది.
ఇతర పంటల సేకరణ
ఇతర పంటల కొనుగోళ్లు కూడా సమాంతరంగా కొనసాగుతున్నాయి. మొక్కజొన్న 3.46 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయగా, 64,779 మంది రైతులు లబ్ధి పొందారు. శనగలు 30,220 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయబడగా, 15,933 మంది రైతులకు ప్రయోజనం కలిగింది. సన్‌ఫ్లవర్ 3,492 మెట్రిక్ టన్నులు సేకరించి, 2,512 మంది రైతులకు మద్దతు అందించారు.
