Let's talk: editor@tmv.in
కాళేశ్వరం పునరుద్ధరణే ప్రభుత్వ లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి
కాళేశ్వరం పునరుద్ధరణే ప్రభుత్వ లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి
కాళేశ్వరం పునరుద్ధరణే ప్రభుత్వ లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి

కాళేశ్వరం పునరుద్ధరణే ప్రభుత్వ లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి

Gaddamidi Naveen
21 ఏప్రిల్, 2026

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సోమవారం కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీని సందర్శించి, గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి విచారణ నుంచి తప్పించుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీజేపీ కాళ్లవేళ్ల పడుతోందని ఆయన ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజీ వద్ద దెబ్బతిన్న నిర్మాణాలను పరిశీలించిన అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు కోరి తొమ్మిది నెలలు గడుస్తున్నా, కేంద్రం సీబీఐ విచారణ ఎందుకు ప్రారంభించడం లేదని ఆయన ప్రశ్నించారు.

ఢిల్లీ పర్యటనపై ధ్వజం

బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, వినోద్ కుమార్ అత్యవసరంగా ఢిల్లీకి వెళ్లడం వెనుక రహస్యం ఏంటని సీఎం ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణ కోసం ఒత్తిడి పెంచుతుండటంతో, భయపడిన బీఆర్ఎస్ నేతలు బీజేపీ పెద్దలను కలిశారని ఆయన ఆరోపించారు. మీడియా బయటపెట్టే వరకు హరీష్ రావు పర్యటనను బీఆర్ఎస్ ఎందుకు రహస్యంగా ఉంచింది? అని ఆయన నిలదీశారు. హరీష్ రావు ఢిల్లీలో కొందరు ప్రముఖ ఆర్ఎస్ఎస్ నేతలను కలిసి, కేంద్రంపై ఒత్తిడి తెచ్చి అవినీతి కేసుల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణ చేశారు. దీనిపై విచారణకు హరీష్ రావు సిద్ధమా అని సవాల్ విసిరారు.

ప్రధాని మోడీ, అమిత్ షా తమ పర్యటనల్లో కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంలా మారిందని ఆరోపించారని, మరి ఇప్పుడు చర్యలు తీసుకోవడానికి ఎందుకు వెనుకాడుతున్నారని రేవంత్ రెడ్డి అడిగారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గతంలో 48 గంటల్లో కేసీఆర్‌ను అరెస్ట్ చేస్తామని అన్నారని, కానీ ఇప్పటివరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై నిజాలు బయటకు వస్తాయనే భయంతోనే బీఆర్ఎస్ నేడు రాజకీయ సభను నిర్వహించిందని సీఎం విమర్శించారు. అధికారులతో నెల రోజుల కసరత్తు తర్వాతే తాము నేడు మేడిగడ్డలో సమీక్ష నిర్వహించామని స్పష్టం చేశారు. తీర్పు రాకముందే లాయర్లను కలవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించిన సీఎం, కాళేశ్వరం అవినీతిలో దోషులెవరినీ వదిలిపెట్టబోమని పేర్కొన్నారు. ప్రాజెక్టును వదిలివేయకుండా, అవసరమైన మరమ్మతులు పూర్తి చేసి రైతులకు నీరు అందిస్తామని హామీ ఇచ్చారు.

ప్రభుత్వ భవిష్యత్ ప్రణాళిక

కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అక్రమాలకు బాధ్యులైన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. బ్యారేజీలకు అవసరమైన మరమ్మతులపై త్వరలోనే ఒక కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు. ఒకవేళ కేంద్రం వెంటనే సీబీఐ విచారణకు ఆదేశించకపోతే, కాళేశ్వరం నుండే పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాన్ని ప్రారంభిస్తామని హెచ్చరించారు.

మేడిగడ్డ పునరుద్ధరణకు శాస్త్రీయ పరీక్షలు

కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణ దిశగా కీలక అడుగు వేశారు. లక్ష కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్టును వదిలేస్తే అదొక భారం, పునర్నిర్మిస్తే మరొక భారం. కానీ, అన్ని అంశాలపై లోతుగా చర్చించిన తర్వాత, దీనిని పునరుద్ధరించి ప్రజల ప్రయోజనాల కోసం వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అని పేర్కొన్నారు. కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజీ ప్రాంతాన్ని మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో సందర్శించారు. ప్రాజెక్టును మళ్లీ వినియోగంలోకి తీసుకువచ్చేందుకు జరుగుతున్న శాస్త్రీయ పరీక్షలను ఆయన స్వయంగా పరిశీలించారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) మార్గదర్శకాల ప్రకారం బ్యారేజీ పునరుద్ధరణ పనులపై జరుగుతున్న జియోఫిజికల్, జియోటెక్నికల్ పరీక్షలను సీఎం పరిశీలించారు. బ్యారేజీ వద్ద ముఖ్యంగా పియర్స్ (స్తంభాలు) 20, 21, 22 వద్ద బోర్ రిగ్స్ ద్వారా శాంపిల్స్ సేకరిస్తున్న తీరును అధికారులు సీఎంకు వివరించారు.

మొత్తం 520 బోర్ రిగ్స్ ద్వారా సేకరించిన శాంపిల్స్‌ను సెంట్రల్ వాటర్ అండ్ రీసెర్చ్ స్టేషన్ ల్యాబ్‌కు పంపనున్నారు. ఈ పరీక్షల ఫలితాల ఆధారంగా బ్యారేజీ దెబ్బతిన్న తీరుపై స్పష్టత రానుంది. డ్రోన్ బేస్డ్ జీపీఆర్ టెస్ట్ ద్వారా 20 నుంచి 30 మీటర్ల లోతు వరకు నేల స్వభావాన్ని విశ్లేషిస్తున్నారు. అలాగే సీలెంట్ పైల్స్‌కు సంబంధించి క్రాస్‌హోల్ సీస్మిక్ టెస్టుల వివరాలను కూడా అధికారులు సీఎంకు వివరించారు. పర్యటన అనంతరం సీఎం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల లోపాలను సరిదిద్దే విషయంలో ఇప్పుడు ఒక స్పష్టత వచ్చింది. సమస్యను పూర్తిగా అర్థం చేసుకుంటే సగం పరిష్కారం లభించినట్టే అని సీఎం పేర్కొన్నారు.

ప్రతి అడుగులోనూ ఎన్డీఎస్ఏ అనుమతులు తీసుకుంటూ, వారి నిబంధనలకు అనుగుణంగానే ముందుకు వెళ్లాలి.సేకరించిన శాంపిల్స్ ఫలితాలను బట్టి, నిపుణుల సలహాల మేరకు పునరుద్ధరణ పనులు ప్రారంభించాలని తెలిపారు. కేంద్ర ఏజెన్సీలు, నిర్మాణ సంస్థలు, రాష్ట్ర అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

ప్రాజెక్టును రైతులకు ఉపయోగపడేలా మళ్లీ తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యతని సీఎం స్పష్టం చేశారు.

ప్రాణహిత-చేవెళ్ల పునఃప్రారంభం

తుమ్మడిహెట్టి వద్ద నిలిపివేసిన ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టును మళ్లీ ప్రారంభించి, అక్కడి నుంచి శ్రీపాద ఎల్లంపల్లి మీదుగా చేవెళ్ల వరకు నీటిని తరలించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సీఎం వెల్లడించారు. గోదావరి జలాలను వినియోగించి ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలలకు సాగు, తాగునీరు అందించాలని ఈ ప్రాజెక్టు 1975లో ఆవిర్భవించిందని గుర్తు చేశారు. అనంతరం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2009లో జలయజ్ఞంలో భాగంగా ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు ప్రారంభమైందని తెలిపారు. 160 టీఎంసీల నీటి కేటాయింపులతో రూ.38,500 కోట్ల అంచనాతో 16.40 లక్షల ఎకరాలకు సాగునీరు, పరిశ్రమలు, హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం ప్రణాళికలు రూపొందించారని చెప్పారు.

అయితే, తర్వాతి ప్రభుత్వం రీడిజైన్ పేరుతో ప్రాజెక్టు స్థలాన్ని మార్చి ఖర్చులు పెంచిందని విమర్శించారు. 2016లో ప్రారంభించి 2019లో పూర్తయిందని చెప్పినా, 2020లోనే బ్యారేజీలలో లోపాలు ఉన్నాయని ఇంజనీర్లు నిర్మాణ సంస్థకు లేఖలు రాశారని తెలిపారు. 2023లో కుప్పకూలిన ఘటన తర్వాత ఇంజనీర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారని చెప్పారు. ఎన్‌డీఎస్ఏ 2023 నవంబర్ 1న ప్రాథమిక నివేదిక ఇవ్వగా, అనంతరం పూర్తిస్థాయి నివేదికలో డిజైన్, నిర్మాణం, నాణ్యత, నిర్వహణలో లోపాలు ఉన్నట్లు వెల్లడైందని పేర్కొన్నారు. ఆ నివేదికను అసెంబ్లీలో చర్చించి కేంద్రానికి పంపినట్లు తెలిపారు. వదిలేసే పరిస్థితి లేదు.. కచ్చితమైన ప్రణాళికతో ముందుకు వెళ్లి, మరమ్మతులు, పునర్నిర్మాణం పూర్తి చేసి తీరుతాం అని సీఎం ధీమా వ్యక్తం చేశారు.

గోదావరి నదిపై నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని బ్యారేజీలు దెబ్బతినడం 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. అప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని ఆరోపిస్తూ వస్తోంది.

కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి సవాల్

ఈ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ భవిష్యత్తుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించామని, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో సున్నాకు పరిమితం చేశామని గుర్తు చేస్తూ, రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఉనికిని చాటకుండా చేస్తానని శపథం చేశారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌కు కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేయకపోతే నా పేరు మార్చుకుంటాను. జూబ్లీహిల్స్, కంటోన్మెంట్ ఉపఎన్నికల్లో బీఆర్ఎస్‌కు సమాధి కట్టాం. ఇక ముందు కూడా అదే పునరావృతమవుతుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

గతంలో ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ, కాంగ్రెస్ పదేళ్లపాటు పాలించాయని, తెలంగాణ వచ్చాక బీఆర్ఎస్ కూడా రెండు దశాబ్దాలు పాలించిందని చెప్పారు. ఇప్పుడు తాను, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కలిసి కాంగ్రెస్‌ను వరుసగా రెండోసారి అధికారంలోకి తీసుకువస్తామని, దేశంలోనే అత్యధిక మెజారిటీతో మళ్ళీ కాంగ్రెస్ సర్కార్ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 2029లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ శ్రేణులు పనిచేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాల్లో 15 గెలిపించి రాహుల్ గాంధీకి కానుకగా ఇస్తామన్నారు. మేడిగడ్డ బ్యారేజీని సందర్శించిన సీఎం, కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. లక్ష కోట్ల ప్రజాధనాన్ని గోదావరిలో కలిపేశారు. ప్రాజెక్టు పేరు మార్చి, అంచనాలు పెంచి లక్ష కోట్లు మింగేశారు. ఇది అనాగరిక పాలనైతే, కేసీఆర్‌ను అడవిలో చెట్టుకు ఉరితీసినా తప్పులేదు. కానీ మనం ప్రజాస్వామ్యాన్ని నమ్ముతాం కాబట్టి సీబీఐ విచారణకు కోరాం అని ఘాటుగా విమర్శించారు.

రైతు భరోసా నిధులు విడుదల.. 40 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం

జయశంకర్ భూపాలపల్లి జిల్లా నస్తూర్‌పల్లిలో నిర్వహించిన 'రైతు ఉత్సవాల్లో' పాల్గొన్న సీఎం, 40 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా నిధులను జమ చేశారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా సీఎం రైతులతో కలిసి ర్యాలీలో పాల్గొని, బహిరంగ సభ వేదికగా కంప్యూటర్ బటన్ నొక్కి రూ. 2,200 కోట్ల రెండో విడత నిధులను విడుదల చేశారు.

ఇప్పటివరకు రైతు భరోసా కింద ప్రభుత్వం మొత్తం రూ. 5,700 కోట్లు అందజేసింది. వచ్చే నెలలో మరో రూ. 3,300 కోట్లు విడుదల చేస్తామని సీఎం ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం ఏడాదిలోపే 25.35 లక్షల మంది రైతులకు రూ. 2 లక్షల వరకు రుణమాఫీ చేశామని ఆయన గుర్తుచేశారు. వ్యవసాయం దండగ కాదు పండుగ కావాలన్నదే మా సంకల్పం అని పేర్కొన్నారు.ఆరెంద - దామెరకుంట గ్రామాల మధ్య మానేరు నదిపై రూ. 203 కోట్లతో నిర్మించనున్న హైలెవెల్ బ్రిడ్జికి సీఎం శంకుస్థాపన చేశారు.

కాళేశ్వర క్షేత్ర పునరాభివృద్ధి

బాసర నుంచి భద్రాచలం వరకు నదీతీర ఆలయాలను అభివృద్ధి చేసే ప్రణాళికలో భాగంగా, శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థాన పునరాభివృద్ధి పనులకు సీఎం భూమి పూజ చేశారు. గోదావరి పుష్కరాల నాటికి శాశ్వత ప్రాతిపదికన ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు రూ. 198 కోట్లు కేటాయించారు. కాళేశ్వరం బస్ స్టేషన్ నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేశారు. అంతకుముందు సీఎం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.రైతులను నిటారుగా నిలబెట్టే బాధ్యతను తమ ప్రభుత్వం తీసుకుందని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.

ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన చరిత్ర నీది

జగిత్యాల రాజకీయాల్లో సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి తీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు. రాజకీయ లబ్ధి కోసం పార్టీలు మారడం, సొంత నేతలకే వెన్నుపోటు పొడవటం జీవన్ రెడ్డికి అలవాటని ఆయన ధ్వజమెత్తారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత ఎన్టీఆర్ మంత్రివర్గంలో పనిచేసి ఆయనకే వెన్నుపోటు పొడిచిన చరిత్ర జీవన్ రెడ్డిదని ఆయ‌న‌ విమర్శించారు. అప్పటి రాజకీయ పరిణామాలను ప్రస్తావిస్తూ ఆయనపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గతంలో ఎన్టీఆర్ మంత్రివర్గంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉండి, ఆయనకే వెన్నుపోటు పొడిచి నాదెండ్ల భాస్కర్ రావుతో చేతులు కలిపిన చరిత్ర జీవన్ రెడ్డిదని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. నాదెండ్లను వదిలి కాంగ్రెస్‌లోకి వచ్చిన జీవన్ రెడ్డికి పార్టీ 15 సార్లు అవకాశం ఇచ్చినా ఏం సాధించారని ప్రశ్నించారు. గత 40 ఏళ్లుగా జగిత్యాల కాంగ్రెస్ కార్యకర్తలు జీవన్ రెడ్డి పదవుల కోసం మౌనంగా ఊడిగం చేశారని, కానీ ఆయన మాత్రం తన స్వార్థ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చారని విమర్శించారు. నలభై ఏళ్లు కాంగ్రెస్‌లో ఉండి, మంత్రి పదవి రాలేదన్న అక్కసుతో పార్టీని వీడారని ఆరోపించారు. అధికార దాహం కోసం ఎవరినైనా మోసం చేసే నైజం జీవన్ రెడ్డిదని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు.

ఈ పర్యటనలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, వివేక్ వెంకటస్వామి, సీతక్కతో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, తదితరులు పాల్గొన్నారు. ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్ జైన్, నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

కాళేశ్వరం పునరుద్ధరణే ప్రభుత్వ లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి - Tholi Paluku