

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి జూపల్లి కృష్ణారావు
ఉమ్మడి పాలమూరు జిల్లా పరిధిలోని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి, చివరి ఆయకట్టు వరకు నీళ్లు అందించడమే ప్రజా ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. మంగళవారం ఆయన నాగర్ కర్నూలు, వనపర్తి జిల్లాల పరిధిలోని పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో ప్రధాన భాగమైన నార్లాపూర్ రిజర్వాయర్ ప్రాజెక్ట్ పంప్ హౌస్, ప్యాకేజీ-3 పనులు, ఏదుల పంప్ హౌస్, రిజర్వాయర్, కుమ్మెర వద్ద జరుగుతున్న పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా 90 టీఎంసీల నికర జలాలను వినియోగంలోకి తెచ్చి, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లోని 4.60 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి తెలిపారు. పనుల నిర్వహణ వల్ల ‘మిషన్ భగీరథ’ నీటి సరఫరాకు వస్తున్న ఆటంకాలను అధిగమిస్తూ, యుద్ధప్రాతిపదికన కాలువల పనులను పూర్తి చేస్తామన్నారు. నార్లాపూర్ నుంచి ఉద్ధండాపూర్ వరకు పెండింగ్‌లో ఉన్న ప్రధాన కాలువల పనులన్నింటినీ పూర్తి చేసి, మొత్తంగా 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని చెప్పారు.
మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పట్ల గత ప్రభుత్వం ఘోర నిర్లక్ష్యం వహించిందని మంత్రి జూపల్లి విమర్శించారు. ఈ ప్రాజెక్టు కింద ఉన్న రిజర్వాయర్ల సామర్థ్యం కేవలం 4 టీఎంసీలే ఉండటం వల్ల 40 వేల ఎకరాలకు మించి నీరందే అవకాశం లేదన్నారు. మొత్తం 4.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు సక్రమంగా నీరందాలంటే కనీసం 25 టీఎంసీల సామర్థ్యం ఉండాలని స్పష్టం చేశారు.
త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
ఈ సాగునీటి ప్రాజెక్టుల స్థితిగతులపై క్షేత్రస్థాయిలో సమీక్ష నిర్వహించేందుకు ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి వచ్చే వారంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటించనున్నట్లు మంత్రి వెల్లడించారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా అచ్చంపేట, వనపర్తి, కల్వకుర్తి, కొల్లాపూర్ నియోజకవర్గాల్లోని చివరి ఎకరా వరకు నీరందిస్తామన్నారు. ఇందుకోసం ఎల్లూరు, సింగోటం, గుడిపల్లి వరకు ఉన్న మట్టికట్టలను సరిచేయాల్సి ఉందన్నారు. రైతాంగానికి నీటి ఇబ్బందులు లేకుండా శాశ్వత పరిష్కారం చూపుతూ, పాలమూరు-రంగారెడ్డి ప్యాకేజీ-3 పెండింగ్ పనులన్నింటినీ వేగంగా పూర్తి చేస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు భరోసా ఇచ్చారు.
