Let's talk: editor@tmv.in
ప్రభుత్వం ప్రజలకు సేవ చేయాలి: ప్రధాని మోడీ

ప్రభుత్వం ప్రజలకు సేవ చేయాలి: ప్రధాని మోడీ

Pinjari Chand
23 ఏప్రిల్, 2026

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా ఉన్న ఒక కోటికిపైగా ఉన్న సివిల్ సర్వెంట్లకు లేఖలు రాశారు. ప్రతి నిర్ణయంలో ‘నాగరికదేవో భవ’ (పౌరుడే దేవుడు) అనే ఆలోచన హృదయంలో ఉండాలని, ప్రభుత్వ యంత్రాంగం తన శక్తి సామర్థ్యాల మేరకు ప్రజలకు సేవ చేయాలని ఆయన సూచించారు. ఏప్రిల్ 21న జరుపుకునే సివిల్ సర్వీసెస్ డేకు ముందురోజైన ఏప్రిల్ 20న ఈ లేఖలు పంపించారు. హిందీ, ఇంగ్లీష్, మరాఠీ, ఒడియా, గుజరాతీ, బెంగాలీ, కన్నడ, పంజాబీ, అస్సామీ, మలయాళం, తెలుగు, తమిళం — మొత్తం 12 భాషల్లో ఈ లేఖలను విడుదల చేశారు. కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వరకు విస్తృతంగా చేరుకునేలా చర్యలు తీసుకున్నారు. 21వ శతాబ్దం సవాళ్లతో పాటు అపార అవకాశాలను కూడా తీసుకొస్తోందని, సాంకేతిక పరిణామాలు, నూతన ఆవిష్కరణలు వేగంగా మారుతున్నాయని మోడీ పేర్కొన్నారు. ఈ చారిత్రక కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే ప్రభుత్వ సేవలు, పని సంస్కృతికి అనుగుణంగా మారాలని అన్నారు. ఐ గాట్‌ కర్మయోగి వంటి వేదికల ద్వారా జీవితాంతం నేర్చుకునే అలవాటు పెంపొందించుకోవడం అవసరమని చెప్పారు. మీరు మెరుగవ్వాలని ఎంచుకుంటున్నారు. దాంతో భారత్ మెరుగవుతుందని సివిల్ సర్వెంట్లను ‘కర్మయోగులు’గా సంబోధించారు.

మిషన్‌ కర్మయోగిలో జీవితాంతం నేర్చుకోవాలి

దేశంలోని పలు ప్రాంతాల్లో రోంగాలి బిహు, విషు, పుత్తండు, పోయిలా బోయిశాఖ్, మహా బిశుబ పణ సంక్రాంతి, వైశాఖి వంటి పండుగల సందడి నడుస్తున్న సమయంలో ఈ లేఖ రాస్తున్నానని తెలిపారు. ఆశ, పునరుద్ధరణ, కొత్త ఆరంభాలకు ఈ పండుగలు ప్రతీకలని చెప్పారు. ‘సాధన సప్తాహ్’ కార్యక్రమంలో పాల్గొన్నందుకు సివిల్ సర్వెంట్లను అభినందించారు. ఈ వేదిక వ్యక్తిగత ఎదుగుదలతో పాటు వృత్తిపరమైన నైపుణ్యాలను పెంపొందించేందుకు ఉపకరిస్తుందని అన్నారు. తాము ప్రారంభించిన ‘మిషన్ కర్మయోగి’ కేవలం శిక్షణకే పరిమితం కాదని, ప్రజాసేవ బాధ్యత వహించే వారు జీవితాంతం నేర్చుకునే ఉత్తమ ఉదాహరణలుగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. గతంతో పోల్చి మెరుగ్గా ఉండటమే కాకుండా, 2047 నాటికి ‘వికసిత భారత్’ లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి చర్యను అంచనా వేయాలని సూచించారు.

టీం స్పిరిట్‌తో పని చేయండి

ప్రస్తుతం సివిల్ సర్వెంట్లు అభ్యసిస్తున్న ఐ గాట్‌ కర్మయోగి వేదిక ప్రభుత్వ మానవ వనరుల రూపాంతరానికి అతి పెద్ద ప్రయత్నమని, అందులో మీరు కీలకమని చెప్పారు. ఏప్రిల్ 2 నుంచి 8 వరకు నిర్వహించిన ‘సాధన సప్తాహ్’లో దేశవ్యాప్తంగా సివిల్ సర్వెంట్లు పాల్గొని సామర్థ్యాభివృద్ధి కార్యక్రమాల్లో భాగమయ్యారని తెలిపారు. ఈ కార్యక్రమంలో 46 లక్షల మంది అభ్యాసకులు 3.1 కోట్లకు పైగా కోర్సులు పూర్తి చేశారని, వారిలో సుమారు 33.4 లక్షల మంది నాలుగు గంటలకు మించిన అభ్యాసాన్ని పూర్తిచేశారని వివరించారు. శాఖల మధ్య అంతరాలను కూలదోసి, ‘ప్రభుత్వం మొత్తం’ దృక్పథంతో కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. డిజిటల్ సాధనాలు, డేటా ఆధారిత విశ్లేషణలను ఉపయోగించి పరిపాలనను మరింత సమర్థవంతంగా, పౌర కేంద్రితంగా మార్చాలని సూచించారు. దేశ ప్రగతి అనేది ప్రతి రాష్ట్రం, ప్రతి విభాగం సాధించిన విజయాల సమాహారమని గుర్తుంచుకోవాలని మోడీ అన్నారు. ఈ వారం మీరు అలవర్చుకున్న టీమ్ బిల్డింగ్ ఆత్మను మీ కార్యాలయ సంస్కృతిగా మార్చుకోండి. మీ ప్రయాణానికి నా శుభాకాంక్షలని ఆయన లేఖను ముగించారు.