Let's talk: editor@tmv.in
చంచల్‌గూడలో 'జైలు మ్యూజియం' ప్రారంభించిన గవర్నర్‌
చంచల్‌గూడలో 'జైలు మ్యూజియం' ప్రారంభించిన గవర్నర్‌

చంచల్‌గూడలో 'జైలు మ్యూజియం' ప్రారంభించిన గవర్నర్‌

Gaddamidi Naveen
13 మే, 2026

జైలు జీవితం అంటే ఎలా ఉంటుంది? ఖైదీల దినచర్య, వారి ఆహారపు అలవాట్లు, గతా కాలపు శిక్షా స్మృతులు ఎలా ఉండేవో తెలుసుకోవాలని ఉందా? అయితే మీకోసం తెలంగాణ జైళ్ల శాఖ ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది. హైదరాబాద్‌లోని చంచల్‌గూడలో ఉన్న స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కరెక్షనల్ అడ్మినిస్ట్రేషన్ ప్రాంగణంలో దేశంలోనే ఐదవది అయిన 'జైలు మ్యూజియం' 'జైలు అనుభవం' కార్యక్రమాన్ని మంగళవారం తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఘనంగా ప్రారంభించారు. జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ సౌమ్య మిశ్రా, ఇతర ఉన్నతాధికారులు ఈ వేడుకలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ప్రజలకు జైలు పరిపాలన, సంస్కరణ సేవలు, ఖైదీల పునరావాసంపై అవగాహన కల్పించడం. సమాజంలో నేర నివారణ, ఖైదీల పరివర్తన ఎంత కీలకమో ఈ మ్యూజియం కళ్లకు కడుతుందన్నారు. సందర్శకులు జైలు జీవితాన్ని ప్రత్యక్షంగా అనుభవించేలా రూపొందించిన ఈ 'జైలు అనుభవం' ప్రాజెక్ట్, జైళ్ల శాఖ పట్ల ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి, వారిని బాధ్యతాయుతమైన పౌరులుగా మార్చేందుకు కృషి చేస్తుందని పేర్కొన్నారు.

ఈ మ్యూజియం కేవలం ప్రదర్శన వస్తువులకే పరిమితం కాకుండా, 'ఫీల్ ది జైల్' అనే వినూత్న కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తోంది. సందర్శకులు ఒక రోజు పాటు జైలు వాతావరణంలో గడపవచ్చు. ఖైదీలు తినే ఆహారం, వారు ఉండే గదులు, వారి దినచర్యను ప్రత్యక్షంగా అనుభవించే అవకాశం కల్పిస్తారు. గతంలో సంగారెడ్డి జిల్లా జైలులో ఈ సదుపాయం ఉండేది, కానీ ఆ భవనం కూలిపోవడంతో ఇప్పుడు దానిని ఆధునిక హంగులతో చంచల్‌గూడకు తరలించారు.

ఈ సందర్భంగా తెలంగాణ జైళ్లశాఖ డైరెక్టర్ జనరల్ సౌమ్య మిశ్రా మాట్లాడుతూ, గతంలో సంగారెడ్డి జిల్లా కేంద్ర కారాగారంలో జైలు మ్యూజియం ఉండేదని తెలిపారు. అయితే ఆ బ్రిటిష్ కాలం నాటి భవనం కొన్ని సంవత్సరాల క్రితం కూలిపోవడంతో మ్యూజియం మూతపడిందన్నారు. అక్కడ ఉన్న చారిత్రక వస్తువులు, ప్రదర్శనలను సంరక్షించి, ఆధునిక పద్ధతుల్లో అభివృద్ధి చేసి ఇప్పుడు సికాలో కొత్త రూపంలో ప్రజల ముందుకు తీసుకొచ్చామని వివరించారు. కార్యక్రమాల సందర్శనల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. సందర్శకులు ఆన్‌లైన్‌లో స్లాట్ బుకింగ్ చేసుకునేందుకు telanganajailexperience.com అందుబాటులో ఉందన్నారు. మ్యూజియం ప్రాంగణంలో సందర్శకుల కోసం ప్రత్యేకంగా కెఫెటేరియా సౌకర్యం కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. వివరాలు మరియు బుకింగ్‌ల కోసం telanganafeelthejail@gmail.com ఈ-మెయిల్ ద్వారా లేదా +91 94946 32046 ఫోన్ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

కొత్తగా ఏర్పాటు చేసిన ఈ జైలు మ్యూజియంలో ప్రాచీన కాలం నుంచి ఆధునిక జైలు వ్యవస్థ వరకు జరిగిన మార్పులను చిత్రాలు, నమూనాలు, ప్రత్యేక ప్రదర్శనల ద్వారా చూపించనున్నారు. నేరాలకు గతంలో అమలు చేసిన శిక్షా విధానాలు, అప్పటి జైళ్ల పరిస్థితులు, ఖైదీలకు ఉపయోగించిన సంకెళ్లు, గొలుసులు, ఇనుప బంధనాలు, పాత జైలు గదుల నమూనాలు సందర్శకులను ఆకట్టుకోనున్నాయి. పాతకాల జైళ్లలో ఉపయోగించిన అసలు వస్తువులను కూడా ప్రదర్శనలో ఉంచారు.

అంతేకాకుండా తెలంగాణ జైళ్లశాఖలో చోటుచేసుకున్న సంస్కరణలను కూడా మ్యూజియంలో ప్రత్యేకంగా ప్రదర్శిస్తున్నారు. కేవలం శిక్ష విధించే వ్యవస్థ నుంచి ఖైదీలను మార్పు దిశగా నడిపించే పునరావాస కేంద్రాలుగా జైళ్లను ఎలా తీర్చిదిద్దుతున్నారనే అంశాన్ని వివరిస్తున్నారు. జైళ్లలో నిర్వహిస్తున్న పరిశ్రమలు, వ్యవసాయ కార్యకలాపాలు, నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను కూడా ప్రదర్శనలో పొందుపరిచారు.

మ్యూజియంలో ఏర్పాటు చేసిన ఆడియో, వీడియో గదుల ద్వారా ఖైదీల ‘ములాఖత్‌లు’, కోర్టులకు తరలింపు ప్రక్రియ, జైళ్లలోని రోజువారీ కార్యకలాపాలు వంటి అంశాలను సందర్శకులకు వివరించనున్నారు. దీని ద్వారా జైళ్ల నిర్వహణపై ప్రజల్లో అవగాహన పెరగడంతో పాటు, ఖైదీల పునరావాసం ఎంత ముఖ్యమో తెలియజేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యంగా అధికారులు పేర్కొన్నారు.