
అజారుద్దీన్, కోదండరాం ఎమ్మెల్సీ ప్రతిపాదనలకు గవర్నర్ ఆమోదం
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. గవర్నర్ కోటా కింద మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్, ప్రొఫెసర్ ఎం. కోదండరాంలను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా శనివారం ఆమోదం తెలిపారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద ఊరట లభించింది.
గత ఏడాది అక్టోబర్ 31న మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అజారుద్దీన్,రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఆరు నెలల్లోగా శాసనసభ లేదా మండలిలో సభ్యత్వం పొందాల్సి ఉంది. ఈ గడువు ఏప్రిల్ 30తో ముగియనున్న నేపథ్యంలో ఈ ఆమోదం కీలకంగా మారింది. ఈ అంశంపై ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి ఏప్రిల్ 19న గవర్నర్‌తో సమావేశమై చర్చించారు.
తెలంగాణ ఉద్యమంలో పొలిటికల్ జేఏసీ ఛైర్మన్‌గా కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండరాం నామినేషన్‌కు కూడా గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గతంలో బీఆర్ఎస్ హయాంలో శ్రవణ్ దాసోజు, కుర్రా సత్యనారాయణల నామినేషన్లను అప్పటి గవర్నర్ తమిళిసై తిరస్కరించడం, ఆపై ఈ వ్యవహారం కోర్టులకు వెళ్లడంతో ఈ నియామకాలు కొంతకాలం జాప్యం అయ్యాయి. అయితే కోదండరాం 2024లో నామినేషన్ పొందారు.
గవర్నర్ నిర్ణయాన్ని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ స్వాగతించారు. అజారుద్దీన్, కోదండరాం వంటి ప్రముఖుల రాకతో శాసనమండలి గౌరవం పెరుగుతుందని, వారి అనుభవం ప్రభుత్వ పాలనకు ఎంతో దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు.
