
బొమ్మదేవర ధీరజ్‌కు గవర్నర్, సీఎం చంద్రబాబు అభినందనలు
టర్కీలోని అంటాల్యాలో జరిగిన ఆర్చరీ ప్రపంచ కప్ (స్టేజ్-3) టోర్నమెంట్‌లో అద్భుత ప్రదర్శనతో రెండు స్వర్ణ పతకాలు సాధించిన ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్‌పై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ధీరజ్ సాధించిన ఈ చారిత్రాత్మక విజయం పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం అభినందనలు తెలిపారు.
ఈ టోర్నమెంట్‌లో ధీరజ్ పురుషుల వ్యక్తిగత రికర్వ్ విభాగంలో తన తొలి అంతర్జాతీయ ప్రపంచ కప్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. దీనితో పాటు, మిక్స్డ్ టీమ్ రికర్వ్ విభాగంలో కుమ్‌కుమ్ మోహోద్‌తో కలిసి మరో స్వర్ణ పతకాన్ని సాధించి దేశ కీర్తి పతాకాన్ని ఎగురవేశాడు.
ఆర్చరీ ప్రపంచ కప్‌లో వ్యక్తిగత విభాగంతో పాటు, మిక్స్డ్ టీమ్ విభాగంలోనూ స్వర్ణాలు సాధించిన ధీరజ్ బొమ్మదేవరకు లోక్ భవన్ నుంచి విడుదల చేసిన అధికారిక ప్రకటనలో గవర్నర్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ విజయం ఆంధ్రప్రదేశ్‌తో పాటు యావత్ భారతదేశానికి గర్వకారణమని, భవిష్యత్తులో ధీరజ్ మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
ఇదే సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ధీరజ్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ఆర్చరీ క్రీడలో ప్రపంచంలోనే అత్యంత ప్రతిభావంతుడైన సౌత్ కొరియా అథ్లెట్ లీ వూ సీక్‌ను ఫైనల్‌లో ఓడించి ధీరజ్ స్వర్ణం సాధించడం, అతని అసాధారణ నైపుణ్యానికి నిదర్శనమని సీఎం సోషల్ మీడియా వేదికగా కొనియాడారు. టర్కీ వేదికగా ఒకే టోర్నీలో రెండు బంగారు పతకాలు సాధించడం రాష్ట్రానికి ఎంతో గర్వకారణమన్నారు. ధీరజ్‌తో పాటు అద్భుత ప్రదర్శన చేసిన కుమ్‌కుమ్ మోహోద్‌కు, భారత ఆర్చరీ జట్టుకు ఆయన భవిష్యత్తులోనూ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
