Let's talk: editor@tmv.in
ప్రభుత్వ బడులే దేశ భవిష్యత్తుకు పునాదులు: సీఎం రేవంత్ రెడ్డి
ప్రభుత్వ బడులే దేశ భవిష్యత్తుకు పునాదులు: సీఎం రేవంత్ రెడ్డి
ప్రభుత్వ బడులే దేశ భవిష్యత్తుకు పునాదులు: సీఎం రేవంత్ రెడ్డి

ప్రభుత్వ బడులే దేశ భవిష్యత్తుకు పునాదులు: సీఎం రేవంత్ రెడ్డి

Gaddamidi Naveen
12 మే, 2026

నిరుపేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం విద్యా రంగంలో భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. సోమవారం ఎల్‌బీ స్టేడియంలో నిర్వహించిన ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ విద్యా వారోత్సవాల కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కోర్ అర్బన్ ఏరియాలో రూ. 1011 కోట్లతో నిర్మించనున్న 'యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు' శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా విద్యాశాఖ ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను పరిశీలించారు. విద్యా రంగంలో తీసుకుంటున్న సంస్కరణలు వెనుకడుగు వేయకుండా అమలు చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఆయన పేర్కొన్నారు. అలాగే మొత్తం రూ.1700 కోట్లతో విద్యా మౌలిక వసతుల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు.

ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలు దేశ భవిష్యత్తు నిర్మాణ వేదికలని, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థిని తమ సొంత బిడ్డలా చూసుకోవాలని ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ప్రైవేట్ విద్యాసంస్థలకు ధీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా విద్యా రంగంలో వస్తున్న మార్పులను దృష్టిలో ఉంచుకుని, నర్సరీ నుంచి 12వ తరగతి వరకు సమగ్ర విద్యా విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. డ్రాపౌట్స్ తగ్గించేందుకు, ముఖ్యంగా 10వ తరగతి తర్వాత విద్యార్థులు చదువు మధ్యలో మానకుండా ఉండేందుకు కొత్త విధానాలు తీసుకొస్తున్నట్లు చెప్పారు.

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పోషకాహారం అందించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ పథకం అమలు చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే విద్యార్థులకు అవసరమైన వస్తువులపై ప్రభుత్వం రూ.1000 కోట్లు ఖర్చు చేయనుందని, నాణ్యతలో లోపం ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యా రంగానికి రాష్ట్ర బడ్జెట్‌లో 8.22 శాతం కేటాయించిన ప్రభుత్వం, భవిష్యత్తులో దాన్ని 15 శాతం వరకు పెంచే లక్ష్యంతో ముందుకు సాగుతోందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న సుమారు 19 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లో ఉందని, అది బాధ్యతతో కూడిన భావోద్వేగమని ఆయన అన్నారు.

దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉంది. అందుకే నాణ్యమైన విద్యను అందించడానికి ప్రణాళికలు సిద్ధం చేశామ‌ని ఆయ‌న తెలిపారు. ఉపాధ్యాయుల నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ప్రతి సంవత్సరం 500 మంది ఉత్తమ ఉపాధ్యాయులను విదేశాలకు పంపి విద్యా విధానాలను అధ్యయనం చేయించనున్నట్లు ప్రకటించారు. జపాన్, సింగపూర్ వంటి దేశాల విద్యా విధానాలను పరిశీలించనున్నట్లు ఆయ‌న తెలిపారు. విద్యా రంగంలో వస్తున్న ఏఐ, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వంటి మార్పులకు అనుగుణంగా తెలంగాణ విద్యా విధానాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు, ఉపాధ్యాయులకు లక్ష రూపాయల ప్రోత్సాహక బహుమతులు అందించారు. విద్యా సంస్కరణలు పేదల పిల్లల సంక్షేమం కోసమేనని, ఉపాధ్యాయ సంఘాలు, తల్లిదండ్రులతో కలిసి ఈ మార్పులను ముందుకు తీసుకెళ్తామని సీఎం పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, దామోదర్ రాజనర్సింహ, వివేక్ వెంకటస్వామి, ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.