
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా అమలుపై ప్రభుత్వ దృష్టి
రాష్ట్రంలో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి భరోసా కల్పించడమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన మంగళవారం కేబినెట్ సబ్ కమిటీ అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది.
ఈ కీలక సమావేశంలో “ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యాచరణ ప్రణాళికతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోబోతున్న “ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా” పథకం అమలు తీరుపై మంత్రుల బృందం విస్తృతంగా చర్చించింది. సబ్ కమిటీ సభ్యులు, రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస రెడ్డిలు ఈ భేటీలో పాల్గొని పథకాల సమర్థవంతమైన అమలుకు సంబంధించి పలు కీలక సూచనలు చేశారు.
జూన్ 2 నుంచి 12 వరకు ప్రత్యేక కార్యక్రమాలు
ప్రజా పాలన - ప్రగతి నివేదిక కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా జూన్ 2న నుంచి జూన్ 12వ తేదీ వరకు పది రోజుల పాటు భారీ ఎత్తున ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాల రూపకల్పన, క్షేత్రస్థాయిలో వాటి అమలు విధానం, పథకాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించే అంశాలపై సబ్ కమిటీ సమగ్రంగా చర్చించింది.
రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి ఆర్థిక, సామాజిక భద్రత కల్పించే దిశగా ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ పథకాన్ని ఎలాంటి లోపాలు లేకుండా, అత్యంత సమర్థవంతంగా లబ్ధిదారులకు చేర్చాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, డీజీపీ సి.వి. ఆనంద్ లతో పాటు వివిధ శాఖలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
